ఉచిత రేషన్‌ బియ్యం.. లేనట్టేనా..?

ABN , First Publish Date - 2022-05-18T06:42:07+05:30 IST

కేంద్రం ఇస్తున్న ఉచిత రేషన్‌కు రెండు నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు.

ఉచిత రేషన్‌ బియ్యం.. లేనట్టేనా..?

ప్రభుత్వం నుంచి స్పందన నిల్‌

జిల్లా అధికారులకు రాని ఆదేశాలు 

8.33 లక్షల మంది ఎదురుచూపు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

కేంద్రం ఇస్తున్న ఉచిత రేషన్‌కు రెండు నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు.  జిల్లా అధికా రులకు ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. బియ్యం రవాణాపై అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారు. ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. గత నెలలో ఉచిత రేషన్‌ ఇవ్వలేదు. రెండు నెలల రేషన్‌ ఒకేసారి ఇస్తారంటూ అధికారులు భావించారు. లబ్ధిదా రులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే షార్టెక్స్‌ రేషన్‌ బియ్యం ఏప్రిల్‌లో జాప్యం జరిగింది. జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ కారణంగా నాలుగో తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన రేషన్‌ పంపిణీ నిలిచిపోయింది. మరో నాలుగు రోజుల తర్వాత గత నెల రేషన్‌ పంపిణీ చేశారు. దీంతో కేంద్రం ఇచ్చే ఉచిత రేషన్‌ ఏప్రిల్‌లో ఇవ్వలేకపోయారని అంతా అనుకున్నారు. ఈ నెలలో షార్టెక్స్‌ బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సకాలంలోనే పంపిణీ చేసింది. అయితే 15వ తేదీ తర్వాత రెండు నెలల రేషన్‌ ఒకేసారి ఇస్తారన ్న ఆశలకు గండిపడుతోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లకు బియ్యం రవాణా చేయడం లేదు. ఉచిత రేషన్‌ బియ్యంలో నాన్‌ షార్టెక్స్‌ బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) వద్ద ఉన్న నిల్వలను పంపిణీ చేస్తున్నారు. రెండు నెలల నుంచి ఎఫ్‌సీఐకు ఆదేశాలు రాలేదు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా అనుమతులు మంజూరుచేయాలి. పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నిధులను రీఎంబర్స్‌ చేస్తుంది. అంటే ఎఫ్‌సీఐకు రాష్ట్ర ప్రభుత్వం ముందుగా సొమ్ములు చెల్లించాలి. ప్రభుత్వం వద్ద పెట్టుబడి సొమ్ములు లేకపోవడం వల్లే రెండు నెలల నుంచి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని సమాచారం. ఫలితంగా ఉచిత రేషన్‌ పంపిణీ నిలిచిపోయింది. 

అక్టోబరు వరకు ఉచిత రేషన్‌ ఇస్తామంటూ కేంద్రం ప్రకటించింది. మే నుంచి కొత్తగా ఉచిత రేషన్‌ ప్రారంభం కావాలి. ప్రతి నెల మొదటి 15 రోజులు రాష్ట్ర ప్రభుత్వం షార్టెక్స్‌ బియ్యం కిలో రూపాయికే లబ్ధిదారులకు అందజేస్తోంది. మూడో వారంలో ఉచిత బియ్యం సరఫరా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం వల్లే కేంద్రం ఉచిత రేషన్‌కు పచ్చ జెండా ఊపలేదు. రాష్ట్రం స్పందించకపోతే కేంద్రం పొడిగించిన ఆరు నెలల ఉచిత రేషన్‌కు లబ్ధిదారులు దూరం కావాల్సిందే. నిజానికి జిల్లాలో ఒక్కో విడతలో రేషన్‌ పంపిణీకి 7,124 టన్నుల బియ్యం అవసరం. 8.33 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వారంతా ఉచిత రేషన్‌కు దూరం కానున్నారు. ఇప్పటి వరకు జిల్లా అధికారులకు ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఈ నెల ఉచిత రేషన్‌ ఉండదన్న వాదనకు బలం చేకూరుతోంది. 

Updated Date - 2022-05-18T06:42:07+05:30 IST