బయోమెట్రిక్‌ హాజరు లేకపోతే కోతే!

ABN , First Publish Date - 2022-07-02T06:08:00+05:30 IST

ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై వైద్యారోగ్యశాఖ ఉద్యోగులు మండిపడుతున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే వారి పరిస్థితులు, వాస్తవాలను తెలుసుకోకుండా కొత్త నిబంధనల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

బయోమెట్రిక్‌ హాజరు లేకపోతే కోతే!

సెలవులు లేకపోతే వేతనం కట్‌

వైద్యారోగ్యశాఖలో ఉద్యోగుల పరిస్థితి ఇదీ

క్షేత్రస్థాయిలో పనిచేసే వారిలో ఆందోళన

ప్రభుత్వ నిర్ణయంపై మండిపాటు 

ఒంగోలు(కలెక్టరేట్‌), జూలై 1: ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై వైద్యారోగ్యశాఖ ఉద్యోగులు మండిపడుతున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే వారి పరిస్థితులు, వాస్తవాలను తెలుసుకోకుండా కొత్త నిబంధనల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం జూలై 1 నుంచి వైద్యారోగ్యశాఖలో  బయోమెట్రిక్‌ హాజరును తప్పని సరి చేసింది. ఉదయం, సాయంత్రం ఇలా రెండుపూటలా హాజరు వేయాలని ఆదేశించడంతో క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఆ ఆదేశాల ప్రకారం మూడు సార్లు బయోమెట్రిక్‌ హాజరు సకాలంలో వేయకపోతే సెలవులు కట్‌ చేస్తారు. ఒకవేళ ఆ ఉద్యోగికి సెలవులు లేకపోతే ఆగస్టు నుంచి ఇచ్చే వేతనంలో కోత విధిస్తారు.  


జిల్లావ్యాప్తంగా  వేల మంది ఉద్యోగులు

వైద్యారోగ్యశాఖలో క్షేత్రస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు నాలుగు వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆ ఉద్యోగులంతా తప్పనిసరిగా బయోమెట్రిక్‌ ద్వారా వేలిముద్రలు వేయాల్సి ఉంది. అందుకోసం ఆధార్‌ బేసిక్‌ బయోమెట్రిక్‌ హాజరు అనే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. దాని ద్వారా ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా బయోమెట్రిక్‌ వేయాల్సిందేనని స్పష్టం చేసింది. 


క్షేత్రస్థాయి ఉద్యోగుల్లో ఆందోళన 

ప్రభుత్వ నిర్ణయంతో క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఉదయం 10 గంటలకు తప్పనిసరిగా బయోమెట్రిక్‌ హాజరు వేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం అమలు చేసే వివిధ కార్యక్రమాలకు ముందుగానే పాల్గొనే క్షేత్ర స్థాయి సిబ్బంది ఎప్పుడు వెళ్లి బయోమెట్రిక్‌ వేసి రావాలని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సమీప సచివాలయాల్లో కూడా వేలిముద్ర వేసుకొనే అవకాశం కల్పించామని చెప్తున్నా ఆచరణలో ఎంతవరకు సాధ్యమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా మరింత ఇబ్బందులు పడాల్సిన వస్తుందనే భావన ఉద్యోగుల్లో నెలకొంది. 


Updated Date - 2022-07-02T06:08:00+05:30 IST