సాగు లేదు.. తాగునీరే..

ABN , First Publish Date - 2022-08-08T04:46:47+05:30 IST

అన్నమయ్య జిల్లాలోని చిన్నమండెం, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, వీరబల్లి, టి.సుండుపల్లె, సంబేపల్లె మండలాలు, 23 గ్రామాల పరిధిలోని 28 వేల ఎకరాలకు సాగునీటిని అందించేలా రిజర్వాయర్‌ రూపకల్పన చేశారు. 2007-08 అంచనాతో రూ.300 కోట్ల వ్యయంతో 2 వేల ఎకరాల విస్తీర్ణంలో 1.02 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టారు. రిజర్వాయర్‌ పనులు పూర్తయినా.. పంట కాలువలు, వీటికి అనుసంధానంగా తవ్వే బ్రాంచి కాలువలు అసంపూర్తిగా ఉన్నాయి.

సాగు లేదు.. తాగునీరే..
జమ్ముతో నిండిన కాలువ

శ్రీనివాసపురం ఇక రిజర్వాయరేనా?  

జిల్లా రాకతో భూముల ధరలకు రెక్కలు  

అభ్యంతరాలతో ఆగిన పంట కాలువలు 

పనుల నుంచి తప్పించాలన్న కాంట్రాక్టర్‌ 


రాయచోటి నియోజకవర్గంలోని చిన్నమండెం మండలంలో నిర్మించిన శ్రీనివాసపురం రిజర్వాయర్‌ ఇక రిజర్వాయర్‌గానే ఉండనుందా? పంట కాలువలకు భూములు ఇచ్చేందుకు రైతులు ససేమిరా అంటున్నారా? అవుననే సమాధానం వస్తోంది. ప్రభుత్వం కూడా సాగునీటి అంశం కంటే తాగునీటికే అధిక ప్రాధాన్యం ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లా కేంద్రానికి కావాల్సిన నీటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రం రాయచోటికి పది కి.మి.దూరంలో హంద్రీ-నీవా ప్రధాన కాలువపై చేపట్టిన రిజర్వాయర్‌ 2015లోనే పూర్తయింది. ఎక్కడా లేని విధంగా ఈ ప్రాజెక్టులో మాత్రమే నిర్మాణంతో పాటు సమాంతరంగా పంట కాలువల తవ్వకాలు కూడా చేపట్టారు. 80 శాతం పనులు పూర్తయ్యాయి. భూములు ఇచ్చేందుకు కొందరు రైతులు నిరాకరించడం, కోర్టు కేసులు తదితర కారణాలతో పిల్ల కాలువల తవ్వకాలకే కొన్నిచోట్ల బ్రేక్‌ పడింది. రైతుల అభ్యంతరాలు, అడ్డంకుల మధ్య ఎప్పటికప్పుడు పిల్ల కాలువల పొడవును తగ్గించారు. ప్రస్తుతం జిల్లా కేంద్రం కావడంతో ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో మరికొందరు రైతులు భూమి ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలో ఇక్కడ పనులు చేయలేమని, వాటి నుంచి తప్పించాలని కాంట్రాక్టర్‌ కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జిల్లా కేంద్రానికి తాగునీటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కూడా శ్రీనివాసపురాన్ని ఇక రిజర్వాయర్‌గానే చూడాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 


మదనపల్లె, ఆగస్టు 7: అన్నమయ్య జిల్లాలోని చిన్నమండెం, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, వీరబల్లి, టి.సుండుపల్లె, సంబేపల్లె మండలాలు, 23 గ్రామాల పరిధిలోని 28 వేల ఎకరాలకు సాగునీటిని అందించేలా రిజర్వాయర్‌ రూపకల్పన చేశారు. 2007-08 అంచనాతో రూ.300 కోట్ల వ్యయంతో 2 వేల ఎకరాల విస్తీర్ణంలో 1.02 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టారు. రిజర్వాయర్‌ పనులు పూర్తయినా.. పంట కాలువలు, వీటికి అనుసంధానంగా తవ్వే బ్రాంచి కాలువలు అసంపూర్తిగా ఉన్నాయి. భూసేకరణలో ఇబ్బందులు, రైతుల అడ్డంకులు, కోర్టు కేసులు, తదితర కారణాలతో పంట కాలువ పనులకు బ్రేక్‌ పడింది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం రాయచోటి జిల్లా కేంద్రం కావడంతో ఇక్కడి భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో కాలువలకు భూములు ఇచ్చేది లేదని కొందరు రైతులు భీష్మించి కూర్చున్నారు. ఇదే ప్రస్తుత భూసేకరణకు ప్రధాన అడ్డంకిగా మారిందని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ జిల్లా కేంద్రం ప్రకటన రాక ముందు నుంచే రైతుల నుంచి అభ్యంతరాలు మొదలయ్యాయి. రైతుల అభ్యర్థన మేరకు రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి కూడా హంద్రీ-నీవా అధికారులను సంప్రదించారు. వీలైౖనంత వరకూ భూసేకరణ తగ్గంచాలన్న ఎమ్మెల్యే సూచన మేరకు పంట కాలువల పొడవును కుదిరచినట్లు అధికారులు చెబుతున్నారు. రాయచోటి చుట్టూ ఈ భూములు ఉండటం, దానికి తోడు ప్రభుత్వం మార్కెట్‌ విలువ ప్రకారం పరిహారం ఇస్తుండటంతో రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌కు అనుకూలంగా ఈ భూముల్లో భవిష్యత్తులోనూ పంటలు సాగు ప్రశ్నార్థకమేనన్న భావన రైతుల్లో కలుగుతోంది.

