గ్రంథాలయాల్లో సౌకర్యాలేవి?

ABN , First Publish Date - 2022-05-13T05:37:24+05:30 IST

రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని లైబ్రరీల్లో అరకొర సౌకర్యాలతో నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. స్టడీ మెటీరియల్‌, ఫర్నిచర్‌ తెప్పించాలని కోరుతున్నారు.

గ్రంథాలయాల్లో సౌకర్యాలేవి?
స్టడీ మెటీరియల్‌ అందుబాటులో లేని మొయినాబాద్‌లోని శాఖా గ్రంథాలయం

  • నోటిఫికేషన్ల నేపథ్యంలో లైబ్రరీలకు ఆశగా అభ్యర్థులు
  • అరకొర పుస్తకాలు, మెటీరియల్‌తో నిరాశ
  • శాఖా గ్రంథాలయాల్లో ‘స్టడీ’ నిల్‌!
  • ప్రిపరేషన్‌ కోసం ఉద్యోగార్థుల లైబ్రరీ బాట
  • స్టడీ మెటీరియల్‌ తెప్పించాలని అభ్యర్థనలు
  • అద్దె భవనాలు, ఇరుకు గదుల్లో లైబ్రరీలు
  • ఆన్‌ డిమాండ్‌ మెటీరియల్‌ తెప్పించేందుకు కొన్ని చోట్ల నిర్వాహకుల చర్యలు
  • రద్దీగా వికారాబాద్‌ జిల్లా కేంద్ర గ్రంథాలయం


ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న నేపథ్యంలో నిరుద్యోగ యవతీయువకులు ప్రిపరేషన్‌ కోసం గ్రంథాలయాల బాట పడుతున్నారు. సాధారణ సమ యాల్లో ఖాళీగా దర్శనమిచ్చే లైబ్రరీలు ఇప్పుడు పోటీ పరీక్షల అభ్యర్థులతో కాస్త రద్దీగానే ఉంటున్నాయి. ఇదిలా ఉంటే రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని లైబ్రరీల్లో అరకొర సౌకర్యాలతో నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. స్టడీ మెటీరియల్‌, ఫర్నిచర్‌ తెప్పించాలని కోరుతున్నారు. పట్టణ ప్రాంత లైబ్రరీల్లో ఎంతో కొంత స్టడీ మెటీరియల్‌ ఉన్నా గ్రామీణ శాఖా గ్రంథాలయాల్లో అది నిల్‌! కాగా వికారాబాద్‌ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో కాస్త మెరుగైన సౌకర్యాలున్నాయి.


ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నెట్‌వర్క్‌, మే 12(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలవుతుండడంతో ఉమ్మడి జిల్లాల్లోని వివిధ గ్రంథాలయాలకు నిరుద్యోగుల తాకిడి పెరిగింది. అయితే అన్ని విభాగాల పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ అందుబాటులో లేక అభ్యర్థులు నిశారకు గురవుతున్నారు. స్మార్ట్‌ ఫోన్లలో సెర్చ్‌చేసి చదువుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాలోని చాలా శాఖా గ్రంథాలయాలకు సొంత భవనాలు లేవు. ఉన్నవీ శిథిలమయ్యాయి. దీంతో వాటిల్లోకి పాఠకులు వెళ్లడం లేదు. ఆమనగల్లు జవహర్‌ ఆంధ్రశాఖ గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరడంతో దాన్ని కూల్చి కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. లైబ్రరీని తాత్కాలికంగా మండల పరిషత్‌ ఓల్డ్‌ గెస్ట్‌ హౌజ్‌లో నిర్వహిస్తున్నారు. ఇన్‌చార్జి లైబ్రేరియన్‌గా సత్యనారాయణ ఉన్నారు. దిన పత్రికలు, మ్యాగజైన్లు వస్తున్నాయి. పెద్దగా స్టడీ మెటీరియల్‌ లేదు. అలాగే పాఠకులకు కుర్చీలు, టేబుళ్లు తదితర ఫర్నిచర్‌, ఫ్యాన్లు లేక సమస్యగా మారింది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు కూడా తక్కువే వస్తున్నారు. కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌ మెటీరియల్‌ ఉన్నా భవనం లేక అవి పాడవుతాయని బయటకు తీయడం లేదని నిర్వాహకులు పేర్కొంటున్నారు. కడ్తాలలోనూ గ్రంథాలయానికి సొంత భవనం లేదు. న్యూస్‌ పేపర్లకే పరిమితం. తలకొండపల్లిలో అవసరమైన పుస్తకాలు లేక అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ న్యూస్‌ పేపర్లు మాత్రం వస్తున్నాయి.


