బుక్కులు లేక చిక్కులు

ABN , First Publish Date - 2022-06-25T05:30:00+05:30 IST

పాఠశాలలు పునః ప్రారంభమై పక్షం రోజులు కావొస్తున్నా... ప్రభుత్వం పంపిణీ చేసే ఉచిత పాఠ్యపుస్తకాలు ఇంకా విద్యార్థులకు చేరలేదు. ఆంగ్లమాధ్యమం ప్రారంభించిన నేపథ్యంలో పాఠ్యపుస్తకాల ముద్రణ ఆలస్యం కావడం వల్లే విద్యార్థులకు పంపిణీ కాలేదని అధికారులు చెబుతున్నారు.

బుక్కులు లేక చిక్కులు

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇంకా అందని పాఠ్య పుస్తకాలు
12 రోజులుగా బ్రిడ్జి కోర్సు పాఠాలతో నెట్టుకొస్తున్న పంతుళ్లు
ఆంగ్ల మాధ్యమం ప్రారంభించడం వల్లే జాప్యం
ఈ సారి పుస్తకాల్లో తెలుగు, ఆంగ్లంలో పాఠాలు
రెండు భాగాలుగా అందనున్న పుస్తకాలు
రెండు రోజుల్లో పంపిణీ అంటున్న అధికారులు
ప్రైవేటు స్కూళ్లలో ఇప్పటికే మొదలైన బోధన


వరంగల్‌ సిటీ /మహబూబాబాద్‌ ఎడ్యుకేషన్‌, జూన్‌ 25:
పాఠశాలలు పునః ప్రారంభమై పక్షం రోజులు కావొస్తున్నా...  ప్రభుత్వం పంపిణీ చేసే ఉచిత పాఠ్యపుస్తకాలు ఇంకా విద్యార్థులకు చేరలేదు. ఆంగ్లమాధ్యమం ప్రారంభించిన నేపథ్యంలో పాఠ్యపుస్తకాల ముద్రణ ఆలస్యం కావడం వల్లే విద్యార్థులకు పంపిణీ కాలేదని అధికారులు చెబుతున్నారు.   ఈ ఏడాది నుంచి 1 నుంచి 8 తరగతులకు రెండు విభాగాలుగా, ద్విభాషా పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇప్పటివరకు 50 శాతం పుస్తకాలు కూడా జిల్లాలకు చేరుకోలేదు. తక్కువ సంఖ్యలో పుస్తకాలు జిల్లా గోదాములకు చేరుకున్నాయి. వాటిని సోమవారం నుంచి మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీలకు పంపిణీ చేసేందుకు జిల్లా విద్యాశాఖ యంత్రాంగం సిద్ధం చేస్తోంది. పుస్తకాలు అందక ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు బ్రిడ్జి కోర్సును బోధిస్తున్నారు. అయితే  ప్రైవేటు పాఠశాలల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన ప్రారంభమైంది.  

రెండు విభాగాలుగా... రెండు భాషల్లో..

ఈ ఏడాది నుంచి ప్రభుత్వంప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రారంభించింది. దీంతో విద్యార్థులకు అనివార్యంగా అంగ్లమాధ్యమ పుస్తకాల అవశ్యకత ఏర్పడింది.   ఈ క్రమంలో ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసేందుకు నిర్ధేశించిన పాఠ్యపుస్తకాలను రెండు భాషల్లో ముద్రించింది. మొత్తం సిలబ్‌సను పార్ట్‌-ఎ, పార్ట్‌-బి గా విభజించి, తొలి విడతలో పార్ట్‌-ఎ అంటే 50 శాతం సిలబ్‌సతో పుస్తకాలను ముద్రించి  అందజేయనున్నారు.  9, 10 తరగతులకు గతంలోలాగానే విడివిడిగానే పంపిణీ చేయనున్నారు. సోమవారం నుంచి మండల విద్యావనరుల కేంద్రాలకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయనున్నారు.

క్యూఆర్‌ కోడ్‌

గతేడాది మాదిరిగానే ప్రభుత్వం పాఠ్యపుస్తకాలపై క్యూఆర్‌ కోడ్‌ నెంబర్లను ముద్రిస్తోంది.  పాఠ్యపుస్తకాలను అందించే క్రమంలో విద్యార్థుల ఆధార్‌నెంబర్‌ను అనుసంధానం చేస్తూ వారికి ఇచ్చే పాఠ్యపుస్తకంపై ఉన్న సీరియల్‌ నెంబర్‌ను రాసుకొని దానిని ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. ఈ విధంగా చేయటం వల్ల ప్రభుత్వం అందించే పాఠ్యపుస్తకాలు బయటి వ్యక్తులకు తరలించేందుకు అవకాశం ఉండదు.

