రెపో మారలేదు

ABN , First Publish Date - 2020-12-05T07:04:47+05:30 IST

అందరూ ఊహించినట్టుగానే భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) రెపో రేట్లలో యథాపూర్వ స్థితిని కొనసాగించింది. ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయి కన్నా వేగంగా పుంజుకుంటున్నదంటూ ఈ త్రైమాసికంలో సానుకూల వృద్ధిలో ప్రవేశించే ఆస్కారం ఉన్నట్టు తెలిపింది...

రెపో మారలేదు

  • 2020-21లో -7.5 శాతం ప్రతికూల వృద్ధి అంచనా
  • త్వరలో నిరంతర ఆర్‌టీజీఎస్‌ సేవలు 
  • కాంటాక్ట్‌లెస్‌ కార్డు లావాదేవీల పరిమాణం రూ.5 వేలకు పెంపు
  • వృద్ధికి ఊతం ఇచ్చేందుకు పాలసీ  సర్ద్దుబాటు ధోరణి కొనసాగింపు
  • ఆర్‌బీఐ వెల్లడి


ముంబై: అందరూ ఊహించినట్టుగానే భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) రెపో రేట్లలో యథాపూర్వ స్థితిని కొనసాగించింది. ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయి కన్నా వేగంగా పుంజుకుంటున్నదంటూ ఈ త్రైమాసికంలో సానుకూల వృద్ధిలో ప్రవేశించే ఆస్కారం ఉన్నట్టు తెలిపింది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఎంపీసీ తీర్మానాలను శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించారు. రిటైల్‌ ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న నేపథ్యంలో రెపో రేటును (వాణిజ్య బ్యాంకులకు ఆర్‌బీఐ చెల్లించే వడ్డీ రేటు) యథాతథంగా 4 శాతంగా కొనసాగించాలనే విషయంలో ఆరుగురు సభ్యుల ఎంపీసీ ఏకాభిప్రాయం ప్రకటించింది. దీంతో రివర్స్‌ రెపో రేటు కూడా 3.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగుతుంది. కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి జనవరి నుంచి ఆర్‌బీఐ 1.15 శాతం మేరకు రెపో రేటును తగ్గించింది. రెపో రేటు విషయంలో యథాతథ స్థితిని కొనసాగించడం వరుసగా ఇది మూడోసారి. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధికి మద్దతివ్వడం కోసం వడ్డీ రేట్లలో పాలసీ సద్దుబాటు ధోరణి కొనసాగించాలని నిర్ణయించినట్టు దాస్‌ తెలిపారు. వివిధ అంశాలపై ఆర్‌బీఐ ప్రకటించిన అభిప్రాయాలు.. 

 

వేగవంతమైన రికవరీ

ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయి కన్నా వేగంగా పుంజుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ప్రతికూల వృద్ధి రేటు -7.5 శాతానికి పరిమితం కావచ్చు. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో వృద్ధి రేటు -23.9 శాతానికి దిగజారగా జూలై-సెప్టెంబరులో -7.5 శాతానికి తగ్గింది. మూడో త్రైమాసికంలో 0.1 శాతం, నాలుగో త్రైమాసికంలో 0.7 శాతం సానుకూల వృద్ధి నమోదు కావచ్చు. 


క్యూ 3 ద్రవ్యోల్బణం అంచనా 6.8 శాతం

అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 6.8 శాతం ఉండవచ్చు. శీతాకాలం సమయంలో ధరల్లో కొంత ఊరట లభించినప్పటికీ కొంతకాలం ఇదే ధోరణి కొనసాగవచ్చు.నాలుగో త్రైమాసికంలో ఇది 5.8 శాతం ఉండొచ్చు. 


డివిడెండ్ల మినహాయింపు

 కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలాన్ని దృష్టిలో ఉంచుకుని షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్ల చెల్లింపు నుంచి ఆర్‌బీఐ మినహాయింపు ఇచ్చింది.  సెప్టెంబరు త్రైమాసిక ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన సవివరమైన మార్గదర్శకాలను త్వరలో జారీ చేస్తారు.


ఆర్‌ఆర్‌బీలకు ఎల్‌ఏఎఫ్‌, ఎంఎ్‌సఎఫ్‌ సదుపాయం 

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఇక నుంచి ఎల్‌ఏఎఫ్‌, ఎంఎ్‌సఎఫ్‌ విధానాల కింద నిధులు సేకరించుకునే వెసులుబాటు కల్పించారు. దీనివల్ల అవి మనీ మార్కెట్‌ లావాదేవీల్లో పాల్గొనవచ్చు. వాటి లిక్విడిటీ మెరుగుపడుతుంది. ఇప్పటివరకు వాణిజ్య బ్యాంకులకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉండేది.


