పంచాయతీలకు నిధులేవీ..?

ABN , First Publish Date - 2020-08-15T09:58:27+05:30 IST

అసలే కరోనా.. ఆపై సీజనల్‌ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉండడంతో గ్రామాల్లో ప్రధానంగా పారిశుధ్యంపై దృష్టి సారించాల్సి ఉంది.

పంచాయతీలకు నిధులేవీ..?

సుమారు రూ.50 లక్షల బిల్లులు పెండింగ్‌

కార్యదర్శులకు తలలు బొప్పి


గోపవరం, ఆగస్టు 14: అసలే కరోనా.. ఆపై సీజనల్‌ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉండడంతో గ్రామాల్లో ప్రధానంగా పారిశుధ్యంపై దృష్టి సారించాల్సి ఉంది. అయితే పంచాయతీలకు నిధులు రావడం ఆలస్యమవుతుండడంతో ఆయా పంచాయతీ కార్యదర్శుల తలలు బొప్పి కడుతున్నాయి. గతంలో చేసిన పనులకే సుమారు రూ.50 లక్షలకు పైగా బిల్లులు పెండింగులో ఉన్నాయి. పారిశుధ్యం, మోటర్ల మరమ్మతులు, నీటి రవాణా తదితర వాటికి గత ఆరు నెలలుగా ఎలాంటి నిధులు రాకపోవడంతో ప్రస్తుతం పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని, ఈ పరిస్థితుల్లో గ్రామాల్లో మెరుగైన పారిశుధ్య పనులు చేపట్టాలంటే ఇబ్బందికరంగా ఉందని అంటున్నారు. 


మండలంలో ఏడు పంచాయతీలు ఉండగా వీటిలో బ్రాహ్మణపల్లె, రామాపురం పంచాయతీలను మోడల్‌ పంచాయతీలుగా ఎంపిక చేసి ఆ గ్రామాల్లో పారిశుధ్య పనులను వేగవంతం చేశారు. వీటన్నింటికీ పంచాయతీ కార్యదర్శులు అప్పో సప్పో చేసి తీసుకువచ్చి పనులు నిర్వహిస్తున్నామని వారు వాపోతున్నారు. ప్రభుత్వం ఫీజింగ్‌ పేరుతో నిధులు డ్రా చేసుకోకుండా చేయడంతో నిధులు లేక నానా అవస్థలు పడుతున్నారు. గతంలో ఆయా పంచాయతీల్లో పనులు చేసిన వారికి కూడా బిల్లులు కాక ఇబ్బందులు పడుతున్నామని, కరోనా కష్టకాలంలో రావాల్సిన బిల్లులు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పనులు చేసిన కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఇప్పటికైనా నిధులు విడుదల చేసి పంచాయతీల అభివృద్ధికి కృషి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.


పారిశుధ్య సమస్యలు రానివ్వం - ఈవోపీఆర్‌డీ, విజయకుమార్‌

కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా పారిశుధ్య సమస్యలు రానివ్వమని ఈవోపీఆర్‌డీ విజయకుమార్‌ పేర్కొన్నారు. నిధుల సమస్య ఉన్నప్పటికీ మండలంలోని పంచాయతీ కార్యదర్శులంతా సమన్వయంతో పనిచేస్తూ పారిశుధ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తున్నారన్నారు. మండలంలో బ్రాహ్మణపల్లె, రామాపురం మోడల్‌ పంచాయతీలుగా ఎంపిక చేయడంతో అక్కడ అభివృద్ధి పనులను వేగవంతం చేశామని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-15T09:58:27+05:30 IST