సంభ్రాంతే..!

ABN , First Publish Date - 2021-01-13T05:57:07+05:30 IST

ఏంది గోపన్నా..! దిగాలుగున్నావు.. సంక్రాంతి ముచ్చట్లేంటీ..? మాట కలిపాడు హరిదాసు. ఏమనిసెప్పేది.. నీవూ పల్లెలు తిరుగుతున్నావ్‌..! ఈయేడు రైతులు పడుతున్న కష్టాలు నీకెరుకే కదా..!

సంభ్రాంతే..!

వర్షాలు, వరదలకు భారీగా దెబ్బతిన్న పంటలు

ఇల్లు చేరని ధాన్యరాసులు.. కొత్త పంటలు

కరోనా కల్లోలంతో చితికిపోయిన సామాన్యులు

చుక్కల్లో నిత్యావసర సరుకుల ధరలు

గండికోట ముంపు గ్రామాల్లో కళతప్పిన పండుగ

ఏ ఇంట చూసినా కన్నీటి కష్టాలే

పల్లెసీమల్లో కనిపించని సంక్రాంతి శోభ


(కడప-ఆంధ్రజ్యోతి): సంక్రాంత్రి పండుగప్పుడు మాత్రమే కనిపించే హరిదాసు.. చిరుగంటలూ, సన్నాయీ కలగలసిన బసవన్న అడుగులు. మకర సంక్రాంతి వచ్చిందంటే పల్లెసీమల ముంగిట వాలిపోతారు. ప్రతియేటలాగే ఈ ఏడాది మకర సంక్రాంతికి ముందే హరిదాసు, గంగిరెద్దు గోపన్న కడప గడపన పల్లెల్లో అడుగు పెట్టారు. తన కీర్తనలతో ఆధ్యాత్మికతను వివరిస్తూ హరిదాసు.. మనిషి పశువులు, జంతువులను ఎలా మచ్చిక చేసుకుంటారో.. వాటిని ఎలా పూజిస్తారు జనాలకు తెలియజేస్తూ గంగిరెద్దుల గోపన్నలు అలా గ్రామాలు చుట్టేస్తూ.. మధ్యాహ్నం వేళ రెండు గ్రామాల కూడలిలో ఎదురెదురు పడ్డారు. ఇద్దరి మొహాల్లోనూ పండుగ ఆనందం లేదు. దిగాలుగా ఓ చెట్టు నీడన చేరారు. తలపై ఉన్న పాత్రను రాతిబండపై పెట్టి పక్కనే కూర్చున్నారు హరిదాసు.. గంగిరెద్దును చెట్టుకు కట్టేసి హరిదాసు పక్కనే సేదతీరాడు గోపన్న. ఏంది గోపన్నా..! దిగాలుగున్నావు.. సంక్రాంతి ముచ్చట్లేంటీ..? మాట కలిపాడు హరిదాసు. ఏమనిసెప్పేది.. నీవూ పల్లెలు తిరుగుతున్నావ్‌..! ఈయేడు రైతులు పడుతున్న కష్టాలు నీకెరుకే కదా..! తుఫాన్‌.. మాయదారి కరోనా కల్లోలం.. చుక్కలు తాకిన సరుకుల ధరలు.. గండికోట ముంపు పల్లెల్లో జనాలు పడుతున్న అవస్థలేమని సెప్పేది.. ఒకటా రెండా..! ఎన్నని సెప్పేది హరిదాసు..! ఇలా ఇద్దరి మధ్య సంభాషణ మొదలైంది. 


హరిదాసు: గోపన్నా..! ఒకనాడు సంక్రాంతంటే పల్లెల్లో ఆ సంబరమే వేరు.. ఇండ్లన్నీ కొత్త పంటలు, ధాన్యరాసులు నిండి.. పండక్కొచ్చిన ఆడబిడ్డలతో సందడిగా ఉండేది. సందుసందున రంగురంగుల ముగ్గులు.. అంతటా సంక్రాంతి సందడే కనబడేది. ఏ ఇంటికెళ్లినా తలపై పాత్ర నిండా ధాన్యం పోసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. రైతులను చూస్తే కడుపు తరుక్కుపోతోంది.

