‘బ్రేక్‌’ లేదు... స్లాట్‌ లేదు!

ABN , First Publish Date - 2022-09-23T09:02:26+05:30 IST

‘బ్రేక్‌’ లేదు... స్లాట్‌ లేదు!

‘బ్రేక్‌’ లేదు... స్లాట్‌ లేదు!

పాత విధానంలోనే దుర్గమ్మ దర్శనాలు


(ఆంధ్రజ్యోతి-విజయవాడ) 

‘తిరుమల తరహాలో ఈసారి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను ప్రవేశపెడుతున్నాం. రోజుకు 2వేల టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతాం. మిగిలిన టికెట్లను కౌంటర్లలో విక్రయిస్తారు. ఒక్కో ఎమ్మెల్యే రోజుకు ఐదు సిఫారసు లేఖలు, విజయవాడలో ఉన్న ప్రజా ప్రతినిధులు రోజుకు పది లేఖలు ఇవ్వొచ్చు. ఒక్కో లేఖపై ఐదుగురిని దర్శనానికి అనుమతిస్తాం’... దసరా ఉత్సవాలకు సన్నాహాక సమావేశాలు ప్రారంభించిన రోజున దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చేసిన ప్రకటన ఇది. ఈ ప్రకటన చేసినప్పుడే అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. గురువారం వివిధ శాఖల అధికారులతో దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రి తానేటి వనిత కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మరో మూడురోజుల్లో ఉత్సవాలు ప్రారంభమవుతాయనగా బ్రేక్‌ దర్శనాల నిర్ణయానికి ఈ సమావేశంలో బ్రేక్‌ పడింది. అయితే ఈ విషయాన్ని మంత్రులు గానీ, అధికారులు గానీ స్పష్టంగా చెప్పకుండా కప్పదాటు ధోరణిలో మాట్లాడారు. వీఐపీలకు ఎలాంటి టైం స్లాట్లు లేవని కలెక్టర్‌ ఢిల్లీరావు చెప్పారు. వీఐపీ జాబితాలో వచ్చిన వారంతా రూ.500 టికెట్లు కొనుగోలు చేస్తారని ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. వాస్తవానికి ఏటా వివిధ సిఫారసులతో వచ్చేవారంతా వీఐపీల జాబితాలోకి చేరిపోతున్నారు. వారికోసం కొన్ని పాయింట్లను కేటాయించి, అక్కడినుంచి ప్రత్యేక వాహనాల్లో ఇంద్రకీలాద్రి పైకి తీసుకెళ్లేవారు. సామాన్య భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో ఉంటే వీరంతా ఇలా వచ్చి, అలా దర్శనం చేసుకుని వెళ్లిపోతున్నారు. ఈసారి సిఫారసు లేఖలతో వచ్చినవారిని కనకదుర్గ నగర్‌ నుంచి లిఫ్టుల ద్వారా పైకి పంపి, అక్కడ క్యూల్లో కలపాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం వెల్లడించగానే పెదవి విరుపులు మొదలయ్యాయి. కాగా, రోజుకు 10వేల మందిని లిఫ్టుల ద్వారా తీసుకెళ్లాలని నిర్ణయించినా వాటి సామర్థ్యాన్ని అంచనా వేసి బ్రేక్‌ విధానాన్ని రద్దు చేశామని ఓ అధికారి వివరించారు. 

Updated Date - 2022-09-23T09:02:26+05:30 IST