కొత్తవాళ్లకు No Chance.. నచ్చిన వాళ్లకే పనులు.. ఇలా చక్రం తిప్పుతున్నారు...!

ABN , First Publish Date - 2021-11-20T12:35:54+05:30 IST

టెండర్లు పిలవకుండా కొంతమంది డీఈలు ఒకే పనికి రెండు...

కొత్తవాళ్లకు No Chance.. నచ్చిన వాళ్లకే పనులు.. ఇలా చక్రం తిప్పుతున్నారు...!

  • ఎక్కడికి బదిలీ అయితే అక్కడికి
  • విద్యుత్‌ శాఖలో కొందరు అధికారుల తీరు
  • బదిలీ అయిన చోటుకు తమకు చెందిన కాంట్రాక్టర్లు..
  • చక్రం తిప్పుతున్న కొందరు డీఈ, ఏడీఈలు

హైదరాబాద్‌ సిటీ : విద్యుత్‌ శాఖలోని కొందరు అధికారులు ఎక్కడికి బదిలీ అయితే అక్కడికే తమకు సంబంధించిన కాంట్రాక్టర్లను కూడా తీసుకుపోతున్నారు. తమ డివిజన్లలో అవినీతికి పాల్పడుతున్నారు. చెట్ల కొమ్మలు కొట్టడం, మీటర్లు మార్చడం, ట్రాన్స్‌ఫార్మర్ల షిఫ్టింగ్‌, పోల్‌ షిఫ్టింగ్‌, లైన్‌ షిఫ్టింగ్‌ ఇలా ఏ పనైనా తమకు అనుకూల కాంట్రాక్టర్లకే అప్పగిస్తూ కమీషన్లు తీసుకుంటున్నారు. నచ్చినోళ్లకే నామినేషన్‌ మీద పనులు అప్పగిస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. 


బంధువులే..

టెండర్లు పిలవకుండా కొంతమంది డీఈలు ఒకే పనికి రెండు ఎస్టిమేషన్లు  వేస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫైళ్లు వెళ్లకుండానే పనులు తమకు సంబంధించిన కాంట్రాక్టర్లకు అప్పగించి వాటాలు పంచుకుంటున్నారు. కొంతమంది బంధువులను కాంట్రాక్టర్లుగా రంగంలోకి దింపుతున్నారు. గతంలో కార్పొరేట్‌ కార్యాలయంలో పనిచేసిన ఓ అధికారి తన భార్యపేరు మీద ప్రాజెక్టు  ఇప్పించుకుని ప్రతి నెలా రూ. 8 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆదాయం పొందినట్లు ఆరోపణలున్నాయి. కాగా, శివారు ప్రాంతంలో పనిచేస్తున్న  ఓ డీఈ తన కార్యాలయాన్ని కార్పొరేట్‌ కార్యాలయం తరహాలో మార్చుకున్నాడు. ఇటీవల జరిగిన బదిలీల్లో సదరు అధికారి తన రాజకీయ పరిచయాలను ఉపయోగించుకొని తనకు సహకరించే ఓ ఏడీఈకి తన డివిజన్‌లో పోస్టింగ్‌ ఇప్పించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలో ఆ డీఈ ఓ రియల్టర్‌ నుంచి భారీగా డబ్బులు డిమాండ్‌ చేయడంతో మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు వెళ్లినట్లు సమాచారం. కొంతమంది డీఈ స్థాయి అధికారులు శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేస్తూ వెంచర్లు వేస్తున్నారనే ఆరోపణలున్నాయి.


పనుల్లో నాణ్యత కరువు 

అండర్‌ గ్రౌండ్‌ కేబుల్‌ పనుల్లో నాణ్యత కరువవుతోంది. పనులు చేస్తోంది తమ వాళ్లే కావడంతో అధికారులు అటువైపు చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం ఆరుగురు కాంట్రాక్టర్లకు మాత్రమే పనులు అప్పగిస్తారని, కొత్తవాళ్లను పలు కారణాలతో పక్కన పెడతారని ప్రచారం జరుగుతోంది. విద్యుత్‌ శాఖలో ఏటా రూ. కోట్లలో పనులు జరుగుతున్నా వాటికి సంబంధించి టెండర్ల ప్రకటనలు ఎక్కడా కనిపించవు. పనులు జరుగుతున్న చోట సంబంధిత వివరాలతో బోర్డులు కూడా కనిపించవు. 

Updated Date - 2021-11-20T12:35:54+05:30 IST