వరద భయం పోయేనా..!

ABN , First Publish Date - 2021-05-17T05:54:16+05:30 IST

రాష్ట్రంలోని వందేళ్ళకు పైగా చరిత్ర కలిగిన పురపాలక సంఘాల్లో నంద్యాల ఒకటి. బ్రిటీష్‌ వారి హయాంలో ఏర్పడిన నంద్యాల పురపాలక సంఘానికి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది.

వరద భయం పోయేనా..!

  1. నదులు.. కాల్వల నడుమ నంద్యాల
  2. భారీ వర్షాలు కురిస్తే లోతట్టు జలమయం
  3. 15 ఏళ్లుగా స్తంభిస్తున్న జనజీవనం.. రూ.కోట్ల ఆస్తి నష్టం
  4. కొత్త కౌన్సిల్‌ ఏర్పడింది.. నిధులు తెప్పిస్తారా..!
  5. మున్సిపల్‌ ఎన్నికల్లో వరదపైనే ఎక్కువ హామీలు


నంద్యాల, మే 16: రాష్ట్రంలోని వందేళ్ళకు పైగా చరిత్ర కలిగిన పురపాలక సంఘాల్లో నంద్యాల ఒకటి. బ్రిటీష్‌ వారి హయాంలో ఏర్పడిన నంద్యాల పురపాలక సంఘానికి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇలాంటి మున్సిపాల్టీని ఒకటిన్నర దశాబ్దాలుగా వరద సమస్య వేధిస్తోంది. వరద వస్తే పట్టణంలో నీట మునుగుతోంది. జనజీవనం అతలాకుతలం అవుతోంది. వరద రక్షణ గోడల నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. వర్షాకాలం అప్పుడే ప్రారంభమైనట్లు ఉంది. అకాల వర్షాలు, తుపాను.. వేసవిని మరిపిస్తున్నాయి. రుతుపవనాలు మొదలై.. వాగులు, నదులు ఉప్పొంగక మునుపే మున్సిపల్‌ పాలకవర్గం వరద సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. 


వెంటాడే వరద

కుందూనది ఉప్పొంగి మద్దిలేరు, చామకాల్వల ఉగ్రరూపం దాలిస్తే నంద్యాల ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. 15 సంవత్సరాలుగా ఇలా భయం గుప్పిట్లో బతుకున్నారు. మునిగిన ప్రతిసారీ జనజీవనం స్తంభిస్తోంది. కోట్లాది రూపాయల ఆస్తినష్టం జరుగుతోంది. వేలాది మంది నిరాశ్రయులు అవుతున్నారు. దళితపేట, ఆంజనేయస్వామి వీధి, బైటిపేట, తెలుగుపేట, సంగపేట, పీవీ నగర్‌, నడిగడ్డ, సలీం నగర్‌, వీసీ కాలనీ, విశ్వనగర్‌, శ్యామ్‌నగర్‌, పద్మావతి నగర్‌ ప్రాంతాలు మునిగిపోతున్నాయి. రూరల్‌ పరిధిలో ఉన్న రైతునగరం, వెంకటేశ్వరపురం, ఊడుమాల్పురం, క్రాంతినగర్‌, పొన్నాపురం, కొత్తపల్లె పరిధిలోకి కొంత భాగం మున్సిపాలిటీ పరిధిలోకి చేరాయి. కుందూ, చామకాలువ, మద్దిలేరుల ప్రభావంతో రూరల్‌ పరిధిలో కూడా భూములు ముంపునకు గురవుతున్నాయి.

 

రూ.150 కోట్లు అవసరం

నంద్యాల ప్రజలను వరద నుంచి కాపాడేందుకు రూ.150 కోట్లు అవసరమని అంచనా. పట్టణం చుట్టూ కుందూ, చామకాలువ, మద్దిలేరు ఉన్నాయి. భారీ వర్షాలు కురిసినప్పుడు ఎగువ నుంచి వచ్చే వరదకు పట్టణంలోని లోతట్టు కాలనీలన్నీ నీట మునుగుతున్నాయి. వరద సమస్య శాశ్వత పరిష్కారానికి రూ.150 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అధికారులు అంటున్నారు.  బడ్జెట్‌ ప్రణాళిక రూపొందించాల్సి ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.


వెనక్కి మళ్లిన నిధులు

వరద ముంపు నుంచి నంద్యాలను కాపాడేందుకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం రూ.98 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో కుందూ, చామకాల్వ, మద్దిలేరులపై కాంక్రీట్‌ రక్షణ గోడలు, మట్టి కట్టలు, బ్రిడ్జిలు, ఇన్‌లెట్లు నిర్మించాలని ప్రతిపాదించారు. చామకాల్వపై చేపట్టే పనులను రెండు రీచ్‌లుగా విభజించారు. మొదటి రీచ్‌లో 0.0 కి.మీ నుంచి 3.3 కి.మీ. వరకు రూ.21 కోట్ల పనులు, రెండో రీచ్‌లో 3.3 కి.మీ. నుంచి 6.7 కి.మీ. వరకు రూ.23 కోట్లతో పనులు చేయాలని నిర్ణయించారు. 


మద్దిలేరుపై రూ.14 కోట్ల పనులు, చిన్న చెరువు కట్టను బలోపేతం చేసి ఎత్తు పెంచేందుకు రూ.4 కోట్లతో పనులు ప్రతిపాదించారు. కుందూనదిపై మొదటి రీచ్‌లో 2 కి.మీ. నుంచి 5 కి.మీ. వరకు రూ.13.51 కోట్లు, రెండో రీచ్‌లో 5 కి.మీ. నుంచి 6.8 కి.మీ. వరకు రూ.16.84 కోట్లు ఖర్చు చేయడానికి ప్రతిపాదించారు. 


టెండర్‌ ప్రక్రియ పూర్తి అనంతరం పనులను 24 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. కానీ 12 ఏళ్ళ క్రితం ఈ పనులు పురుటి దశలోనే నిలిచిపోయాయి. చామకాల్వపై మొదటి రీచ్‌లో రూ.21 కోట్ల పనులకు గాను రూ.3 కోట్ల పనులు మాత్రమే జరిగాయి. రెండో రీచ్‌లో రూ.23 కోట్ల పనులు జరగాల్సి ఉండగా కేవలం రూ.20 లక్షల పనులు జరిగాయి. మద్దిలేరుపై రూ.14 కోట్ల పనులకు గాను రూ.5.5 కోట్ల పనులు పూర్తి చేశారు. చిన్న చెరువు కట్ట బలోపేతం, వెడల్పును రూ.4 కోట్ల అంచనాతో వందశాతం పనులు పూర్తి చేశారు.


కుందూ నదిపై చేపట్టాల్సిన పనులకు రైల్వేశాఖ, రోడ్లు భవనాల శాఖ నుంచి అనుమతుల విషయంలో జాప్యం జరగడంతో టెండర్లు రద్దయ్యాయి. కుందూనదిపై చేపట్టాల్సిన రూ.31 కోట్ల పనులు ఇంచు కూడా కదల్లేదు. ఈ నేపథ్యంలో అప్పట్లో మంజూరైన నిధులు వెనక్కి మళ్లాయి


నిధులు తెప్పిస్తారా..?

నంద్యాలలో కొత్త కౌన్సిల్‌ కొలువుదీరి దాదాపు రెండు నెలల అవుతోంది. పట్టణాన్ని వరద ముంపు నుంచి కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తెప్పించాల్సిన బాధ్యత కొత్త కౌన్సిల్‌పై ఉంది. వరద కష్టం నుంచి మున్సిపల్‌ ప్రజలను గట్టెక్కించే అంశం ఈ ఎన్నికల్లో చర్చనీయాంశం అయింది. ఎన్నికలు ముగిశాయి. అధికారపార్టీ వారికే మున్సిపాలిటీ దక్కింది. ఇకనైనా నిధులు తెప్పించి.. వరద కష్టం నుంచి నంద్యాలను గట్టెక్కించాల్సిన బాధ్యత సభ్యులపై ఉంది. 

Updated Date - 2021-05-17T05:54:16+05:30 IST