ఈనెలా ఉచిత బియ్యం లేనట్టేనా!

ABN , First Publish Date - 2022-05-20T07:24:51+05:30 IST

మే నెల 18వ తేది వచ్చినా రేషన్‌ షాపులకు ఉచిత కోటా బియ్యం సరఫరా కాలేదు.

ఈనెలా ఉచిత బియ్యం లేనట్టేనా!

ఇప్పటికీ రేషన్‌ షాపులకు చేరని పరిస్థితి 

ఏప్రిల్‌లోనూ ఇవ్వని వైనం

ఉమ్మడి జిల్లాలో 35.77 లక్షల మందిలో నిరాశ 



జిల్లాల పునర్వ్యవస్థీకరణతో రేషన్‌ బియ్యం పంపిణీ ఆలస్యమైంది. అందుకని ఉచిత బియ్యం ఇవ్వలేకపోయాం. మే నెలలో ఏప్రిల్‌ కోటాతో కలిపి ఇస్తాం. 

- ఇటీవల జిల్లా అధికారుల మాట ఇది. 


ఇప్పటి పరిస్థితులను చూస్తుంటే ఈ నెల ఉచిత బియ్యం కూడా అందే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే.. 17వ తేది నుంచే బియ్యం పంపిణీ మొదలు కావాలి. కానీ 18వ తేదీకి కూడా రేషన్‌ షాపులకు బియ్యం చేరలేదు. ఉచిత బియ్యంపై అధికారులకూ ఎటువంటి సమాచారం రాలేదు. 


కరోనా నేపథ్యంలో పేదల కడుపు నింపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్నయోజన’ పేరిట ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభించింది. రేషన్‌కార్డుదారులకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం ఇస్తోంది. దీనికోసం రాష్ట్రాలకు ధాన్యం లేదా నగదు ఇస్తోంది. మనది ధాన్యం పండించే రాష్ట్రం కావడంతో ఇక్కడి ప్రభుత్వమే బియ్యం పంపిణీ చేస్తుండగా.. కేంద్రం నగదు ఇస్తోంది. ఉచిత కోటా మార్చి నెలతో ముగియాల్సి ఉండగా కేంద్రం మరోసారి ఐదు నెలలు పొడిగించింది. దీంతో ఆయా నెలల్లో రెగ్యులర్‌ రేషన్‌ కోటా పంపిణీ ముగిశాక.. 17వ తేది నుంచి ఉచిత బియ్యం ఇచ్చేవారు. ఈ క్రమంలో ఏప్రిల్‌ నెల ఉచిత బియ్యం పంపిణీ చేయలేదు. రెండు నెలల బియ్యం కలిపి మే నెలలో ఇస్తామని గత నెలలో అధికారులు ప్రకటించారు. ఇప్పుడు మే నెల 18వ తేది వచ్చినా రేషన్‌ షాపులకు ఉచిత కోటా బియ్యం సరఫరా కాలేదు. అసలు ఇస్తారా? లేదా? అనే సమాచారమూ ఇవ్వలేదు. ఇప్పటికీ పంపిణీ ప్రక్రియే మొదలు కాలేదంటే.. వరుసగా రెండో నెలలోనూ పేదలకు ఉచిత బియ్యం లేనట్టే. కేంద్రం ఉచిత బియ్యం ఇచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, అనాసక్తితో ఉమ్మడి జిల్లాలోని 35,77,187 మంది పేదలకు రెండు నెలలుగా బియ్యం అందని పరిస్థితి. దీనిపై వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2901 రేషన్‌ షాపుల పరిధిలో 11,46,405  రేషన్‌ కార్డులున్నాయి. ఇందులో 35,77,187 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున 18 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం కావాలి.  రెండు నెలల కోటా మేలో ఇస్తారని ఎదురు చూసిన కార్డుదారులు.. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో నిరాశ చెందారు. 

- చిత్తూరు (కలెక్టరేట్‌)

Updated Date - 2022-05-20T07:24:51+05:30 IST