మోదీకి వ్యతిరేకంగా పోస్టులు పెడితే నో ఎంట్రీ!

ABN , First Publish Date - 2022-05-24T09:03:31+05:30 IST

స్నాతకోత్సవం అంటే పట్టభద్రుల్లో ఎనలేని సంతోషం ఉంటుంది...

మోదీకి వ్యతిరేకంగా పోస్టులు పెడితే నో ఎంట్రీ!

ఐఎస్‌బీ స్నాతకోత్సవంలో నిఘా నిబంధన 

930 మంది విద్యార్థుల బ్యాక్‌గ్రౌండ్‌ చెక్‌

వీరిలో 330మంది మొహాలీ క్యాంపస్‌ విద్యార్థులు

సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టుల పరిశీలన

ప్రధాని పర్యటన ఖరారైనా.. షెడ్యూల్‌ గోప్యం


హైదరాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): స్నాతకోత్సవం అంటే పట్టభద్రుల్లో ఎనలేని సంతోషం ఉంటుంది... అదీగాక ద్విదశాబ్ది వేడుకల్లో భాగంగా నిర్వహిస్తుంటే, ముఖ్య అతిథిగా దేశ ప్రధాని వస్తుంటే విద్యార్థుల సంతోషానికి అవధులే ఉండవు. కానీ.. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక బిజినెస్‌ స్కూల్‌గా పేరొందిన ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎ్‌సబీ) విద్యార్థుల పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఐఎ్‌సబీని ప్రారంభించి 20ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ నెల 26న ద్విదశాబ్ది వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ రానున్నారు. ప్రధాని పర్యటనలో భాగంగా పోలీసులను మోహరించడం, అడుగడుగునా తనిఖీలు చేపట్టడం, అనుమానితులను అదుపులోకి తీసుకోవడం వంటివి సాధారణమే అయినప్పటికీ... ఈసారి పర్యటనలో మాత్రం నిఘా వర్గాలు కొత్త విధానాన్ని అమలుచేస్తున్నాయి.


ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొనాలంటే.. సోషల్‌ మీడియాలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వారు ఎలాంటి పోస్టులు పెట్టి ఉండకూడదు. ఈ మేరకు స్నాతకోత్సవంలో పాల్గొననున్న విద్యార్థుల బ్యాక్‌గ్రౌండ్‌ను చెక్‌ చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. విద్యార్థుల సోషల్‌ మీడియా అకౌంట్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లలో పోస్టులు చేసినవారిని, అలాంటి పోస్టులను ఫార్వార్డ్‌ చేసినవారిని గుర్తించి... స్నాతకోత్సవంలో వారు పాల్గొనకుండా చూడటం దీని ఉద్దేశంగా స్పష్టమవుతోంది. ఐఎ్‌సబీకి హైదరాబాద్‌తోపాటు పంజాబ్‌లోని మొహాలీలో మరో క్యాంపస్‌ ఉంది. ఇక్కడ 600 మంది విద్యార్థులుండగా.. మొహాలీలో 330 మంది కలిపి మొత్తం 930 మంది పీజీ విద్యను పూర్తిచేసుకున్నారు. వీరందరికీ పట్టాలు ప్రదానం చేస్తున్నారు. వీరందరి బ్యాక్‌గ్రౌండ్‌నూ చెక్‌ చేయనున్నారు. కాగా... గతేడాది ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన రైతుల ఆందోళనలో పంజాబ్‌ రాష్ట్రానికి చెందినవారే ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఐఎ్‌సబీ మొహాలీ క్యాంప్‌సలో పంజాబ్‌ విద్యార్థులు ఎక్కువగా ఉండగా..


నిరసన తెలుపుతారన్న భయం నిఘా వర్గాల్లో ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌ వెరిఫికేషన్‌కు ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సాధారణంగా ప్రధాని పర్యటన ఖరారైతే షెడ్యూల్‌ను వెల్లడిస్తారు. కానీ.. ఈ సారి పర్యటన ఖరారైనా.. ప్రధాని ఎప్పుడు చేరుకుంటారు, ఎప్పుడు తిరిగి వెళ్తారన్నదానిపై నిర్వాహకులకే స్పష్టత లేదు. 


రాష్ట్రంలో లేనందున సీఎం రాలేనన్నారు: ఐఎ్‌సబీ డీన్‌

స్నాతకోత్సవంలో భాగంగా... 8మంది విద్యార్థులకు బంగారు పతకాలను ప్రదానం చేయడంతోపాటు ఐఎ్‌సబీ ద్విదశాబ్ది పోస్టల్‌ స్టాంప్‌ను ప్రధాని విడుదల చేస్తారని సంస్థ డీన్‌ మద న్‌ పిల్లుట్ల తెలిపారు. అలాగే క్యాంప్‌సలో మొక్కను నాటుతారన్నారు. కార్యక్ర మం సమయం పీఎంవో నుంచి ఖరారు కావాల్సి ఉందని, ప్రధాని క్యాంప్‌సలో గంట ఉంటారని డీన్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించామని, రాష్ట్రంలో లేనందున రాలేకపోతున్నట్లు సీఎం చెప్పారని డీన్‌ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో డీన్‌తోపాటు డిప్యూటీ డీన్‌ దీపా మణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T09:03:31+05:30 IST