అదుపేది!

ABN , First Publish Date - 2021-06-19T06:21:13+05:30 IST

కొవిడ్‌ సెకండ్‌వేవ్‌తో జిల్లా అల్లాడుతూనే ఉంది. పల్లెలు, పట్టణాలు, నగరాలు వైరస్‌ భయంతో వణుకుతూనే ఉన్నాయి.

అదుపేది!

ఈనెల 21 నుంచి కర్ఫ్యూ మినహాయింపు సమయం జిల్లాలో లేనట్టే
రాష్ట్రంలో ఒక్క తూర్పుగోదావరికే వర్తించదని ప్రకటించిన ప్రభుత్వం
జిల్లాలో ఇంకా కేసులు అదుపులోకి రాకపోవడంతో కొనసాగనున్న ఆంక్షలు
ఇతర జిల్లాల్లో రోజూ 500లోపే కేసులు.. ఇక్కడ మాత్రం వెయ్యికి మించే..
రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలోనే 11 శాతం పాజిటివిటీ రేటు

18 రోజుల్లో ఇక్కడ 27,595 కేసులు.. విశాఖలో 9,200, పశ్చిమలో 14,185
వారం వ్యవధిలో ఇక్కడ 8,975, విశాఖలో 2,667, పశ్చిమలో 5,814
వీటన్నింటిని విశ్లేషించి కేసులు తగ్గకపోవడంతో జిల్లాలో సడలింపులకు నో

