ఉచిత బియ్యం.. ఈ నెలా లేనట్లే

ABN , First Publish Date - 2022-06-17T06:20:12+05:30 IST

దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదన్నట్లయింది పరిస్థితి.

ఉచిత బియ్యం.. ఈ నెలా లేనట్లే

కేంద్రం కేటాయిస్తున్నా రెండు నెలలుగా ఇవ్వని రాష్ట్రం 


దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదన్నట్లయింది పరిస్థితి. ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్నయోజన కింద కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం కోటా కేటాయిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఇప్పటికే పేదలకు రెండు నెలలుగా ఉచిత బియ్యం అందకపోగా.. జూన్‌లోనూ పంపిణీ అయ్యే పరిస్థితులు కనిపించడంలేదు. కొవిడ్‌ మొదటి దశలో పేదలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. మొదటి దశలో 2020 ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు, రెండో దశలో అదే ఏడాది జూలై నుంచి నవంబరు వరకు బియ్యాన్ని అందించింది. గతేడాది మే నుంచి జూన్‌ వరకు మూడో దశలోను.. గతేడాది జూలై నుంచి నవంబరు వరకు నాలుగో దశలోను.. డిసెంబరు నుంచి ఈ ఏడాదిమార్చి వరకు ఐదో దశలో చౌకదుకాణాల ద్వారా పేదలకు ఉచితం బియ్యం పంపిణీ చేశారు. ఆరో దశగా ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు బియ్యం పంపిణీ జరగాల్సి ఉంది. కానీ, ఏప్రిల్‌, మే నెలల్లో ఇవ్వాల్సిన బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం కోటా కేటాయించినా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ ఆపేసింది. ఈ పథకాన్ని కొనసాగిస్తుందా లేదా నిలిపేస్తుందా అన్న విషయంపై అధికారుల్లోనూ స్పష్టత లేదు. షాపుల ద్వారా ఈ నెల 18 నుంచి కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభం కావాలి. ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. దీంతో పేదలు రేషన్‌ దుకాణాలకు వెళ్లి ఉచిత బియ్యం ఇస్తున్నారా? లేదా అనే విషయాన్ని డీలర్ల వద్ద వాకబు చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో జిల్లాలోని 31 మండలాలకు సంబంధించి 531038 మంది కార్డుదారులు ఎదురు చూస్తున్నారు. ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున ఈ కార్డుల్లో ఎంత మంది ఉంటే అంత మేరకు పేదలకు ఉచితంగా బియ్యం అందాల్సి ఉంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వ చర్యతో వరుసగా మూడో నెలైన జూన్‌లోనూ వీరంతా ఉచిత బియ్యాన్ని నష్టపోయినట్లే. 


ఇంకా సమాచారం లేదు

కేంద్ర  ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం ఈ నెల పంపిణీ జరుగుతుందో లేదో చెప్పలేం. బియ్యం పంపిణీపై మాకు ఎలాంటి సమాచారం అందలేదు. ప్రభుత్వం కేటాయింపులు జరిపితే బియ్యం అందిస్తాం. రేషన్‌ దుకాణాల ద్వారా కార్డుదారులకు సమాచారమిస్తాం. 

- ఇ.శంకరన్‌, డీఎస్వో, చిత్తూరు


- చిత్తూరు కలెక్టరేట్‌


Updated Date - 2022-06-17T06:20:12+05:30 IST