నిధులేవి?

ABN , First Publish Date - 2022-06-23T05:09:16+05:30 IST

అసెంబ్లీ ఎన్నికలు జరిగి మూడున్నరేళ్లు దాటుతున్నా తాండూరు ప్రాంత నిధులు మినహా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నయాపైసా ఇవ్వలేదు.

నిధులేవి?
ఆధునికీకరణకు నోచని కోట్‌పల్లి ప్రాజెక్టు


  • తాండూరులో హామీలకే పరిమితమైన అభివృద్ధి పనులు
  • పట్టిపీడిస్తున్న నిధుల కొరత
  • మూడేళ్లలో నామమాత్రంగా నిధులు ఇచ్చిన ప్రభుత్వం
  • కోట్‌పల్లి ప్రాజెక్టుపై కోటి ఆశలు చల్లారి నట్లే
  • తాండూరుకు ఖనిజ సంపద నిధులు మాత్రమే కేటాయింపు
  • ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌ అండ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్‌కు బ్రేక్‌
  • పొరుగు నియోజకవర్గం కొడంగల్‌కు నిధుల వరద

అసెంబ్లీ ఎన్నికలు జరిగి మూడున్నరేళ్లు దాటుతున్నా తాండూరు ప్రాంత నిధులు మినహా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నయాపైసా ఇవ్వలేదు. ప్రభుత్వంపై గంపెడాశలు పెట్టుకున్న స్థానిక ప్రజానీకానికి రాష్ట్ర ప్రభుత్వం మొండిచేయి చూపిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

తాండూరు, జూన్‌ 22 :  అసెంబ్లీ ఎన్నికలు జరిగి మూడున్నరేళ్లు దాటుతున్నా తాండూరు ప్రాంతానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నయాపైసా ఇవ్వలేదు. ప్రభుత్వంపై గంపెడాశలు పెట్టుకున్న స్థానిక ప్రజానికానికి మొండిచేయే చూపింది.  కనీసం ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన మెడికల్‌ కళాశాలను కూడా తాండూరులో ఏర్పాటు చేయలేకపోయారు. తాండూరు పరిసర ప్రాంతాల నుంచి సుద్ద, నాపరాయి ఖనిజాల ద్వారా జిల్లా ఖాతాలో జమ అయిన మైన్స్‌ డీఎంఎ్‌ఫటీ(డిసి్ట్రిక్ట్‌ మినరల్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌)నిధులు రూ.30 కోట్ల వరకు ఇక్కడి ప్రాంతం నిధులు ఇక్కడికే కేటాయించారు. ఈ నిధుల్లో రూ.10 కోట్లు ఆయా గ్రామాల్లో శానిటేషన్‌ కోసం, ట్రాక్టర్ల కొనుగోలు రూ.16 కోట్లు వివిధ గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వల కోసం స్థానిక ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ద్వారా కేటాయించారు. తాండూరుకు ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌ అండ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్‌కు రూ.14కోట్ల పై చిలుకు నిధులు మంజూరైన ట్లు ఏడాది కాలంగా ప్రకటిస్తున్నప్పటికీ ఇప్పటివరకు కనీసం శంకుస్థాపన కూడా చేయలేదు. తాండూరు వ్యవసాయ నూతన మార్కెట్‌ ఏర్పాటు, జినుగుర్తిలో ఇండస్ట్రియల్‌ పార్కు, ఈఎ్‌సఐ ఆసుపత్రి, పెద్దేముల్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అప్‌గ్రేడ్‌, ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌, పార్కుకోసం రూ.6కోట్ల వరకు కేటాయింపులు జరిగాయి. గొల్లచెరువు సుందరీకరణ పనులను మధ్యలోనే వదిలేశారు. అభివృద్ధి పనులు హామీలకే పరిమితమయ్యాయి. తాండూరు పట్టణంలోని ఆదర్శ్‌నగర్‌లో పార్కు పనులను కూడా పెండింగ్‌లో పెట్టారు. 

పొరుగు నియోజకవర్గానికి నిధుల వరద

తాండూరుకు ఆనుకుని ఉన్న కొడంగల్‌ నియోజకవర్గానికి మాత్రం నిధులు పెద్ద ఎత్తున కేటాయిస్తున్నారు. తాండూరుపై మాత్రం నర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 16న ఒక్కరోజే మంత్రిహరీ్‌షరావు ఆ ఒక్క నియోజకవర్గంలోనే సుమారు రూ.50కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రూ.5కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రారంభించగా, రూ.4కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌ అండ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్‌కు శంకుస్థాపన చేశారు. ఒక్క మద్దూరు మండలంలోనే సెంట్రల్‌లైటింగ్‌, ఆర్‌అండ్‌బీ వైడింగ్‌ కోసం రూ.5కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఆ మండలంలో 30పడకల ఆసుపత్రి భవనాన్ని రూ.4కోట్ల వ్యయంతో నిర్మించి ప్రారంభించారు. తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొన్నేళ్లుగా ఆరు పడకలతోనే కొనసాగుతున్నప్పటికీ అప్‌గ్రేడ్‌కు నోచడం లేదు. కొడంగల్‌లో రూ.6కోట్లతో 50పడకల ఆసుపత్రి భవనం ప్రారంభించారు. శాసనసభ ఎన్నికలు ఇంకా ఏడాదిన్నర గడువున్నప్పటికీ ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో మళ్లీ హామీలిచ్చి ఆదమరుస్తారో వేచిచూడాలి. 

కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునికీకరణ లేనట్లే..

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే అతి పెద్దదైన కోట్‌పల్లి నీటి పారుదల ప్రాజెక్టు ఆధునికీకరణ కోసం ప్రతి ఏటా ప్రభుత్వానికి ప్రతిపాదన చేస్తున్నా నిధులు మాత్రం విడుదల చేయడం లేదు. ప్రతిఏటా ఎస్టిమెట్లు పెరుగుతున్నాయే తప్పా నిధులు మంజూరు జాడే లేదు. 9,200 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించి రైతులకు మేలు చేసే ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదు. అదేస్థాయిలో తాగునీరందించే చర్యలు చేపట్టడం లేదు. రూ.100కోట్ల వ్యయంతో ప్రాజెక్టును ఆధునికీకరిస్తే పూర్తిస్థాయిలో సాగునీరందిస్తే వానాకాలం, యాసంగి సీజన్‌లో రైతులకు ఉపయోగపడే అవకాశం ఉంది. 24 ఫీట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు ప్రతిఏటా సామర్థ్యానికి మించి నీరు నిండి అలుగు పారి వృఽథాగా పోతుంది. అయినా ఈ ప్రాజెక్టు ఆధునికీకరణకు పాలకులు ఎవరూ శ్రద్ధ చూపడం లేదు. 

Updated Date - 2022-06-23T05:09:16+05:30 IST