ఆదాయ వృద్ధి ఆశించలేం

ABN , First Publish Date - 2020-07-15T05:36:25+05:30 IST

కొవిడ్‌, వర్షాల కారణంగా ప్రాజెక్టు పనులు మందగించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలోనే పనులు ఊపందుకునే వీలుందని గాయత్రీ ప్రాజెక్ట్స్‌ అంచనా వేస్తోంది...

ఆదాయ వృద్ధి ఆశించలేం

  • ద్వితీయార్ధంలో పనులు ఊపందుకుంటాయ్‌
  • రూ.3,000 కోట్ల కొత్త పనులు
  • 2020-21పై గాయత్రీ ప్రాజెక్ట్స్‌ అంచనా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కొవిడ్‌, వర్షాల కారణంగా ప్రాజెక్టు పనులు మందగించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలోనే పనులు ఊపందుకునే వీలుందని గాయత్రీ ప్రాజెక్ట్స్‌ అంచనా వేస్తోంది. 2020-21కి కంపెనీ ఆదాయంలో వృద్ధి ఉండకపోవచ్చని భావిస్తోంది. ఎబిటా మార్జిన్‌ కనీసం 15 శాతం నమోదు కాగలదని అంచనా వేస్తున్నట్లు గాయత్రీ ప్రాజెక్ట్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి తెలిపారు. అసెట్‌ లైట్‌ వ్యాపార విధానాన్ని కొనసాగిస్తాం. ఈపీసీ ప్రాజెక్టులపైనే దృష్టి పెడతాం. మార్జిన్లు ఉంటాయనుకునే  ప్రాజెక్టులకే టెండర్లు దాఖలు చేయాలని భావిస్తున్నాం.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా రూ.3,000-4,000 కోట్ల ఆర్డర్లు లభించే అవకాశం ఉందన్నారు. తొలి త్రైమాసికంలో రూ.140 కోట్ల విలువైన వాటర్‌ ప్రాజెక్టు లభించింది. జూన్‌ చివరి నుంచి ప్రాజెక్టుల వద్ద పనులు జరుగుతున్నాయి. అయితే, రుతుపవన వర్షాలు పనులకు ఆటంకం కలిగిస్తున్నాయి. 2020-21 ద్వితీయార్ధంలోనే ప్రాజెక్టుల వద్ద పనులు ఊపందుకుంటాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 50-60 శాతం కార్యకలాపాలే జరుగుతున్నాయని, శ్రామికుల లభ్యత, నిర్మాణ రంగంలో వినియోగించే ముడి వస్తువుల లభ్యత సాధారణ స్థాయిలో లేదని సందీప్‌ రెడ్డి వివరించారు. శ్రామికుల లభ్యత దాదాపు 50 శాతమే ఉంది. లాక్‌డౌన్‌ తర్వాత వారు స్వగ్రామాలకు వెళ్లారు.


 దీని ప్రభావం మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లోని ప్రాజెక్టులపై ఉందని వివరించారు. ప్రస్తుత గడ్డు కాలంలో అనేక నిర్ణయాల అమలులో జాప్యం జరిగినప్పటికీ.. దీర్ఘకాల రుణాన్ని కంపెనీ రూ.230 కోట్ల మేరకు తగ్గించుకోగలిగింది. ఆగస్టు వరకూ రిజర్వు బ్యాంకు కల్పించిన మారిటోరియం సదుపాయాన్ని వినియోగించుకోనుంది. కంపెనీ స్టాండ్‌ ఎలోన్‌ రుణం దాదాపు రూ.1800 కోట్లు ఉంది.


Updated Date - 2020-07-15T05:36:25+05:30 IST