గోపన్న: అవును హరిదాసూ..! రైతుల్నీ చూస్తే కడుపు తరుక్కుపోతుంది. తుఫాన్‌, వానలు ముంచినాయ్‌... అప్పోసప్పో చేసి చేన్లో పోస్తే పంట చేతికొచ్చేయాల వానొచ్చి నాశనం చేసింది. సేన్లోనే వడ్లన్నీ నీటిపాలాయే..! వరి ఒక్కటే కాదయ్యా అన్ని పంటలదీ అదే పరిస్థితి. మన కడప జిల్లాలో మూడు లక్షల నలభైయేల ఎకరాల్లో పంట నీటిపాలైందని పేపర్లో సూసినాను. 

హరిదాసు: అవునా..! అంత నష్టం జరిగినాదా..! పంట నష్టపోతే ప్రభుత్వమోళ్లు సాయం సేస్తారంట కదా..?

గోపన్న: ఆ ఊర్లో మాట్లాడుకుంటుంటే ఇన్నా.. రైతులేమో ఎకరాకు 35 ఏల కన్నా ఎక్కువే ఖర్చు సేసినారంటా.. పంట చేతికొచ్చి అమ్మింటే లక్ష రూపాయలైనా లెక్కొచ్చేదంటా..! ప్రభుత్వమోళ్లు ఎకరాకు ఆరు వేలిచ్చారంటా..! పిసరంత సాయం చేసి పెద్దగా చెబుతున్నారు.. సాయం వచ్చిన రోజే అప్పిచ్చినాసామొచ్చి వడ్డీ కింద లాక్కెల్లాడని బాధపడుతున్నారయ్యా..!

హరిదాసు: కీర్తనలు పాడుతూ ఒకూరి నుంచి మరొకూరికి వెళుతుంటే రోడ్డు పొడువునా నానిన వడ్లు ఆరబోసినారు. ఆడునోల్లనడిగితే కొనేటోళ్లే లేరంటా..! పాపం రైతులెక్కడమ్ముకోవాలో కదా..!

గోపన్న: వానొచ్చి సేన్లోనే ధాన్యమంతా తడిసిపోయి ఎకరాకు పది సంచులైనా దిగుబడి రాలేదు.. కాస్తోకూస్తో వచ్చిన పంట అమ్మబోతే తడిసిందని, రంగు మారిందని కొనేటోళ్లే లేరంటని రైతులు శానా బాధపడుతున్నార్లే. ప్రభుత్వమోళ్లు కొంటామని సెబుతున్నారు కానీ తేమ ఎక్కువుందని, రంగు మారిందని ఏవేవో సాకులు సెప్పి కొనడం లేదని నేనెల్లిన ఊల్లో ఓ ఆసామి సెప్పినాడు.. యాడమ్మాలోనని దిగాలు పడుతున్నాడు.. ఆ రైతు చేస్తూ బాదేసిందనుకో..!

హరిదాసు: గోపన్నా..! ప్రతేడు తాళ్లప్రొద్దుటూరుకెళితే మోసేటంతా తిండిగింజలొచ్చేవి..? ఇప్పుడావూరు నీళ్లలో మునిగింది..! పాపం వాల్ల కట్టాలేమని సెప్పేదో..!

గోపన్న: నీవు సెప్పిందీ సానా కరెట్టే హరిదాసు..! పోయినా ప్రభుత్వం కంటే మేమే ఎక్కువ నీళ్లు నింపాలనే ప్రతిష్టకుపోయి గండికోటను పూర్తిగా నింపినారు. తాళ్లపొద్దుటూరు, కొండాపురం ఒక్కటేమిటీ.. ఎన్నో ఊళ్లు నీటిమునిగినాయ్‌.. గీ ఒక్కేడైనా గడవివ్వండని తాళ్లపొద్దుటూరోళ్లు బతిమలాడినా కనికరం సూపలేదంటా..! ఉండేందుకు ఇండ్లు లేక కొత్తగా ఇండ్లు కట్టేసోటా గుడారాలు, రేకులసెడ్లు వేసుకుని పిల్లపాపలతో నానా ఇబ్బందులు పడుతున్నారు. శత్రువుకైనా ఈ కట్టాలు రాకుడదని శానా బాధపడుతున్నారు హరిదాసు. పోయినేడాది ఆ ఊరికెళ్లితే గంగిరెద్దు ఆటను సంబరంగా సూశారు. కొత్త బట్టలిచ్చినారు.. మోసేతన్ని ధాన్యం గింజలిచ్చినారు.. గిప్పుడేమో వాళ్లు బతకడమే కట్టమైంది. వాళ్లుపడే బాధను సూస్తుంటే నాకే కన్నీలోచ్చినాయనుకో..!