  • ‘పట్నం’ పరిధి గ్రంథాలయాల్లో కాస్త మొరుగ్గా సౌకర్యాలు

ఇబ్రహీంపట్నం పరిధిలో ఇబ్రహీంపట్నంలో గ్రేడ్‌-2 గ్రంథాలయముంది. మంచాల, ఆరుట్ల, యాచారం, కందుకూరు, మహేశ్వరంలలో గ్రేడ్‌-3 లైబ్రరీలున్నాయి. ఇబ్రహీంపట్నంలో జీప్లస్‌ వన్‌ పక్కా భవనం, కుర్చీలు, బల్లలు, ఫ్యాన్లు ఉన్నాయి. టాయిలెట్లు లేవు. న్యూస్‌ పేపర్లు, మ్యాగజైన్లు వస్తున్నాయి. పోటీ పరీక్షల మెటీరియల్‌ ఉంది. పాఠకులు ఇంకా ఏవైనా కోరితే డిమాండ్‌ మేరకు తెప్పిస్తున్నారు. పని రోజుల్లో తెరిచి ఉంటుంది. మంచాలలో శిథిలమైన లైబ్రరీ భవనాన్ని కూల్చారు. కొత్తది నిర్మించాల్సి ఉంది. అద్దె భవనంలో గ్రంథాలయం నడుస్తోంది. చదువుకునేందకు వసతులున్నాయి. స్టడీ మెటీరియల్‌, న్యూస్‌ పేపర్లు, మ్యాగజైన్లు అందుబాటులో ఉన్నాయి. ఆరుట్ల గ్రంథాలయానికి సొంత  భవనం ఉంది. వసతులూ ఉన్నాయి. పుస్తకాలు, న్యూస్‌ పేపర్లు, మ్యాగజైన్లు ఉన్నాయి. యాచారం గ్రంథాలయం ఇరుకు గదిలో నడుస్తోంది. వసతుల్లేవు. న్యూస్‌ పేపర్లు, మ్యాగజైన్లు ఉన్నా కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌ స్టడీ మెటీరియల్‌ అందుబాటులో లేదు. కందుకూరు, మహేశ్వరం గ్రంథాలయాలకు సొంత భవనాలు, వసతి సౌకర్యాలున్నాయి. పోటీ పరీక్షల పుస్తకాలు, న్యూస్‌ పేపర్లు, మ్యాగజైన్లు అందుబాటులో ఉన్నాయి.


