కుల్‌భూషణ్ జాదవ్ కేసులో పాక్ నుంచి సమాచారం లేదు : భారత్

ABN , First Publish Date - 2020-08-07T02:39:32+05:30 IST

భారత నావికా దళం మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కేసులో ఇస్లామాబాద్ హైకోర్టు

కుల్‌భూషణ్ జాదవ్ కేసులో పాక్ నుంచి సమాచారం లేదు : భారత్

న్యూఢిల్లీ : భారత నావికా దళం మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కేసులో ఇస్లామాబాద్ హైకోర్టు తీర్పుకు అనుగుణంగా పాకిస్థాన్ స్పందించడం లేదని భారత ప్రభుత్వం తెలిపింది. పాక్ మిలిటరీ కోర్టు విధించిన మరణ శిక్షపై అపీలు చేయడానికి అవకాశం ఇవ్వాలని హైకోర్టు పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ఆదేశించిందని, అయితే ఇప్పటి వరకు పాక్ ప్రభుత్వం నిర్లిప్తంగా ఉందని పేర్కొంది. 


భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం మాట్లాడుతూ, కుల్‌భూషణ్ జాదవ్ కేసులో పాకిస్థాన్ నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ భారత ప్రభుత్వానికి రాలేదని చెప్పారు. జాదవ్‌తో మాట్లాడేందుకు భారత ప్రభుత్వానికి ఎటువంటి అడ్డంకులు, అభ్యంతరాలు లేనటువంటి కాన్సులర్ యాక్సెస్ కల్పించవలసి ఉందని చెప్పారు. 


ఇస్లామాబాద్ హైకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పులో పాకిస్థాన్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. జాదవ్ తరపున వాదించేందుకు న్యాయవాదిని నియమించేవిధంగా భారత ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని తెలిపింది. జాదవ్‌కు విధించిన మరణ శిక్షను సమీక్షించాలని కోరుతూ రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు అవకాశం కల్పించాలని తెలిపింది. 


జాదవ్ గూఢచర్యం, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు చెప్తూ పాకిస్థాన్ మిలిటరీ కోర్టు ఆయనకు మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై భారత ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానంలో ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన అంతర్జాతీయ న్యాయస్థానం  గత ఏడాది తీర్పు చెప్తూ, జాదవ్‌కు విధించిన మరణ శిక్షను పునఃసమీక్షించాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం అవకాశం కల్పించడం లేదు. పిటిషన్ దాఖలుకు గడువు ముగియబోతున్న తరుణంలో రెండుసార్లు నామమాత్రపు కాన్సులర్ యాక్సెస్ కల్పించింది.


Updated Date - 2020-08-07T02:39:32+05:30 IST