హరిదాసు: అవునవును గోపన్నా..! ఆ వూరోళ్ల బాధలు దేవుడే తీర్చాలి. ఆ ఊరే కాదు.. ఏ ఊరుకెళ్లినా జనాల్లో సంతోషం కనబడట్లేదు..!

గోపన్న: పండగంటే లెక్క కావాలి కదా..! పంటలేమో వానొచ్చి నీటిపాలాయే.. పెట్టుబడి మట్టిపోసినట్లే. సేద్యానికి సేసిన అప్పులే మిగిలాయి. పండుగసేద్దామంటే రైతులకు అప్పులు పుట్టట్లేదు పాపం. ఉన్నదాంట్లో సర్దుకుని పండగ సేద్దామంటే కందిపప్పు, వంటనూనె, బెల్లం, గోదుమ్పిండీ.. ఇలా అన్ని రేట్లు శానా పెరిగినాయ్‌ కదా.. పొద్దుతిరుగుడు నూనె లీటరు రూ.135, కందిపప్పు మంచివి కిలో 150లపైనే ఉన్నాయి. పెరిగిన రేట్లలో పండుగెలా చేసుకునేదీ.. జనాలందరు శానా బాధపడుపతున్నారనుకో.. రెండేళ్ల కిందటైతే ప్రభుత్వమోళ్లే సంక్రాంతి కానుకిచ్చేటోళ్లు.. ఇప్పుడది లేదు కదా..! 

హరిదాసు: గోపన్నా..! పల్లెల్లో జనాలకెన్ని కష్టాలో.. కరోనొచ్చినాక సెప్పలేనన్నీ కష్టాలు జనాల్మీద పడ్డాయనుకో..! ఏడాదవుతున్న శానామంది పన్లేక అవస్థలు పడుతున్నారు.. కరోనా సోకి ప్రైవేటు ఆస్పత్రికెళ్లినోళ్లు అప్పులపాలైనారు. పనిసేస్తేనే పొయ్యేలిగే మనలాంటోళ్ల బతుకులు సిన్నాభిన్నమైనాయి కదా..! ఈ కష్ట కాలంలో ఇసుక దొరక్క పనుల్లేక శానామంది ఒకపూట తినీ తినక బతుకీడుస్తున్నారు గోపన్నా..! మళ్లీ మామూలు పరిస్థితి రావాలంటే శంకరుడే కరుణించాలి. 

గోపన్న: అవునవునూ..! ఈయేడు పల్లెటూర్లోనే కాదు పట్టనాల్లోనూ జనాలు పడే అవస్థలేమని సెప్పేది. కడప నగరంలోనైతే బుగ్గొంక పొంగిపొర్లి గరీబోళ్ల బతుకులు సిన్నాభిన్నమైనాయి. కళ్లముందే సర్వం నీటిపాలైంది. సెప్పుకుంటూ పోతే ఇలాంటి కష్టాలెన్నో. 


అరేరే..! మాటల్లోపడి పొద్దే మరిసిపోయినాం..! రెండుమూడూళ్లు తిరిగినా పడి గింజలైనా రాలేదు.. సూరీడు పడమర దిక్కు వాలుతున్నాడు.. పదపదా పోదాం..! ఇంక్కొక్కూరైనా చుట్టేద్దాం..! అంటూ గంగిరెద్దును తోడుకుని సన్నాయి చేతికందుకొని గోపన్న.. బండరాతిపై పెట్టిన పాత్రను తలపై పెట్టుకుని.. తంబూర చేతపట్టుకొని హరిలో రంగహరీ..! అంటూ హరిదాసు ఇద్దరు పక్కూరికి సాగిపోయారు..! 

Updated Date - 2021-01-13T05:57:07+05:30 IST