ఆర్టీసీ కార్గో పార్సిల్‌
విద్యార్థులకు అందించే ఉచిత పాఠ్యపుస్తకాలను హైదరాబాద్‌ నుంచి ఆర్టీసీ కార్గో పార్సిల్‌ వాహనంలో   గోదాముల్లోకి  చేర్చారు. అక్కడ నుంచి  పాఠ్యపుస్తకాలను ఆయా మండల విద్యావనరుల కేంద్రాలకు చేరవేస్తున్నారు. ఆ తర్వాత ఆయా పాఠశాలలకు పంపించనున్నారు.

ఒకే పుస్తకంలో రెండు మాధ్యమాలు..
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాథ్యమాన్ని ప్రారంభించాలనే నిర్ణయంతో అందుకు అనుగుణంగా పాఠ్యపుస్తకాలను ముద్రించారు. కాగా ఒక తరగతికి చెందిన ఒక పాఠ్యపుస్తకంలో తెలుగు, ఆంగ్లమాథ్యమంలో పాఠ్యాంశాలను ముద్రించారు. తొలిసారిగా 1 నుంచి 8వ తరగతి వరకు అన్ని పాఠశాలల్లో ఆంగ్లమాథ్యమాన్ని ప్రాంరంభిస్తుండటంతో విద్యార్థులకు ఏమైనా సందేహాలు తలెత్తితే తెలుగులోనైనా నివృత్తి చేసుకునేందుకు ముద్రించినట్లు సంబంధిత విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ప్రైవేటులో పాఠాలు షురూ..
పాఠ్యపుస్తకాలు పంపిణీ కాకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో  బ్రిడ్జికోర్సు పేరుతో విద్యార్థులకు బేసిక్స్‌ నేర్పుతున్నారు. పాఠశాలలు ప్రారంభమై 15 రోజులు అయినప్పటికీ ప్రభుత్వం నిర్ధేశించిన  బ్రిడ్జి కోర్సును మాత్రం ఉపాధ్యాయులు బోధించలేకపోతున్నామని వారే చెబుతున్నారు. బడి బాటలో భాగంగా రోజుకో కార్యక్రమంతో పాఠ్యాంశాలు సరిగా కొనసాగలేకపోతున్నాయని వారు పేర్కొంటున్నారు. అయితే ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పాఠశాల పునఃప్రారంభం నుంచే అక్కడ పాఠ్యాంశాల బోధన కొనసాగుతోంది. ప్రైవేటు పాఠశాలలు వారి పాఠశాలల్లోనే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేసి మరీ పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది.

హనుమకొండ జిల్లా..

హనుమకొండ జిల్లాకు మొత్తం 3,72000 పాఠ్యపుస్తకాలు అవసరం ఉండగా, ఇప్పటి వరకు జిల్లాకు 1,34000 పాఠ్యపుస్తకాలు మాత్రమే అంటే కావాల్సిన పుస్తకాల్లో 36 శాతం మాత్రమే జిల్లా గోదాములకు చేరుకున్నాయి. అన్ని తరగతులకు కలిసి 221 టైటిల్స్‌ కావాల్సి ఉండగా 39 టైటిల్స్‌ మాత్రమే జిల్లాకు చేరుకున్నాయి. 1 నుంచి 8 తరగతుల వరకు ద్విభాషలో మొదటి భాగం పుస్తకాలు మాత్రమే వచ్చాయి. మిగతా పాఠ్యపుస్తకాలు సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసంలో రెండవ విభాగానికి చెందిన పాఠ్యపుస్తకాల పంపిణీ జరుగుతుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

వరంగల్‌ జిల్లా..
వరంగల్‌ జిల్లాకు మొత్తం 3,48000 పాఠ్యపుస్తకాలు అవసరం ఉండగా ఇప్పటి వరకు జిల్లాకు 1,58000 పాఠ్యపుస్తకాలు మాత్రమే అంటే కావాల్సిన పుస్తకాల్లో 46శాతం మాత్రమే జిల్లా గోదాములకు చేరుకున్నాయి. అన్ని తరగతులకు కలిసి 180 టైటిల్స్‌ రావాల్సి ఉండగా 33 టైటిల్స్‌ మాత్రమే వచ్చాయి.


విద్యార్థులకు వెంటనే పంపిణీ చేస్తాం...
 - బి.రంగయ్యనాయుడు, హనుమకొండ డీఈవో

ప్రస్తుతానికి జిల్లాకు 36 శాతం పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయి. వాటిని విద్యార్థులకు పంపిణీ చేసేందుకు సోమవారం నుంచి మండల విద్యా వనరుల కేంద్రాలకు పంపిణీ చేస్తున్నాం.  అక్కడ నుంచి రెండు రోజుల్లో పాఠశాలలకు పంపించి విద్యార్థులకు పంపిణీ చేస్తాం. ప్రభుత్వం పంపిణీ చేసిన పుస్తకాలను విద్యార్థులకు అందజేస్తాం. మొదటగా పార్ట్‌-1 పుస్తకాలను పంపిణీ చేస్తాం.

Updated Date - 2022-06-25T05:30:00+05:30 IST