ఫేస్‌బుక్ ఉపాధ్యక్షుడిపై 15 వరకూ చర్యలొద్దు: సుప్రీం

ABN , First Publish Date - 2020-09-24T01:06:10+05:30 IST

ఢిల్లీ అలర్ల కేసులో ఫేస్‌బుక్ ఇండియా ఉపాధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్‌పై అక్టోబర్ ..

ఫేస్‌బుక్ ఉపాధ్యక్షుడిపై 15 వరకూ చర్యలొద్దు: సుప్రీం

న్యూఢిల్లీ: ఢిల్లీ అలర్ల కేసులో ఫేస్‌బుక్ ఇండియా ఉపాధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్‌పై అక్టోబర్ 15 వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఢిల్లీ అసెంబ్లీని సుప్రీంకోర్టు బుధవారంనాడు ఆదేశించింది. ఢిల్లీ అల్లర్ల విషయంలో ఫేస్‌బుక్ పాత్రపై విచారించేందుకు ఢిల్లీ అసెంబ్లీ శాంతి సామరస్య కమిటీ గత 10, 18 తేదీల్లో అజిత్ మోహన్‌కు రెండు సార్లు నోటీసులు ఇచ్చింది. దీనిని అజిత్ మోహన్ సవాలు చేయడంతో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ కృష్ణమురారితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి తాజా ఆదేశాలిచ్చింది.


 అజిత్ మోహన్‌పై అక్టోబర్ 15 వరకూ చర్యలు తీసుకోవద్దని అసెంబ్లీ కార్యదర్శికి సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. కేంద్ర న్యాయ, హోం, ఎలక్ట్రానిక్, ఇటీ మంత్రిత్వ శాఖలు, లోక్‌సభ, రాజ్యభ సెక్రటరీ జనరల్స్, ఢిల్లీ పోలీసులకు సైతం ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను అక్టోబర్ 15కు ధర్మాసనం వాయిదా వేసింది. ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో 53 మంది మరణించగా, ఈ కలహాలను ప్రేరేపించేలా ఉన్న విద్వేష పూరిత ప్రసంగాలను ఫేస్‌బుక్ చూసీ చూడనట్టు ఊరుకుందని అసెంబ్లీ కమిటీ తేల్చడంతో అజిత్ మోహన్‌కు నోటీసులు జారీ అయ్యాయి.

Updated Date - 2020-09-24T01:06:10+05:30 IST