  • చేవెళ్ల ప్రాంత గ్రంథాలయాల్లోనూ వసతుల లేమి

అధికారులు, పాలకుల ఆలసత్వంతో కొన్ని గ్రంథాలయాల్లో సౌకర్యాలు లేవు. పట్టణాల్లో తప్ప గ్రామాల్లో మొక్కుబడిగానే కొనసాగుతున్నాయి. పంచాయతీ గ్రంథాలయాల్లో పోటీ పరీక్షల మెటీరియల్‌, కరెంట్‌ ఎఫైర్స్‌ పుస్తకాలు అందుబాటులో లేవు. పట్టణ ప్రాంత అభ్యర్థులతో పోలిస్తే గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు శాఖా గ్రంథాలయాల్లో మెటీరియల్‌ లభ్యత తక్కువ. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని గ్రంథాలయం శిథిలావస్థకు చేరి కూలి మీద పడుతుందేమో అన్నట్టుగా ఉంది. షాబాద్‌లోని గ్రంథాలయ లైబ్రేరియన్‌ అంధురాలు. దీంతో ఆమె అభ్యర్థులకు కావాల్సిన పుస్తకాలు సమకూర్చే పరిస్థితిలో లేరు. మొయినాబాద్‌, శంకర్‌పల్లి గ్రంథాలయాల్లోనూ సౌకర్యాల్లేవు. చేవెళ్ల ప్రాంత లైబ్రరీలకు ఎక్కడా కొత్త పుస్తకాలేవీ రాలేదు. పాత పుస్తకాలనే చదివితే అభ్యర్థులు నష్టపోయే ఆస్కారం ఉంటుంది. అప్డేట్‌, కరెంట్‌ అఫైర్స్‌ అంశాలున్న పుస్తకాలే వారికి అవసరం. దినపత్రికలు మాత్రం అందుబాటులో ఉంటున్నాయని పాఠకులు పేర్కొంటున్నారు. గ్రంథాలయాల్లో మంచి నీటి ఏర్పాట్లు లేవు. అటెండర్లూ లేరు. మరుగుదొడ్లు మచ్చుకైనా లేవు. భవితను తీర్చిదిద్దేలా ఉండాల్సిన గ్రంథాలయాల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడం సరికాదని ఉద్యోగార్థులు, విద్యార్థులు, వివిధ వర్గాల పాఠకులు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పోటీ పరీక్షలకు స్టడీ మెటీరియల్‌ అందుబాటులోకి లేవాలని కోరుతున్నారు.


  • షాద్‌నగర్‌లో లైబ్రరీ మూసివేత

షాద్‌నగర్‌లో గ్రేడ్‌-1 గ్రంఽథాలయం, కొత్తూరు, కేశంపేట, కొందుర్గు మండల కేంద్రాల్లో గ్రేడ్‌-3 గ్రంథాలయాలున్నాయి. షాద్‌నగర్‌లోని లైబ్రరీ భవనాన్ని కూల్చి డిజిటల్‌ గ్రంథాలయ భవనాన్ని నిర్మిస్తున్నారు. వ్యవసాయ మార్కెట్‌లోని పాత భవనంలో లైబ్రరీని మార్చగా ఆరు నెలల క్రితం అగ్ని ప్రమాదంలో పుస్తకాలన్నీ కాలిపోయాయి. ప్రస్తుతం ఈ గ్రంథాలయాన్ని మూసేశారు. మూడు నెలల్లో డిజిటల్‌ లైబ్రరీ అందుబాటులోకి రానుంది. అయితే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు మాత్రం తీవ్ర అసౌకర్యం కలిగింది. గ్రంథాలయంలో చదువుకోలేని పరిస్థి తి. ఇదిలా ఉంటే షాద్‌నగర్‌లో కొందరు ప్రజాప్రతినిధులు ఉచిత కోచింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి స్టడీ మెటీరియల్‌ అందజేశారు. మండల కేంద్రాల్లోని గ్రేడ్‌-3 లైబ్రరీల్లో న్యూస్‌ పేపర్లు తప్ప పుస్తకాలేవీ లేవు.


  • ఫర్నిచర్‌ లేని మేడ్చల్‌ జిల్లా కేంద్ర గ్రంథాలయం

మేడ్చల్‌ జిల్లాలో ఒక జిల్లా కేంద్ర గ్రంథాలయం, 17శాఖా గ్రంథాలయాలు ఉన్నాయి. కొత్త జిల్లా ఏర్పాటైనప్పటి నుంచీ జిల్లా కేంద్ర గ్రంథాలయానికి కొత్త ఫర్నిచర్‌ తెప్పించలేదు. ఇక స్టడీ మెటీరియల్‌ నామమాత్రంగా ఉంది. హైవే రోడ్డుపై ఉన్న పట్టణ గ్రంథాలయంలోనూ సౌకర్యాల కొరత యువతను, విద్యార్థులను, నిరుద్యోగులను పీడిస్తోంది. అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకొని సమస్యలు తీర్చాలని చాలా కాలంగా కోరుతున్నా సమస్యలు తీర్చడం లేదని స్థానికులు, పాఠకులు వాపోతున్నారు. పోటీ పరీక్షలకు సమయం దగ్గరపడుతున్న ఈ తరుణంలోనైనా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మిగతా జిల్లాల్లో ఉన్నట్టుగానే సౌకర్యాలు కల్పించాలని, డిజిటల్‌ లైబ్రరీని అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. ఇక మండల కేంద్రాలు, గ్రామాల్లోని శాఖా గ్రంథాలయాల్లో అయితే పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. న్యూస్‌ పేపర్లు, పాత నవలల పుస్తకాలు తప్ప వాటిల్లో ఎలాంటి స్టడీ మెటీరియల్‌ అందుబాటులో లేదు. దీంతో ఉద్యోగార్థులు ప్రిపరేషన్‌ కోసం లైబ్రరీలకు వెళ్లడం లేదు. పాత పాఠకులే అరకొరగా వచ్చిపోతున్నారు.


