ఇక్కడ ఎలాంటి కరోనా లేదు: డీకే శివకుమార్

ABN , First Publish Date - 2022-01-10T02:20:03+05:30 IST

''ఇక్కడ కరోనా లేదు, ఏ వ్యాధి లేదు'' అని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్..

ఇక్కడ ఎలాంటి కరోనా లేదు: డీకే శివకుమార్

బెంగళూరు: ''ఇక్కడ కరోనా లేదు, ఏ వ్యాధి లేదు'' అని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. వారాంతపు కరోనా నిబంధనలను బేఖాతరు చేస్తూ కర్ణాటక కాంగ్రెస్ 10 రోజుల పాదయాత్రకు (ప్రొటస్ట్ మార్చ్) ఆదివారంనాడు శ్రీకారం చుట్టింది. రామ్‌నగర్ జిల్లా నుంచి మొదలైన ఈ పాదయాత్ర 100 కిలోమీటర్ల వరకూ సాగి బెంగళూరు చేరుకోవడంతో ముగుస్తుంది. తాగునీటి ప్రాజెక్టు డిమాండ్‌పై డీకే శివకుమార్ సారథ్యంలో మొదలైన పాదయాత్రలో వందలాది మంది పాల్గొన్నారు. వీరిలో కొద్ది మంది మాత్రమే మాస్కులు ధరించగా, చాలామంది మాస్క్‌లు ధరించకపోవడం, సామాజిక దూరం నిబంధనలకు తిలోదకాలివ్వడం కనిపించింది.


కాగా, పాదయాత్రలో వంద మందికి పైగా ఎమ్మెల్యేలు, 200 మంది మాజీ ఎమ్మెల్యేలు, పలువురు మంత్రులు, నటులు, మతపెద్దలు పాల్గొంటామని హామీ ఇచ్చారని, ప్రజాందోళనలను, వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షల బూచి చూపుతోందని డీకే ఈ సందర్భంగా పేర్కొన్నారు. '' మేము జలాల కోసం పాదయాత్ర చేస్తున్నాం. ఆంక్షల పేరుతో మమ్మల్ని ప్రభుత్వం ఆపాలని అనుకుంటోంది. ఇక్కడేమీ ఎలాంటి కరోనా లేదు. బీజేపీ ప్రభత్వం కేవం భయాలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమంలో 5 వేల మందికి పైగా పాల్గొన్నప్పుడు కరోనా వ్యాప్తి జరగలేదు. ఇప్పుడెందుకు జరుగుతుంది?'' అని ఆయన ప్రశ్నించారు. ''మన జలాలు, మన హక్కు'' పేరుతో కాంగ్రెస్ ప్రారంభించిన ఈ పాదయాత్రలో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య సైతం పాల్గొన్నారు.

Updated Date - 2022-01-10T02:20:03+05:30 IST