గాడితప్పిన సచివాలయాలు

ABN , First Publish Date - 2022-06-26T06:34:41+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో కొంతమంది సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

గాడితప్పిన సచివాలయాలు
22వ వార్డులోని ఒక సచివాలయంలో ఖాళీగా వున్న కుర్చీలు

ఏ సమయంలో వెళ్లినా సగానికిపైగా కుర్చీలు ఖాళీ

ఫీల్డ్‌కు వెళ్లారని సమాధానం

మూవ్‌మెంట్‌ రిజిస్ట్టర్‌లో కనిపించని ఎంట్రీ

పరిష్కారం కాని ప్రజా సమస్యలు

చాలాకాలంగా ఫిర్యాదులు

పట్టించుకోని అధికారులు

తాజాగా మేయర్‌ ఆకస్మిక తనిఖీలో బయటపడిన డొల్లతనం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో కొంతమంది సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. విధి నిర్వహణలో సమయపాలన పాటించకపోవడంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారంలో తీవ్రజాప్యం చేస్తున్నారు.

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో ప్రతి నాలుగు వేల ఇళ్లకు ఒకటి చొప్పున 576 వార్డు సచివాలయాలను ఏర్పాటుచేశారు. ఒక్కో సచివాలయంలో వెల్ఫేర్‌, ఎడ్యుకేషన్‌, ఎమినిటీస్‌, ప్లానింగ్‌, శానిటేషన్‌, అడ్మినిస్ట్రేషన్‌ సెక్రటరీస్‌, డిజిటల్‌ అసిస్టెంట్‌, మహిళా పోలీస్‌, ఏఎన్‌ఎం పేరుతో తొమ్మిది మంది ఉద్యోగులను నియమించింది. ఒక్కొక్కరూ తమ విభాగానికి సంబంధించిన సేవలను సచివాలయ పరిధిలోని ప్రజలకు అందించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ విధులకు హాజరైనప్పుడు బయోమెట్రిక్‌ విధానంలో హాజరు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అటెండెన్స్‌ రిజిస్టర్‌లో కూడా సంతకం చేయాలి. సచివాలయంలో వుంటూ అక్కడకు సమస్యలపై వచ్చే ప్రజల నుంచి వినతులను స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ విధి నిర్వహణలో బయటకు వెళ్లాల్సి వస్తే...అక్కడ వుండే మూవ్‌మెంట్‌ రిజిస్టర్‌లో దానికి సంబంధించిన వివరాలను నమోదుచేయాలి. సచివాలయాల పనితీరుతోపాటు సిబ్బంది హాజరును పర్యవేక్షించేందుకు ప్రతి నాలుగు సచివాలయాలకు ఒక అధికారిని స్పెషల్‌ ఆఫీసర్‌గా నియమించారు. వీరంతా ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో తమకు కేటాయించిన సచివాలయాలను సందర్శించాల్సి ఉంటుంది. వీరుకాకుండా జీవీఎంసీ జోనల్‌ కమిషనర్లు, చీఫ్‌ ఇంజనీర్‌, చీఫ్‌ సిటీప్లానర్‌, ప్రధాన వైద్యాధికారి, డిప్యూటీ ఎడ్యుకేషన్‌ అధికారితోపాటు అదనపు కమిషనర్‌, కమిషనర్‌ కూడా తమకు వీలున్నపుడల్లా ఏదో ఒక సచివాలయాన్ని సందర్శించి సిబ్బంది హాజరు, అందజేస్తున్న సేవలు, ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది.  కానీ ప్రస్తుతం సచివాలయాల్లో అటువంటివేమీ అమలు కావడం లేదు. 


ఇష్టారాజ్యంగా సిబ్బంది పనితీరు

సచివాలయాలపై పర్యవేక్షణ లేకపోవడంతో చాలామంది సిబ్బంది ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సచివాలయానికి ఏదైనా పనిమీద వెళితే ఒకరిద్దరు తప్పితే మిగిలిన వారెవరూ కనిపించని పరిస్థితి ఉంటోంది. తమ సమస్యను అక్కడున్న సిబ్బందికి వివరిస్తే సంబంధిత కార్యదర్శి పని మీద బయటకు వెళ్లారని, మరుసటిరోజు రావాలంటూ పంపించేస్తున్నారు. దీనివల్ల ప్రజలు సమస్య పరిష్కారం కోసం రోజుల తరబడి సచివాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనిపై వరుసగా ఫిర్యాదులు అందడంతో ఏడాది కిందట అప్పటి కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన హెచ్‌బీ కాలనీలోని ఒక సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో ఒకరిద్దరు మినహా మిగిలిన సిబ్బంది లేకపోవడం, హాజరు రికార్డులను నిర్వహించకపోవడం, సెలవులకు సంబంధించిన లేఖలు ఇవ్వకపోవడం వంటి లోపాలను గుర్తించి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. తరువాత కొంత మార్పు కనిపించినప్పటికీ...మళ్లీ అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో పరిస్థితి యథాస్థితికి వచ్చింది. సచివాలయ పనితీరుపై వరుసగా ఫిర్యాదులు అందుతుండడంతో మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి ఈ నెల 22న ఆరిలోవలోని వివేకానంద కాలనీలో గల 16, 17 వార్డు సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేయగా సిబ్బంది లేకపోవడం, చాలాకాలంగా హాజరు పట్టికల్లో సంతకాలు చేయకపోవడం, బయటకు వెళ్లినట్టు చెబుతున్న సిబ్బంది వాటికి సంబంధించిన వివరాలను మూవ్‌మెంట్‌ రికార్డుల్లో నమోదుచేయకపోవడం వంటివి గుర్తించి తీవ్రఆగ్రహం వ్యక్తంచేశారు. అలాగే వార్డుల్లో జ్వరాల సర్వేకు సంబంధించిన వివరాల గురించి ఆరా తీయగా సిబ్బంది నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. జీవీఎంసీ కమిషనర్‌ తరచుగా తనిఖీలు చేసినట్టయితే సచివాలయ వ్యవస్థ గాడిన పడే అవకాశం ఉంది.

Updated Date - 2022-06-26T06:34:41+05:30 IST