హంద్రీ-నీవా ప్రధాన కాలువపై రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన రిజర్వాయర్‌ నుంచి నీటిని తీసుకోవడానికి కుడి, ఎడమ కాలువలు ఉన్నాయి. ఇందులో కుడికాలువ 28 కి.మీ.పరిఽధిలో 18,709 ఎకరాలు, ఎడమ కాలువ 28 కి.మీ. 9,580 ఎకరాలు ఆయకట్టు ఉంది. మొత్తం 20 వేల ఎకరాలకు నీళ్లు వెళ్లేలా కాలువల నిర్మాణం చేపట్టారు. మొత్తమ్మీద తీసుకుంటే పైపులైన్‌ పనులు, మధ్యమధ్యలో అక్కడక్కడా అభ్యంతరాలతో వంద ఎకరాల మేర భూమి సేకరించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఏళ్ల తరబడి భూసేకరణ కొలిక్కి రాకపోవడం, పనులు చేసేందుకు రైతుల నుంచి అభ్యంతరాల నేపథ్యంలో పనులు చేయలేమని కాంట్రాక్టర్‌ చేతులెత్తేశారు. పనుల నుంచి తమను తప్పించాలని ఇటీవల ప్రభుత్వానికి విన్నవించారు. ప్రభుత్వం కూడా సాగునీటి అంశం కంటే తాగునీటికే అధిక ప్రాధాన్యం ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లా కేంద్రానికి కావాల్సిన నీటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గాలివీడు మం డలంలోని వెలిగల్లు ప్రాజెక్టు నుంచి పైపులైన్‌ ద్వారా నీటిని తీసుకోవాలనే ప్రతిపాదన ఉంది. 35 కి.మీ. దూరంలోని వెలిగల్లు కంటే, పది కి.మీ. దూరంలోని శ్రీనివాసపురం రిజర్వాయర్‌ నుంచి తీసుకోవడం మేల ని అధికారులు ఆలోచిస్తున్నారు. మరోవైపు సాగుపరం గా ఆలోచిస్తే, ఇప్పటికే తవ్విన కాలువల వరకూ, అది కూడా ఒక పంటకు నీరివ్వవచ్చని చెబుతున్నారు.


ఇప్పటికీ చుక్కనీరు చూడని శ్రీనివాసపురం

హంద్రీ-నీవా రెండో దశ పనులు పూర్తయి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ఇప్పటికే నాలుగుసార్లు కృష్ణాజలాలు వచ్చినా..శ్రీనివాసపురానికి చుక్కనీరు చేరలేదు. ప్రధాన కాలువ మార్గమైన నంబులపూలుకుంట, అన్నమయ్య జిల్లా పడమటికోన వద్ద ప్రధాన కాలువ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో పెద్దమండ్యం, చిన్నమండెం మండలాల్లోని కాలువ నిరుపయోగంగా ఉంది. ఫలితంగా శ్రీనివాసపురం, అక్కడి నుంచి పీలేరు నియోజకవర్గంలోని అడవిపల్లె రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి నీవా నది వెంబడి చిత్తూరుకు చుక్కనీరు వెళ్లలేదు.


ఈ ఏడాదే నీళ్లిచ్చేందుకు ప్రయత్నిస్తాం..

ప్రధాన కాలువలో పెండింగ్‌ పనులు పూర్తి చేసి, ఈ ఏడాదే శ్రీనివాసపురం రిజర్వాయర్‌కు నీళ్లిచ్చేందుకు ప్రయత్నిస్తాం. రిజర్వాయర్‌ కింద దాదాపు పంట కాలువల తవ్వకాలు పూర్తయ్యాయి. 1400 ఎకరాలకు సంబంధించి కాలువ పనులు పెండింగ్‌లో ఉంది. ఆ విస్తీర్ణం మినహా మిగిలిన భూమికి నీళ్లిస్తాం. రాయచోటి జిల్లా అర్బన్‌ ఏరియా కావడంతో రైతుల నుంచి భూసేకరణకు ఇబ్బందులు ఉన్నాయి. అర్బన్‌లోని రియల్‌ ఎస్టేట్‌ లేఅవుట్‌లలో భూసేకరణ సాధ్యం కాదని రెవెన్యూ శాఖ చెప్పింది. ఈ పరిస్థితిలో ఉన్నంతలోనే కాలువలకు నీళ్లిచ్చే ప్రయత్నం చేస్తున్నాం.

- ఎస్‌.రాజగోపాల్‌, హంద్రీ-నీవా ఎస్‌ఈ, మదనపల్లె



Updated Date - 2022-08-08T04:46:47+05:30 IST