బాణసంచాపై పూర్తి నిషేధం లేదు : సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2021-10-30T02:16:04+05:30 IST

దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు దగ్గరపడుతున్నతరుణంలో బాణసంచా (ఫైర్‌క్రాకర్స్) విషయంలో సుప్రీంకోర్టు కీలక..

బాణసంచాపై పూర్తి నిషేధం లేదు : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు దగ్గరపడుతున్న తరుణంలో బాణసంచా (ఫైర్‌క్రాకర్స్) విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బాణసంచాపై పూర్తి నిషేధం లేదని, అయితే బేరియం సాల్ట్స్‌ ఉన్న క్రాకర్స్‌పై మాత్రమే నిషేధం ఉంటుందని స్పష్టత ఉచ్చింది. తాము ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా.. వేడుకల మిషతో నిషేధించిన బాణసంచాను అనుమతించే అధికారం ఎవ్వరికీ లేదని కూడా జస్టిస్ ఎం.ఆర్.షా, సట్సి ఎ.ఎస్.బోపన్నతో కూడిన ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది. వేడుకల పేరుతో ఇతరుల ఆరోగ్యాన్ని, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, పిల్లల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం కుదరదని, ఈ విషయమై భారత రాజ్యాంగంలోని 21వ అధికరణ వారికి రక్షణ కల్పిస్తోందని చెప్పింది.


బాణసంచాపై పూర్తి నిషేధం లేనప్పటికీ, పౌరుల ఆరోగ్యంపై ప్రభావం చూపించే బేరియం సాల్ట్స్‌ ఉన్న క్రాకర్స్‌పై నిషేధం అమల్లో ఉంటుందని ధర్మాసనం తేల్చిచెప్పింది. రాష్ట్రాలు, ఏజెన్సీలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ ఆదేశాలను తూ.చ తప్పకుండా పాటించాలని, అతిక్రమిస్తే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. బాణసంచా తయారీ, వినియోగం, నిషేధిత బాణసంచా అమ్మకాలకు సంబంధించి కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, స్థానిక కేబుల్ సర్వీసుల ద్వారా ప్రచారం చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

Updated Date - 2021-10-30T02:16:04+05:30 IST