Abn logo
Apr 13 2021 @ 00:04AM

నో.. టీకా ఉత్సవ్‌

 పీహెచ్‌సీల్లో స్టాక్‌ నిల్‌ 

నిరాశతో వెనుదిరిగిన ప్రజలు 

ఆకివీడు/ఉండి/ యలమంచిలి/ పాలకోడేరు/ఆచంట/ పాలకొల్లు టౌన్‌, ఏప్రిల్‌ 12 : ఆకివీడు మండలంలో రెండో రోజు కూడా టీకా ఉత్సవం జరగలేదు. నాలుగు రోజుల నుంచి ప్రభుత్వ ఆస్పత్రులు, సచివాలయాలకు అరకొర వ్యాక్సిన్‌ రావడంతో ప్రజలు నిరాశతో వెనుతిరుగుతున్నారు. శనివారం ఆస్పత్రికి వస్తే సోమవారం రావాలని సూచించడంతో వచ్చినవారందరినీ వ్యాక్సిన్‌ రాలేదని సిబ్బంది చెప్పడంతో నిరాశతో వెనుతిరిగారు.  ఉండి మండలం యండగండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్‌ స్టాక్‌ లేదని డాక్టర్లు గౌతమి, శాంతి తెలిపారు. ఉండి పీహెచ్‌సీ డాక్టర్లు ధర్మతేజ, గోవర్దన్‌బాబు మాట్లాడుతూ వ్యాక్సిన్‌ రాకపోవడంతో వచ్చిన వారికి సమాచారం తెలియజేస్తున్నామన్నారు. యలమంచిలి మండలం యలమంచిలి, మేడపాడు, దొడ్డిపట్ల పీహెచ్‌సీల్లో వ్యాక్సిన్‌ స్టాక్‌ లేకపోవడంతో సోమవారం ప్రక్రియ జరగలేదు. మంగళవారం ఉదయానికి ఆయా పీహెచ్‌సీల్లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని వైద్యాధికారులు తెలిపారు.  పాలకోడేరు మండలంలో వ్యాక్సిన్‌ కార్యక్రమంలో భాగంగా సోమవారం 20 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించామని డాక్టర్‌ శివరంజని తెలిపారు. ఆచంట మండలంలో సోమవారం ఒక్కరికి కూడా వ్యాక్సిన్‌ వేయలేదు. పాలకొల్లులో కూడా కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రక్రియ ప్రహసనంగా మారింది. గురువారం నాటికి వ్యాక్సిన్‌ రావచ్చని జోస్యం చెబుతున్నారు. దీంతో టీకా ఉత్సవం వెలవెలబోయింది. 

Advertisement
Advertisement
Advertisement