శ్రీకాళహస్తిలో జాడలేని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు

ABN , First Publish Date - 2022-01-13T06:37:39+05:30 IST

శ్రీకాళహస్తిలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు కోసం అడుగులు పడకపోవడమే ఇందుకు నిదర్శనం.

శ్రీకాళహస్తిలో జాడలేని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు
కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా సేవలందించిన శ్రీకాళహస్తిలోని శివసదన్‌ భవనం

అప్రమత్తత ఏదీ? 


శ్రీకాళహస్తి, జనవరి 12: థర్డ్‌వేవ్‌ ముప్పు ముంచుకొస్తోంది. అంతకంతకూ శ్రీకాళహస్తిలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. మూడువారాలుగా ఇదే పరిస్థితి ఉన్నా వైరస్‌ అడ్డుకట్టకు చర్యలు తీసుకోవడంపై అధికారులు దృష్టిసారించడం లేదు. ప్రధానంగా ఇప్పటికీ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు కోసం అడుగులు పడకపోవడమే ఇందుకు నిదర్శనం. సెకండ్‌ వేవ్‌లో అప్రమత్తంగా వ్యవహరించిన అధికార యంత్రాంగం, ఇప్పుడు ఉదాసీనంగా వ్యవహరించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. 

  జిల్లాలో తొలి కొవిడ్‌ కేసు శ్రీకాళహస్తిలో నమోదైంది. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం వైరస్‌ అడ్డుకట్టకు పకడ్బందీ చర్యలు తీసుకుంది. సెకండ్‌ వేవ్‌ ఉధ్రుతిపైనా వైద్యశాఖ యంత్రాంగం ప్రత్యేక దృష్టిసారించింది. ఆ మేరకు.. శ్రీకాళహస్తీశ్వరాలయానికి చెందిన శివసదన్‌ భవనాన్ని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా అధికారులు మార్చారు. మరోవైపు ఆలయానికి చెందిన గంగాసదన్‌ అతిథిగృహాన్ని కరోనా బారినపడిన ఆలయ సిబ్బంది కోసం కేటాయించారు. వైద్యాధికారులు, సిబ్బంది మూడు షిఫ్టుల్లో ఎనలేని సేవలందించారు. ఎట్టకేలకు పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టడంతో గత ఏడాది సెప్టెంబరులో గంగాసదన్‌ను, అక్టోబరు 31వతేదీ శివసదన్‌ను మూసివేశారు. 


సమన్వయలోపంతో సమస్యలు 

గత ఏడాది డిసెంబరు మూడో వారం నుంచి శ్రీకాళహస్తిలో పాజిటివ్‌ కేసులు నమోదవడం ప్రారంభమైంది. మూడురోజుల కిందట రెండు, రెండురోజుల కిందట ఏడు, బుధవారం 12 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్నా అధికారుల నడుమ నెలకొన్న సమన్వయలోపంతో ఇప్పటికీ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు అడుగులు పడలేదు. దీనిపై ఈనెల 7న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై జిల్లా అధికారులు స్పందించారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ప్రారంభానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. ఇదే విషయమై రెండురోజుల కిందట ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌ కె.భాస్కర్‌ జూమ్‌ సమావేశంలో పలు సూచనలు చేశారు. అయితే ముక్కంటి మహా శివరాత్రి ఉత్సవాలు సమీపిస్తూ ఉండడంతో, శివసదన్‌ను కేటాయించేందుకు ఆలయ అధికారులు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశంతో బుధవారం కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు సంబంధించిన అనుమతుల కోసం ఎంపీడీవో నరసింహమూర్తి, తహసీల్దారు జరీనాబేగం ముక్కంటి ఆలయ అధికారులను సంప్రదించారు. అయితే ముక్కంటి బ్రహ్మోత్సవాల దృష్ట్యా భక్తుల రద్దీ అధికంగా ఉంటుందనీ, శివసదన్‌ను కేటాయించలేమని ఆలయ అధికారులు తేల్చిచెప్పారంటూ ఇద్దరు అధికారులు జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కాగా, ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌లో శ్రీకాళహస్తీశ్వరాలయానికి చెందిన గంగాసదన్‌ను కరోనా బారినపడిన ఆలయ సిబ్బంది కోసం కేటాయించారు. దీంతో ఈ భవనాన్ని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా మార్చాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. జనసంచారానికి దూరంగా అన్ని వసతులతో అనువుగా ఉండడంతో ఇబ్బందులు రావని గుర్తించినట్లు సమాచారం. అయితే ఈ భవనం కేటాయించడంపైనా ముక్కంటి ఆలయ అధికారులు ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది. 


సిబ్బంది నియామకంపై చర్యలేవీ? 

శ్రీకాళహస్తిలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నా, ఆ మేరకు.. అదనంగా వైద్య సిబ్బంది నియామకం జరగక పోవడం పట్టణవాసులను ఆందోళనకు గురిచేస్తోంది. గత ఏడాది అక్టోబరుతో ఇక్కడ కొవిడ్‌ సేవలందిస్తున్న సిబ్బంది కాంట్రాక్టు గడువు ముగిసింది. అయితే థర్డ్‌వేవ్‌ దృష్ట్యా అదనపు సిబ్బంది నియామకం తప్పనిసరి. శ్రీకాళహస్తి ప్రభుత్వాస్పత్రిలో గత ఏడాది 30 పడకలతో కూడిన కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. అప్పట్లో ఎనిమిది మంది వైద్యులు, 13 మంది స్టాఫ్‌నర్సులు, ఆరుగురు ఎస్‌ఎన్‌వోలు, డీపీవో, ల్యాబ్‌ టెక్నీషియన్‌, రేడియోగ్రాఫర్‌ ఒక్కొక్కరి వంతున సేవలందించారు. థర్డ్‌ వేవ్‌ దృష్ట్యా ఈ ఆస్పత్రిలో కరోనా బాధితుల కోసం 40 పడకలను సిద్ధం చేశారు. ప్రస్తుతం ఆరుగురు స్టాఫ్‌నర్సులు పనిచేస్తుండగా, ఇప్పటికీ అదనపు సిబ్బంది నియామకం జాడలేదు. మూడుషిఫ్టుల్లో పనిచేసేందుకు 8 మంది వైద్యుల అవసరం ఉంది. అదనంగా పారిశుధ్య సిబ్బందినీ నియమించాల్సినా ఆ దిశగా అడుగులు పడలేదు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి శ్రీకాళహస్తిలో వెంటనే కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. అదనపు వైద్యులు, సిబ్బందిని నియమించి థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. 

Updated Date - 2022-01-13T06:37:39+05:30 IST