కోవిడ్-19 మహమ్మారి సామాజిక వ్యాప్తి జరగలేదు : కేంద్ర ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-03-26T22:57:51+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిపై ఆందోళనను కేంద్ర ప్రభుత్వం గురువారం దూరం చేసింది. మన దేశంలో ఈ మహమ్మారి సామాజిక వ్యాప్తి

కోవిడ్-19 మహమ్మారి సామాజిక వ్యాప్తి జరగలేదు : కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిపై ఆందోళనను కేంద్ర ప్రభుత్వం గురువారం దూరం చేసింది. మన దేశంలో ఈ మహమ్మారి సామాజిక వ్యాప్తి (కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్) జరిగినట్లు బలమైన సాక్ష్యాధారాలేవీ లేవని స్పష్టం చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ స్పష్టత ఇచ్చినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. 


ఇదిలావుండగా, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన చర్యలను పాటిస్తే మన దేశంలో కరోనా వైరస్ కేసులు పెరగబోవని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. 


కరోనా వైరస్ విసురుతున్న సవాలును తిప్పికొట్టేందుకు మన దేశం సిద్ధంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దోమల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందబోదని తెలిపింది. మన దేశంలో ఈ వైరస్ సామాజిక వ్యాప్తి జరుగుతున్నట్లు బలమైన ఆధారాలు లేవని వివరించింది. 


కరోనా వైరస్ పాజిటివ్ రోగులకు చికిత్స చేసేందుకు ప్రత్యేక ఆసుపత్రులను దాదాపు 17 రాష్ట్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. 


ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో సోషల్ డిస్టేన్సింగ్ అత్యంత సమర్థంగా ఉపయోగపడుతుందని పునరుద్ఘాటించింది. ప్రజలు సామూహికంగా గుమిగూడకుండా, ఒకరికొకరు దూరంగా ఉండాలని తెలిపింది.


మన దేశంలో గురువారం నాటికి 649  కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని, బాధితుల్లో 49 మంది విదేశీయులని పేర్కొంది. 


ఈ వైరస్ కారణంగా మన దేశంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 13కు చేరినట్లు తెలిపింది. మహారాష్ట్రలో ముగ్గురు, గుజరాత్‌లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, తమిళనాడు, బిహార్, కర్ణాటక, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్‌లలో ఒక్కొక్కరు చొప్పున మరణించారని తెలిపింది.


Updated Date - 2020-03-26T22:57:51+05:30 IST