భారత్‌లో కరోనా సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకోలేదు: కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2020-07-09T20:08:17+05:30 IST

కరోనా కారణంగా అత్యధికంగా ప్రభావితమై దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. అయితే ఈ వాస్తవాన్ని సరైన కోణంలో అర్థం చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ వ్యాఖ్యానించారు.

భారత్‌లో కరోనా సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకోలేదు: కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: కరోనా కారణంగా అత్యధికంగా ప్రభావితమై దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. అయితే ఈ వాస్తవాన్ని సరైన కోణంలో అర్థం చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ వ్యాఖ్యానించారు. ‘జనాభా పరంగా చూస్తే భారత్ ప్రపంచంలోనే రెండో అతి పెద్ద దేశం. అయితే ఇక్కడ ప్రతి పది లక్షల జనాభాకు 558 కరోనా కేసులు ఉన్నాయి. ఈ విషయంలో ప్రపంచ సగటు 1,453 కేసులు’ అని ఆయన తెలిపారు.


దేశం మొత్తాన్ని పరిశీలిస్తే..భారత్‌లో కరోనా మహమ్మారి సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకోలేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ‘ఈ చర్చలో పాల్గొన్న నిపుణులు.. భారత్‌లో సామాజిక వ్యాప్తి లేదని మరోసారి స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పటికీ దేశం మొత్తాన్ని పరిశీలిస్తే భారత్‌లో సామాజిక వ్యాప్తి లేదు’ అని ఆయన తెలిపారు.


ఇక గురువారం నాటి లెక్కల ప్రకారం భారత్‌లో ఇప్పటివరకూ 7,67,296 కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, డిల్లీ, తెలంగాణ, యూపీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనే అధిక శాతం కేసుల నమోదయ్యాయి. ఇప్పటివరకూ నమోదైన కేసుల్లో ఈ రాష్ట్రాల వాటా దాదాపు 75 శాతమని తాజా లెక్కలు చెబుతున్నాయి. 

Updated Date - 2020-07-09T20:08:17+05:30 IST