Abn logo
Sep 15 2021 @ 23:16PM

‘యాంత్రీకరణ’కు పైసల్లేవు!

మూడేళ్లుగా నిలిచిపోయిన వ్యవసాయ పనిముట్ల పంపిణీ


సంగారెడ్డి టౌన్‌, సెప్టెంబరు 15: వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అన్నదాతకు రాయితీపై యంత్ర పరికరాలు అందజేయాలని నిశ్చయించింది. సేద్యంలో కూలీల భారాన్ని తగ్గించేందుకు రైతులు కూడా యాంత్రీకరణవైపు మొగ్గు చూపుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రభుత్వం మూడేళ్లపాటు యంత్రాలపై రాయితీని ఇచ్చింది. ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకుంటున్న తరుణంలో సర్కారు ఒక్కసారిగా ఈ పథకాన్ని అటకెక్కించింది. దీంతో పరికరాలు కొనే స్థోమత లేక రైతులు మళ్లీ సంప్రదాయ సాగునే ఆశ్రయిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో అత్యధిక జనాభా సేద్యాన్ని నమ్ముకుని జీవిస్తున్నారు. వర్షాధార పంటలనే ఎక్కువగా సాగుచేస్తుంటారు. గతంలో వ్యవసాయానికి అవసరమైన పనిముట్లను కులవృత్తులవారు తయారు చేసేవారు. కాలక్రమంలో కులవృత్తులు కనుమరుగయ్యాయి. కూలీల సమస్య, సేద్యానికి ఉపయోగపడే మూగజీవాల నిర్వహణ భారంగా మారడంతో రైతులు యంత్రాలపై ఆధారపడడం మొదలుపెట్టారు. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ట్రాక్టర్లు, కల్టివేటర్లు, రోటవేటర్లు, కలుపుతీసే యంత్రాలు, తైవాన్‌ స్ర్పేయర్లు కీలకంగా మారాయి. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ప్రభుత్వం ఈ పరికరాలను రాయితీపై పంపిణీ చేయడంతో రైతులకు ఆర్థికంగా వెసులుబాటు కలిగింది. కానీ మూడేళ్లుగా రాయితీ యంత్రాల పంపిణీ నిలిపివేయడంతో ప్రైవేట్‌ డీలర్ల వద్ద అధిక ధరలకు కొనడం రైతులకు భారంగా పరిణమించింది.


మూణ్ణాళ్ల ముచ్చటగానే యంత్రాల పంపిణీ

తెలంగాణ ఏర్పడిన అనంతరం 2014 నుంచి ప్రభుత్వం అన్నదాతలకు భరోసా కల్పించేందుకు 50 శాతం రాయితీపై వ్యవసాయ పరికరాలను పంపిణీ చేయడం ప్రారంభించింది. 2017 వరకు ప్రతీ సంవత్సరం గుర్తించిన లబ్ధిదారులకు రాయితీపై కింద యంత్రాలను పంపిణీ చేశారు. ఈ విధంగా జిల్లాలో 740 ట్రాక్టర్లు, 24 మినీట్రాక్టర్లు, తొమ్మిది వరికొత యంత్రాలు, రెండు చెరుకు కోత యంత్రాలు, ఒక మొక్కజొన్న కోత యంత్రాన్ని రైతులకు 50 శాతం సబ్సిడీ కింద పంపిణీ చేసింది. కానీ టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం ఈ పథకానికి నీధులు విడుదల చేయడం ఆపేసింది. మరోవైపు జిల్లాలోని రైతులకు పంపిణీ చేసిన యంత్ర పరికరాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీ సొమ్మును ఇప్పటికీ చెల్లించలేదని డీలర్లు వాపోతున్నారు. సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్‌ డీలర్‌ 2017లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 50 శాతం సబ్సిడీపై యంత్ర పరికరాలను పంపిణీ చేయగా.. అందుకు సంబంధించి రూ. 50 లక్షలు బకాయిలు ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయలేదని సమాచారం.