అది ప్రధాని నిర్ణయం, నో కామెంట్: నితీష్

ABN , First Publish Date - 2021-11-19T23:08:23+05:30 IST

వివాదాస్పద సాగు చట్టాలకు మొదట్నించి మద్దతిస్తూ వస్తున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తాజాగా ప్రధాని నిర్ణయంతో..

అది ప్రధాని నిర్ణయం, నో కామెంట్: నితీష్

న్యూఢిల్లీ: వివాదాస్పద సాగు చట్టాలకు మొదట్నించి మద్దతిస్తూ వస్తున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తాజాగా ప్రధాని నిర్ణయంతో డిఫెన్స్‌లో పడ్డారు. ''ప్రధాని తీసుకున్న నిర్ణయం అది'' అంటూ సాగు చట్టాల రద్దు నిర్ణయంపై నితీష్ టూకీగా వ్యాఖ్యానించారు. చట్టాలను కొందరు సమర్ధించారని, మరికొందరు వ్యతిరేకించారని, దీంతో రాబోయే పార్లమెంటు సమావేశాల్లో చట్టాలు రద్దు చేసేందుకు ప్రధాని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.


''అది ప్రధాని నిర్ణయం. చట్టాలు తేవాలనుకున్నారు. పార్లమెంటులో చట్టం తెచ్చారు. వచ్చే సమావేశాల్లో రద్దు చేయాలని ఇప్పుడు ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. ఆయనే నిర్ణయం తీసుకున్నందున దానిపై వ్యాఖ్యానించేందుకు ఏమీ లేదు. చట్టాల గురించి ప్రధాని వివరంగా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు ఒప్పుకోలేదు'' అని నితీష్ పేర్కొన్నారు. గత ఫిబ్రవరిలో ప్రధానితో సమావేశమైన నితీష్ కుమార్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే సాగు చట్టాలను చేశారంటూ సమర్ధించారు.


ఓటమి భయంతోనే: తేజస్వి

కాగా, త్వరలో జరుగనున్న ఉత్తరప్రదేశ్, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయం కారణంగానే వివాదాస్పద సాగు చట్టాలను బీజేపీ ప్రభుత్వం రద్దు చేయక తప్పలేదని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వ్యాఖ్యానించారు. నితీ‌ష్-బీజేపీ రైతు వ్యతిరేకులని అన్నారు. వివాదాస్పద చట్టాలను వ్యతిరేకించి, రైతులకు మద్దతుగా నిలిచిన తనపైన, తమ పార్టీ కార్యకర్తలపైన కేసులు పెట్టారని చెప్పారు.

Updated Date - 2021-11-19T23:08:23+05:30 IST