  • వసతుల కల్పనలో ముందున్న వికారాబాద్‌ జిల్లా కేంద్ర గ్రంథాలయం

వికారాబాద్‌లోని గ్రంథాలయానికి ఉదయం నుంచి రాత్రి 8గంటల వరకు వందలాది మంది వచ్చి స్టడీ మెటీరియల్‌ తిరగేస్తూ బిజీగా ఉంటున్నారు. సాధారణంగా ఈ గ్రంథాలయానికి విద్యార్థులు, పోటీ పరీక్షార్థులు రోజూ వస్తుంటారు. నోటిఫికేషన్ల విడుదల నేపథ్యంలో అభ్యర్థుల సంఖ్య బాగా పెరిగింది. జిల్లా కేంద్ర గ్రంథాలయానికి రోజూ 250 నుంచి 300 మంది వరకు ఉద్యోగార్థులు వస్తున్నారు. నాలుగు హాళ్లు, టెర్రా్‌సపై ఏర్పాటు చేసిన షెడ్డులోనూ అభ్యర్థులు చదువుకుంటున్నారు. 40 ఫ్యాన్లు, 300 కుర్చీలు ఉన్నాయి. తాగునీటి వసతీ కల్పించారు. మరుగుదొడ్లు, టాయ్‌లెట్లు వంటి సదపాయాల్నీ కల్పిస్తున్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్‌, సిబ్బంది సొంతంగా వంద కుర్చీలు వేయించే ఏర్పాట్లు చేశారు. డిస్ర్టిక్ట్‌ సెంట్రల్‌ లైబ్రరీకి అనుబంధంగా నిర్మించిన అదనపు భవనాన్ని ప్రారంభిస్తే మరో 150 మంది వరకు చదువుకునేందుకు అవకాశం కలుగుతుంది. వికారాబాద్‌ జిల్లా కేంద్ర గ్రంథాలయానికి రోజూ 16 నుంచి 21 వార్తా పత్రికలు, 25 వరకు మ్యాగజైన్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ గ్రంథాలయానికి బడ్జెట్‌ కొరత లేదనే చెప్పాలి. రోజూ ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు గ్రంథాలయం తెరిచి ఉంచుతున్నారు. సెలవు రోజుల్లోనూ తెరిచి ఉంచాలన్న అభ్యర్థుల కోరిక మేరకు సెలవు రోజుల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు లైబ్రరీని తెరిచే ఉంచుతున్నారు. రెగ్యులర్‌గా తెప్పించే పోటీ పరీక్షల పుస్తకాలే కాకుండా మూడు నెలల కాలంలో రూ.2.53లక్షలతో 1,100 ఆన్‌ డిమాండ్‌ పుస్తకాలు, కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌ స్టడీ మెటీరియల్‌ను కొనుగోలు చేశారు. వికారాబాద్‌తోపాటు పరిగి, పెద్దేముల్‌, కులకచర్లలోని శాఖా గ్రంథాలయాల్లోనూ పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో ఉంచారు. ఉదయం 7.30 గంటల నుంచే అభ్యర్థులు జిల్లా కేంద్ర గ్రంథాలయంలోకి వచ్చేందుకు బారులు తీరుతున్నారు. యువతీ యువకులు ఉద్యోగ సాధన పరీక్షల కోసం స్టడీ మెటీరియల్‌లో మునిగితేలుతున్నారు.

Read more