Abn logo
May 22 2020 @ 03:51AM

సడలింపులపై సందేహాలొద్దు

కంటైన్‌మెంట్‌ జోన్లలో ఆంక్షలు యథాతథం

నేటి నుంచి బఫర్‌జోన్లలో ఉదయం 6 నుంచి 10 వరకు నిత్యావసరాలు

గ్రీన్‌జోన్లలో ఉదయం 7 నుంచి రాత్రి ఏడు వరకు వ్యాపారాలకు అనుమతి

లాక్‌డౌన్‌ నిబంధనలపై కలెక్టర్‌ శ్యాముల్‌ ఆనంద్‌కుమార్‌ స్పష్టీకరణ


గుంటూరు, మే 21 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ 4.0 సడలింపులకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న అపోహలు వాస్తవం కాదని కలెక్టర్‌ ఇందుపల్లి శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన సడలింపుల గురించి వివరించారు. కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ యథాతథంగా అమలు జరుగుతుందన్నారు. బఫర్‌ ఏరియాల్లో ఇదివరకు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు నిత్యావసరాలకు అనుమతి ఉండగా దానిని ఉదయం 10 గంటల వరకు పొడిగించడం జరిగిందన్నారు. అన్ని గ్రీన్‌ జోన్లలో ఉదయం 7 నుంచి రాత్రి ఏడు గంటల వరకు షాపులు తెరుచుకోవచ్చని, రాత్రి ఏడు నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూ ఉంటుందన్నారు. బఫర్‌ జోన్లలో కూడా ఫార్మసీ షాపులు తెరుచుకోవచ్చన్నారు. అర్బన్‌ ఏరియాలలో ఎక్కడైతే కంటైన్‌మెంట్‌, బఫర్‌ జోన్లు లేవో అక్కడి కాలనీల్లో, రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌ల్లోని దుకాణాలు తెరుచుకోవచ్చన్నారు. 


క్యాంటీన్ల, పార్శిల్‌ కౌంటర్లకు అనుమతి

ప్రభుత్వ ఉద్యోగుల కోసం పని చేసే రైల్వే, బస్టాండ్లలోని క్యాంటీన్లు, పార్శిల్‌ కౌంటర్లకు అనుమతి ఉందన్నారు. క్రీడా ప్రాంగణాల్లో ప్రేక్షకులు లేకుండా ఆటలు నిర్వహించుకోవచ్చన్నారు. థియేటర్లు, మాల్స్‌, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌, క్రీడా ప్రాంగణాలు, బహిరంగ సభలు, సమావేశాలు వంటివి అనుమతించబోమన్నారు. హోటల్స్‌, రెస్టారెంట్లకు అనుమతి లేదన్నారు. చెప్పులు, వస్త్ర, బంగారు దుకాణాలకు ఎక్కడా కూడా అనుమతి ఉండదన్నారు.    బార్బర్‌ షాపుల్లో క్షవరం, గెడ్డం తదితర పనులు చేసేవారు తప్పక పీపీఈ కిట్‌, గ్లవ్స్‌, మాస్కులు ధరించాలన్నారు.


కంటైన్‌మెంట్‌, బఫర్‌ జోన్లలో బార్బర్‌ షాపులకు అనుమతి లేదన్నారు. అర్బన్‌ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ మాట్లాడుతూ గుంటూరు, తాడేపల్లి, మంగళగిరిలో సగభాగంలో ఏ విధమైన సడలింపులు లేవన్నారు. ఇతర ప్రాంతాల్లో షాపులను సరి బేసి సంఖ్య అమలు చేయాలన్నారు. గుంటూరు నుంచి ఇతర ప్రాంతాలకు ఎలాంటి రాకపోకలకు వీల్లేదని తెలిపారు. రూరల్‌ ఎస్పీ సీహెచ్‌ విజయారావు మాట్లాడుతూ తమ పరిధిలో 22 పార్శిల్‌ కౌంటర్లకు అనుమతి ఉందన్నారు. సమావేశంలో డీఆర్‌వో ఎన్‌వీవీ సత్యన్నారాయణ పాల్గొన్నారు. 


దుకాణాల వద్ద నిబంధనలు పాటించాలి

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రతీ దుకాణదారులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్‌ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో వ్యాపార సంఘాల నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. దుకాణాలను 50 శాతం మంది సిబ్బందితోనే నిర్వహించాలని, కొనుగోలుదారులను దుకాణాల్లోకి అనుమతించకుండా సిబ్బంది సరుకులను బయటకు తీసుకొచ్చి ఇవ్వాలన్నారు. సెలూన్‌ షాపులకు వచ్చే వారి వివరాలు నమోదు చేసుకుని వారి ఉష్ణోగ్రత పరిశీలించాలన్నారు. నిబంధనలు పాటించని దుకాణాలను మూసి వేస్తామన్నారు. గుంటూరులోని పట్నంబజారు కంటైన్‌మెంట్‌ జోన్‌ పరిధిలో ఉన్నందున ఫర్టిలైజర్స్‌, పురుగుమందులు, విత్తన దుకాణాదారులు నాన్‌ కంటైన్‌మెంట్‌ మండలాలు, వ్యవసాయ మార్కెట్‌లలో సబ్‌ సెంటర్ల ఏర్పాటు చేసుకునేందుకు ప్రతిపాదనలు ఇస్తే ప్రభుత్వానికి నివేదించి అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు.


పేదలను ఆదుకోవడానికి వ్యాపారవర్గాలు అందించిన సాయం అభినందనీయమన్నారు. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ గుంటూరుతో పాటు కంటైన్‌మెంట్‌ జోన్లలో ఇబ్బంది లేని ప్రాంతాల్లో ఇతర దుకాణాలు తెరవడానికి అవకాశం కల్పించాలన్నారు. ఏపీ టెక్స్‌టైల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి మాట్లాడుతూ నాన్‌ కంటైన్‌మెంట్‌ జోన్లలో వస్త్ర దుకాణాలు తెరుచుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. సమావేశంలో ఎస్పీలు  రామకృష్ణ, విజయారావు, జేసీ ఏఎస్‌ దినేష్‌కుమార్‌, నగరపాలకసంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ, మునిసిపల్‌ ఆర్‌డీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement