మహబూబ్‌సాగర్‌కు మహర్దశ ఎప్పుడో?

ABN , First Publish Date - 2022-05-01T05:26:34+05:30 IST

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మహబూబ్‌సాగర్‌ చెరువు కట్టపై పట్టణవాసులు ప్రతీరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్‌ చేస్తుంటారు. సాయంత్రాలు ఆహ్లాదకరమైన వాతావరణం గడపడానికి కుటుంబాలతో తరలివస్తారు. ఇటీవల మున్సిపల్‌ అధికారులు చెరువుకట్టపై ఓపెన్‌జిమ్‌ను ఏర్పాటు చేయడంతో సందర్శకుల సంఖ్య పెరిగింది.

మహబూబ్‌సాగర్‌కు మహర్దశ ఎప్పుడో?
నిరుపయోగంగా ఉన్న బోటింగ్‌ ఫ్లాట్‌ఫారం

ప్రతిపాదనలకే పరిమితమైన సుందీరకరణ పనులు
పైసా విదిల్చని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

సంగారెడ్డి టౌన్‌, ఏప్రిల్‌ 30 : సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మహబూబ్‌సాగర్‌ చెరువు కట్టపై పట్టణవాసులు ప్రతీరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్‌ చేస్తుంటారు. సాయంత్రాలు ఆహ్లాదకరమైన వాతావరణం గడపడానికి కుటుంబాలతో తరలివస్తారు. ఇటీవల మున్సిపల్‌ అధికారులు చెరువుకట్టపై ఓపెన్‌జిమ్‌ను ఏర్పాటు చేయడంతో సందర్శకుల సంఖ్య పెరిగింది. మహబూబ్‌సాగర్‌ నిండుగా ఉంటే పట్టణంలో భూగర్బజలాలు బాగుంటాయి. ప్రతీ ఏటా వినాయకచవితికి పట్టణంతో పాటు పోతిరెడ్డిపల్లి, అంగడిపేట, చింతల్‌పల్లి, మల్కాపూర్‌ ప్రాంతాల నుంచి విగ్రహాలను ఇక్కడే నిమజ్జనం చేస్తుంటారు. ప్రతీ సంవత్సరం బతుకమ్మ పండగకు వేలాది బతుకమ్మలను ఇందులోనే నిమజ్జనం చేస్తుంటారు. 

నెరవేరని మంత్రి హామీ
మహబూబ్‌సాగర్‌ చెరువును సిద్దిపేటలోని కోమటి చెరువు తరహాలో అభివృద్ధి చేస్తామని మంత్రి హరీశ్‌రావు 2017లో హామీ ఇచ్చారు. కానీ చెరువు సుందరీకరణ కాగితాలకే పరిమితమైంది. అధికారులు తయారుచేసిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. కలెక్టర్‌ చొరవతో 2018లో చెరువు కట్టపై వేసిన బీటీ రోడ్డు కూడా ప్రస్తుతం కంకరతేలి, గుంతలమయంగా మారింది. ఓపెన్‌ జిమ్‌కు రక్షణ లేదని వాకర్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

2010లో రూ.3.60 కోట్లతో పనులు
జిల్లాకేంద్రంలో మినీ ట్యాంక్‌బండ్‌గా పేరున్న మహబూబ్‌సాగర్‌ను సుందరీకరించేందుకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి చొరవతో 2010లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.3.60 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను అప్పటి ముఖ్యమంత్రి కే.రోశయ్య స్వయంగా ప్రారంభించారు. అప్పట్లో చెరువులో బోటింగ్‌ ప్లాట్‌ఫాం, రెండు ఇంజన్‌ బోట్లు, మూడు పెడల్‌ బోట్లను ఏర్పాటు చేశారు. చెరువు కట్టపై విద్యుద్దీపాలు, బెంచీలను ఏర్పాటు చేశారు. బతుకమ్మ ఘాట్లు నిర్మించారు. ఆ బెంచీలు ప్రస్తుతం విరిగిపోయాయి. రెండు ఇంజన్‌ బోట్లను గతేడాది హైదరాబాద్‌కు తరలించారు. మిగిలిన మూడు పెడల్‌బోట్లు మరమ్మతులకు గురవడంతో ఎవరూ ప్రయాణించడం లేదు. బోటింగ్‌ ప్లాట్‌ఫాం నిరుపయోగంగా మారడంతో గుర్రపుడెక్క, పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. అప్పట్లో ఏర్పాటు చేసిన విద్యుద్దీపాల స్తంబాలు లైట్లు లేక అలంకారప్రాయంగా మారాయి.

శిథిలావస్థలో అలుగు, తూము
చెరువు అలుగు, తూము శిథిలావస్థకు చేరుకున్నాయి. చెరువు నుంచి ఆయకట్టుకు వ్యవసాయం కోసం నీటిని వదలాల్సిన తూము శిథిలావస్థకు  చేరడంతో నీరు లీకవుతున్నది. అలుగు పూర్తిగా దెబ్బతిన్నది. గత వర్షాకాలంలో భారీ వర్షాలకు అలుగు నుంచి భారీగా నీరు ప్రవహించడంతో  గోతులమయంగా మారింది. గుర్రపుడెక్క, పిచ్చి మొక్కలు, నాచు చెరువును కమ్మేస్తున్నాయి. పట్టణంలోని వివిధ కాలనీల నుంచి సేకరించిన వ్యర్థాలను చెరువులో పారబోస్తుండటంతో చెరువు దుర్గంధం వెదజల్లుతున్నది. 2021 జూన్‌లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెరువు సందర్శించి, వ్యర్థాలు పారబోయకుండా చెరువుకట్టపై ప్రహారీని నిర్మించాలని అధికారులను ఆదేశించారు. పదినెలలు గడుస్తున్నా ఆచరణకు నోచుకోలేదు. 

Updated Date - 2022-05-01T05:26:34+05:30 IST