జిల్లాను కొవిడ్‌ మహమ్మారి ఇంకా పట్టిపీడిస్తూనే ఉంది. ఇతర జిల్లాల్లో  పాజిటివ్‌లు సగానికి సగం తగ్గిపోగా, ఇక్కడ మాత్రం వైరస్‌ పగ వీడడం లేదు. రోజూ ఆయా జిల్లాల్లో కేసులు అయిదు వందలలోపు ఉంటే ఇక్కడ మాత్రం నిత్యం వెయ్యికి మించి నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రం మొత్తం మీద జిల్లాలో మాత్రమే ఆంక్షలు కొనసాగించాలని శుక్రవారం నిర్ణయించింది. జిల్లా మినహా రాష్ట్రం అంతా ఈనెల 21 నుంచి పగటికర్ఫ్యూ మినహాయింపు సమయాన్ని సాయంత్రం ఆరు వరకు పెంచగా, జిల్లాలో మాత్రం మధ్యాహ్నం రెండు వరకే అన్నిరకాల కార్యకలాపాలకు అనుమతించింది. రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో 11శాతం పాజిటివిటీరేటు ఉండడమే కర్ఫ్యూ మినహాయింపులో ఈసారి చోటుదక్కకపోవడానికి కారణం.
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
కొవిడ్‌ సెకండ్‌వేవ్‌తో జిల్లా అల్లాడుతూనే ఉంది. పల్లెలు, పట్టణాలు, నగరాలు వైరస్‌ భయంతో వణుకుతూనే ఉన్నాయి. ఇతర జిల్లాల్లో గడచిన కొన్ని వారాల నుంచి కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నాయి. కానీ ఇక్కడ మాత్రం రోజూ వెయ్యికిమించి కేసులు నమోదవుతున్నాయి. దీంతో వైరస్‌ ప్రభావం ఒక్క జిల్లాలోనే ఎందుకు అదుపులోకి రావడంలో లేదో అర్థంకాక అధికారులు తలలుపట్టుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం పగటికర్ఫ్యూ అమలు చేస్తోంది. ఈనెల 20తో మరో దఫా కర్ఫ్యూ ముగుస్తుండడంతో శుక్రవారం మరికొన్ని మినహాయింపులు ప్రకటించింది. అందులోభాగంగా ఈనెల 21 నుంచి 30 వరకు సాయంత్రం ఆరు వరకు అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలకు అనుమతించింది. ప్రజలు కూడా వివిధ అవసరాలకు బయటకు రావడానికి అంగీకరించింది. అయితే ఈ మినహాయింపులు రాష్ట్రం మొత్తం మీద ఒక్క ఈ జిల్లాకే వర్తించదని ప్రకటించింది. కేసుల తీవ్రత అధికంగా ఉండడంతో మినహాయింపుల నుంచి జిల్లాను తప్పించింది. యథావిథిగా మధ్యాహ్నం రెండు తర్వాత అన్ని దుకాణాలు మూసివేయాలని ఆదేశించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలో పాజిటివ్‌ కేసుల తీవ్రతపై మరోసారి చర్చ జరుగుతోంది. గడచిన కొన్ని వారాలుగా ఇతర జిల్లాల్లో కేసులు సగానికిసగం తగ్గి పోయాయి. రోజువారీ బులిటెన్‌లో నిత్యం అయిదు వందలలోపే నమోదవుతున్నాయి. కానీ జిల్లాలో 1,200 నుంచి 1,500 వరకు కేసులు వస్తున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక కొవి డ్‌ పాజిటివిటీ రేటు 11 శాతం జిల్లాలో నమోదవుతోంది. ఇతర జిల్లాల్లో ఈ శాతం నాలుగు, అయిదు, ఆరు వరకే ఉంది. దీంతో అత్యధిక పాజిటివ్‌లు నమోదవుతున్న జిల్లాగా తూర్పు రికార్డుల్లో కొనసాగుతోంది. గడచిన పద్దెనిమిది రోజుల లెక్కలు పరిశీలిస్తే జిల్లాలో కొవిడ్‌ కేసు లు 27,595 నమోదయ్యాయి. పక్కనున్న పశ్చిమగోదావరిలో 14,185, ఆ పక్కనున్న విశాఖలో 9,292 మాత్రమే. మొన్న పదో తేదీతో ఓ కర్ఫ్యూ దశ ముగియగా, అప్పటి నుంచి శుక్రవారం వరకు అంటే వారం వ్యవధిలో కేసులను పరిగణనలోకి తీసుకుంటే జిల్లాలో 8,975 రాగా, పశ్చిమలో 5,814, విశాఖలో 2,667 నమోదయ్యాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇతర జిల్లాలతో పోల్చి తే వాటికి కొన్ని వందల పాజిటివ్‌లు అధికంగా జిల్లాలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గణాంకాలను విశ్లేషించిన అధికారులు అత్యధిక పాజిటివిటీ శాతం ఉన్న కారణంగా జిల్లాలో కర్ఫ్యూ సడలింపులకు నిరాకరణ ప్రతిపాదన ప్రభుత్వానికి పంపారు. కాగా శుక్రవారం జిల్లాలో 1,247మందికి కొత్తగా కొవిడ్‌ సోకింది. దీంతో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 2,53,185కు చేరుకోగా, యాక్టీవ్‌ కేసులు 14,542గా నమోదయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో రోజుకు మూడు నుంచి నాలుగు వేల వరకు కొవిడ్‌ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. ఇందులో పాజిటివ్‌లు ఎక్కువగా వస్తున్నాయి. ఈ సంఖ్య తగ్గే వరకు సాయత్రం ఆరు వరకు ప్రకటించిన కర్ఫ్యూ మినహాయింపు సమయం జిల్లా లో అమలయ్యే అవకాశం లేదు. ఒకపక్క పాజిటివ్‌లు పెరుగుతున్నా ఎక్కడికక్కడ అనేకమంది ఇప్పటికీ మాస్క్‌లు ధరించకపోవడం, మార్కెట్లు, వాణిజ్య దుకాణాల వద్ద విపరీతమైన రద్దీ, భౌతిక దూరం పాటించకపోవడం వంటి తప్పిదాలు ఇంకా కొనసాగుతున్నాయి. అతిపెద్ద జిల్లా, ఎక్కువ జనాభా ఒక కారణం కాగా, అవసరం లేకపోయినా బయటకు వచ్చి రద్దీ ప్రాంతాల్లో తిరిగే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతోనే కేసుల నియంత్రణ కావడం లేదని విశ్లేషిస్తోంది.
21 నుంచి యథావిధిగా...
కార్పొరేషన్‌(కాకినాడ), జూన్‌ 18: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 21 నుంచి జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి సమయం పనిచేస్తాయని కలెక్టర్‌ డి మురళీధర్‌రెడ్డి తెలిపారు. ఈ ఆదేశాలను జిల్లా, డివిజనల్‌, మండల అధికారులు పాటించాలని కలెక్టర్‌ ఆదేశించారు.


Updated Date - 2021-06-19T06:21:13+05:30 IST