ఎన్‌బీఎ్‌ఫసీలపై కఠిన వైఖరి

దేశంలో నాన్‌ బ్యాంకింగ్‌ ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎ్‌ఫసీ) వైఫల్యాలు పెరిగిన నేపథ్యంలో వాటిపై పర్యవేక్షణ మరింత కఠినం చేయనున్నారు. ఇందుకోసం ఆర్‌బీఐ కొన్ని చర్యలు ప్రకటించింది. ఇప్పటివరకు ప్రిన్సిపల్‌ ఆఫ్‌ ప్రపోర్షనాలిటీ ఆధారంగా ఉన్న నియంత్రణ ఇక నుంచి పరిధి ఆధారిత పర్యవేక్షణగా మారుతుంది. ఇందుకు సంబంధించిన చర్చాపత్రాన్ని జనవరి 15వ తేదీన విడుదల చేస్తారు. అలాగే ఇటీవల బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టం 1949కి చేసిన సవరణ ప్రకారం యూసీబీలకు ఆడిటర్లను నియమించే బాధ్యత ఆర్‌బీఐకి దఖలు పరిచారు. ఈ నేపథ్యంలో వాణిజ్య బ్యాంకులు, యూసీబీలు, ఎన్‌బీఎ్‌ఫసీలకు చట్టబద్ధమైన ఆడిటర్ల నియామకానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేయాలని ఎంపీసీ నిర్ణయించింది. 




కాంటాక్ట్‌లెస్‌ లావాదేవీల పరిమితి పెంపు

కాంటాక్ట్‌లెస్‌ కార్డు లావాదేవీల పరిమితిని రూ.5,000 పెంచనున్నారు. 2021 జనవరి ఒకటో తేదీ నుంచి ఇది అమలులోకి వస్తుంది. ప్రస్తుతం ఈ పరిమితి రూ.2,000 ఉంది. త్వరలో ఆర్‌టీజీఎస్‌ చెల్లింపుల విధానం నిరంతరాయంగా అందుబాటులోకి రానుంది. భారీ మొత్తం లో నగదు చెల్లింపులకు ఇది ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఆర్‌టీజీఎస్‌ చెల్లింపులు అన్ని పనిదినాల్లోనూ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంది. 




కార్పొరేట్ల ప్రవేశంపై త్వరలో నిర్ణయం

బ్యాంకింగ్‌ రంగంలోకి కార్పొరేట్ల ప్రవేశంపై ఆర్‌బీఐ త్వరలో నిర్ణయం ప్రకటిస్తుంది. ఆసక్తి గల వర్గాల నుంచి వచ్చిన సలహాలను పరిశీలించిన అనంతరం ఆర్‌బీఐ అంతర్గత ప్యానెల్‌ ఇచ్చిన సూచనల ఆధారంగా ఈ నిర్ణ యం తీసుకుంటారు. బ్యాంకింగ్‌లోకి కార్పొరేట్ల ప్రవేశాన్ని అనుమతించాలంటూ ఆర్‌బీఐ అంతర్గత కార్యాచరణ బృందం ఇచ్చిన సిఫారసుపై ఇటీవల ఆర్‌బీఐ మాజీ గవర్నర్లు, మాజీ డిప్యూటీలు, మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ చర్య ఆశ్రితుల నిరంకుశత్వానికి దారి తీస్తుందని రఘురామ్‌ రాజన్‌, విరాల్‌ ఆచార్య సహా పలువురన్నారు. అయితే ఇది ఐడబ్ల్యూజీ సలహాయేనని, దాన్ని ఆర్‌బీఐ అభిప్రాయంగా పరిగణించరాదని దాస్‌ స్పష్టం చేశారు. 


డిజిటల్‌ లావాదేవీల భద్రతకు చర్యలు

ఇటీవల కాలంలో డిజిటల్‌ లావాదేవీలు విశేషంగా పెరిగిన నేపథ్యంలో వాటి భద్రతపై ఆర్‌బీఐ దృష్టి సారించింది. డిజిటల్‌ చెల్లింపుల భద్రతా కంట్రోల్‌ నిబంధనలు ప్రకటించాలని నిర్ణయించింది. ఇంటర్నెట్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌, కార్డు చెల్లింపుల వ్యవస్థల విషయంలో కనీస ఉమ్మడి ప్రమాణాలు అనుసరించేందుకు ఈ నిబంధనలు సహాయపడతాయి. త్వరలోనే అన్ని వర్గాల సలహాలు కోరుతూ ముసాయిదా నిబంధనలు ఆర్‌బీఐ జారీ చేయనుంది. హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు కొత్తగా క్రెడిట్‌ కార్డులు జారీ చేయడాన్ని, డిజిటల్‌ బ్యాంకింగ్‌పై సరికొత్త చర్యలు చేపట్టడాన్ని నిషేధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

Updated Date - 2020-12-05T07:04:47+05:30 IST