విస్తరణ కాదు... ప్రక్షాళనే..!

ABN , First Publish Date - 2022-02-04T18:05:26+05:30 IST

అందరూ ఎదురు చూస్తున్నట్లుగా మంత్రివర్గ విస్తరణ కాకుండా ప్రక్షాళన చేయనున్నట్లు తెలుస్తోంది. 2023 శాసనసభ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా మంత్రివర్గ ప్రక్షాళన జరపాలని అధిష్ఠానం పెద్దలు సూత్రప్రాయంగా

విస్తరణ కాదు... ప్రక్షాళనే..!

- బొమ్మై కొలువులో మాజీ సీఎం జగదీశ్‌ శెట్టర్‌కు చోటు 

- కీలక హోం శాఖను కట్టబెట్టాలని అధిష్టానం యోచన 


బెంగళూరు: అందరూ ఎదురు చూస్తున్నట్లుగా మంత్రివర్గ విస్తరణ కాకుండా ప్రక్షాళన చేయనున్నట్లు తెలుస్తోంది. 2023 శాసనసభ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా మంత్రివర్గ ప్రక్షాళన జరపాలని అధిష్ఠానం పెద్దలు సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నట్టు బీజేపీ వర్గాలను ఉటంకిస్తూ విశ్వసనీయంగా తెలిసింది. అ సంతృప్తి బాణీని వినిపిస్తూ పదే పదే చికాకులు సృష్టిస్తున్న రేణుకాచార్య, యత్నాళ్‌, రామదాస్‌ వంటివారికి కూడా కేబినెట్‌లో చోటు కల్పించడం ద్వారా అసంతృప్తిని పూర్తిస్థాయిలో బ్రేక్‌ వేయాలన్నది అధిష్టానం పెద్దల ఆలోచనగా ఉంది. మరోవైపు ప్రభుత్వానికి, పార్టీకి అంటీ అంటనట్లు వ్యవహరిస్తున్న మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్పను బుజ్జగించే దిశలో ఆయన తనయుడు విజయేంద్రకు కేబినెట్‌లో చోటు కల్పించాలన్న ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. త్రిముఖ వ్యూహాలలో భాగంగా బొమ్మైకు పాలనలో చేదోడువాదోడుగా ఉండేందుకు మాజీ ముఖ్యమంత్రి జగదీశ్‌ శెట్టర్‌ను కేబినెట్‌లోకి తీసుకుని కీలక హోం శాఖను అప్పగించాలని కూడా అధిష్టానం యోచిస్తున్నట్టు తెలిసింది. గతంలోనే శెట్టర్‌ను కేబినెట్‌లో చేరాల్సిందిగా సూచించినా ఆయన అందుకు నిరాకరించిన సంగతి విదితమే. తాజా పరిస్థితుల నేపథ్యంలో శెట్టర్‌ను ఒప్పించి కేబినెట్‌లో చేరేలా అధిష్టానం ప్రయత్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ త్రిముఖ వ్యూహం అమలుకు బొమ్మై మంత్రివర్గాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి అసంతృప్తికి తావులేని విధంగా 2023 ఎన్నికల టీమ్‌ను సన్నద్ధం చేసే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఈనెల 7న ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై రాష్ట్ర ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. బడ్జెట్‌ కసరత్తులో భాగంగా ఈ సమావేశం జరుగుతున్నప్పటికీ మంత్రివర్గ ప్రక్షాళనపై ఎంపీలను సైతం విశ్వాసంలోకి తీసుకోవాలని బొమ్మై ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత స్థితిలో బొమ్మై నాయకత్వాన్ని మార్చి కొత్తవారికి అవకాశం కల్పిస్తే అది తేనెతుట్టెను కదిపినట్టు కాగలదని దీనికి బదులుగా పూర్తిస్థాయి ప్రక్షాళనే సరైన మార్గమని అధిష్ఠానం పెద్దలు సూత్రప్రాయంగా నిర్ణయించుకుని ఆ దిశలో కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. మంత్రి పదవుల పందేరంతోపాటు బోర్డులు, కార్పొరేషన్‌ అధ్యక్ష పదవులను కూడా ప్రకటించి ఎక్కడా అసంతృప్తికి అవకాశం లేకుండా చూసుకోవాలని భావిస్తున్నారు. 

Updated Date - 2022-02-04T18:05:26+05:30 IST