ఇప్పటికైతే లేదు.. కుండబద్ధలు కొట్టిన కేంద్రం

ABN , First Publish Date - 2020-04-10T22:25:46+05:30 IST

భారత్‌లో కరోనా సామూహిక వ్యాప్తి దశలో లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన...

ఇప్పటికైతే లేదు.. కుండబద్ధలు కొట్టిన కేంద్రం

సామూహిక వ్యాప్తి మొదలుకాలేదు.. ఆందోళన అక్కర్లేదు: కేంద్రం

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా సామూహిక వ్యాప్తి దశలో ఇప్పటికైతే లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది. అయితే.. అంతమాత్రాన అజాగ్రత్తగా ఉండరాదని.. అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలకు సూచించింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే కేంద్రం సామూహిక వ్యాప్తి వరకూ పరిస్థితి రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలను చేపట్టింది.


కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి కారకంగా ఉన్నాయని భావిస్తున్న సమూహ ప్రాంతాలపై కేంద్రం ఫోకస్‌ చేసింది. ఒక నిర్ధిష్ట ప్రాంతంలో వైరస్‌ లక్షణాలున్నవారిని గుర్తించి, స్వీయ-నిర్బంధంలోకి లేక ఏకాంతవాసానికి పంపి.. వైరస్‌ గొలుసుకట్టును తెంపడం కోసం సమూహ-నిరోధక వ్యూహాన్ని(క్లస్టర్‌ కంటైన్‌మెంట్‌ స్ట్రాటజీ) దేశవ్యాప్తంగా కేంద్రం అమలుచేస్తోంది. ఇప్పటికే ఈ వ్యూహానికి సంబంధించి కేంద్రం ఓ వ్యూహ పత్రాన్ని ఇప్పటికే విడుదల చేసింది.


అందులో ఏముందంటే...

‘‘ప్రస్తుత లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌ స్థాయి క్రమేణా సమూహ వ్యాప్తికి దారితీయొచ్చు. ప్రయాణాలు లేదా ఒక చోట గుమిగూడడం.. ఇలా రకరకాల మార్గాల ద్వారా ప్రజాసమూహానికి వ్యాపించొచ్చు. దీన్ని అడ్డుకోవడానికి తొలుత చేయాల్సినది భౌగోళిక స్వీయ నిర్బంధం (జగ్రాఫిక్‌ క్వారంటైన్‌). ఇది జరగాలంటే లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌ ప్రాంతాల నుంచి ప్రజల రాకపోకలు, ప్రయాణాలు, బయటకు రావడం.. అన్నీ నిలిచిపోవాలి. సరళంగా చెప్పాలంటే ఆ ఏరియాలను దిగ్బంధం చేసి ఓ అడ్డు (గోడ) కట్టేయాలి. పెద్ద సంఖ్యలో కేసులు బయటపడుతున్న ప్రాంతాలు, హాట్‌స్పాట్లు.. అన్ని చోట్లా ఈ భౌగోళిక క్వారంటైన్‌ను కచ్చితంగా అమలు చేయాలి. వాటి చోట్ల పకడ్బందీ నిషేధాజ్ఞలు అమలు చేయాలి’’ అని కేంద్ర ప్రభుత్వం వ్యూహపత్రంలో పేర్కొంది.

Updated Date - 2020-04-10T22:25:46+05:30 IST