బిల్లు రాదు.. ఇసుక లేదు..!

ABN , First Publish Date - 2021-01-10T06:07:17+05:30 IST

జిల్లాలో 807 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2000-4000 జనాభాకు ఒక సచివాలయం చొప్పున జిల్లాలో 631 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు. అక్కడ పని చేసే 11 మంది సిబ్బంది, సర్పంచి, మీటింగ్‌ హాలు, పనుల కోసం వచ్చే ప్రజలకు అనుకూలంగా జీ+1 తరహాలో 2,062 చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన భవన నిర్మాణాలకు గత ఏడాది శ్రీకారం చుట్టారు.

బిల్లు రాదు.. ఇసుక లేదు..!
పోరుమామిళ్లలో అసంపూర్తిగా ఆగిపోయిన సచివాలయం

పలు గ్రామాల్లో అసంపూర్తిగా సచివాలయాలు

పనులు పూర్తి అయినా బిల్లుల కోసం నిరీక్షణ

జిల్లాలో రూ.252.40 కోట్లతో 631 సచివాలయాల పనులకు శ్రీకారం

పనుల్లో పురోగతిలో జిల్లా ప్రథమ స్థానం

(కడప-ఆంధ్రజ్యోతి): గ్రామ సచివాలయాల నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఒక్కో భవనానికి రూ.40 లక్షలు ఉపాధి హామీ పథకం నిధులు కేటాయించారు. 2020 డిసెంబరు ఆఖరు నాటికి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశం. గడువు పూర్తయినా 30-40 శాతం కూడా పూర్తి కాలేదు. పలు గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్నాయి. ఇసుక కొరత, నిధుల సమస్యే ప్రధాన కారణమని తెలుస్తోంది. కొన్ని సచివాలయ పనులు పూర్తి చేసినా బిల్లులు రాక దిక్కులు చూస్తున్నారు. స్థానిక అధికార పార్టీ నాయకులే కాంట్రాక్టర్లుగా పనులు చేస్తుండడం వల్ల బయటకు చెప్పలేకపోతున్నారు. అఽధికారులు మాత్రం నిధుల కొరత లేదని, పనుల పురోగతిలో రాష్ట్రంలో ప్రథమ స్థానం జిల్లాకే దక్కిందని అంటున్నారు. ఆ వివరాలపై క్షేత్రస్థాయి పరిశీలన కథనం.

జిల్లాలో 807 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2000-4000 జనాభాకు ఒక సచివాలయం చొప్పున జిల్లాలో 631 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు. అక్కడ పని చేసే 11 మంది సిబ్బంది, సర్పంచి, మీటింగ్‌ హాలు, పనుల కోసం వచ్చే ప్రజలకు అనుకూలంగా జీ+1 తరహాలో 2,062 చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన భవన నిర్మాణాలకు గత ఏడాది శ్రీకారం చుట్టారు. ఎనఆర్‌ఈజీఎ్‌స కన్వర్జేషన నిధులు ఒక్కో భవనానికి రూ.40 లక్షలు కేటాయించారు. అన్ని సచివాలయాలకు కలిపి రూ.252.40 కోట్లు మంజూరు చేశారు. 412 భవనాలు పంచాయతీరాజ్‌ (పీఆర్‌), 219 భవనాలు గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్‌) ఇంజనీర్ల పర్యవేక్షణలో చేపట్టారు. 2019 అక్టోబరులో నిధులు, పరిపాలన అనుమతులు జారీ చేసిన ప్రభుత్వం 2020 డిసెంబరులోగా పూర్తి చేసి.. 2021 సంక్రాంతి నుంచి నూతన భవనాలలో సచివాలయ పాలనను సాగించాలని భావించింది. లక్ష్యం భాగానే ఉన్నా.. ఇసుక కొరత, సకాలంలో బిల్లులు రాకపోవడంతో పురోగతి నత్తనడకన సాగుతోంది.


అప్పుల పుట్టక.. చెప్పుకోలేక..!

ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంచాయతీ ప్రత్యేక అధికారే ఈ పనులు చేయాలి. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అధికార పార్టీ స్థానిక నాయకులే కాంట్రాక్టరుగా ఈ పనులు చేస్తున్నారని సమాచారం. పనులు దక్కగానే సంబరపడ్డారు. చేతిలో ఉన్న డబ్బులు, అందినకాడికి అప్పులు చేసిన పనులు మొదలు పెట్టారు. ఒక బిల్లు మాత్రమే వచ్చింది. ఆ తరువాత బిల్లులు రాలేదని, గత ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నుంచి బిల్లులు మంజూరు కావడం లేదని మండల స్థాయి ఇంజనీర్లు, స్థానిక నాయకులు అంటున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులే పనులు చేస్తుండడంతో బిల్లులు రాక.. బయటకు చెప్పలేక, పనులు చేద్దామంటే అప్పులు పుట్టక ఆందోళన చెందుతున్నారు. వారిని ప్రశ్నిస్తే బిల్లులు రానిమాట నిజమే.. మా పేరు మాత్రం బయటకు చెప్పకండి అంటున్నారు. దీనికి తోడు ఇసుక కొరత భూతంగా మారింది. అధిక వర్షాల వల్ల నదుల్లో ఇప్పటికీ నీరు ప్రవహిస్తుండడంతో ఇసుక కొరత పీడిస్తోంది. అప్పోసప్పో చేసి పనులు పూర్తి చేద్దామంటే ఇసుక దొరకడం లేదని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు పేర్కొనడం కొసమెరుపు. పలు గ్రామాలలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐఎ్‌సఐ స్టాండర్డ్‌ కలిగిన 53 గ్రేడ్‌ సిమెంట్‌ వాడాలని ఉన్నా సాధారణ సిమెంట్‌ వాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

 

సచివాలయాల పురోగతి ఇలా

------------------------------------------------

బేస్‌మట్టం లెవల్‌లో ఉన్నవి : 74

గ్రౌండ్‌ ఫ్లోర్‌ శ్లాబ్‌ దశలో : 92

ఫస్ట్‌ఫ్లోర్‌ శ్లాబ్‌ దశలో : 85

ప్లాస్టింగ్‌, గోడల నిర్మాణ దశలో : 82

చివరి (ఫినిషింగ్‌) దశలో : 157

నిర్మాణం పూర్తయినవి : 141

----------------------------------------------------

మొత్తం : 631

----------------------------------------------------

ఆర్‌బీకే, హెల్త్‌ సెంటర్లదీ అదే పరిస్థితి

జిల్లాలో 621 రైతు భరోసా కేంద్రాలు మంజూరు చేశారు. ఉపాధి హామీ నిధులు 90 శాతం, వ్యవసాయ శాఖ నిధులు 10 శాతం కలిపి ఒక్కో భవనానికి రూ.21 లక్షలు మంజూరు చేశారు. అలాగే.. 500 హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఉపాధి నిధులు 50 శాతం, వైద్య ఆరోగ్య శాఖ నిధులు 50 శతం కలిపి రూ.17.50 లక్షలు మంజూరు చేశారు. వీటి నిర్మాణ ప్రగతి కూడా నానాటికి తీసికట్టుగా మారింది. ఆర్‌బీకేలు 17 పూర్తి కాగా 41 ఫినిషింగ్‌ దశలో, 563 వివిధ దశల్లో ఉన్నాయి. విలేజ్‌ హెల్త్‌  క్లినిక్‌లు 7 పూర్తి కాగా 12 ఫినిషింగ్‌ దశలో ఉన్నాయి. 481 వివిధ దశల్లో ఉన్నాయని ఇంజనీర్లు తెలిపారు. 


వాస్తవాలు కొన్ని..

- పోరుమామిళ్ల సచివాలయం పనులు ఇసుక కొరతతో అసంపూర్తిగా ఆగిపోయాయి. అక్టోబరు నుంచి బిల్లులు రాలేదని ఇంజినీర్లు తెలిపారు. మండలంలో 18 సచివాలయాల పనులు చేపడితే ఒక్కటి మాత్రమే పూర్తయింది. 

- రైల్వేకోడూరు సచివాలయం-3 పనులకు ఇసుక కొరత ఉంది. 30 శాతం పనులు పూర్తైనా బిల్లు రాలేదని స్థానిక అధికారులు తెలిపారు. ఈ పంచాయితీ పరిధిలో 5 సచివాలయాలు ఉంటే 1, 2 సచివాలయాలు భూసేకరణ పూర్తి చేసినా పనులు మొదలు కాలేదు. 4, 5 సచివాలయాలకు స్థలం సమస్య.

- లక్కిరెడ్డిపల్లె సచివాలయ పనులు ఫస్ట్‌ ఫ్లోర్‌ వరకు పిల్లర్లు, శ్లాబులు పూర్తి చేశారు. అక్కడితో పనులు ఆగిపోయాయి. ఇప్పటివరకు ఒక బిల్లు మాత్రమే వచ్చింది. రెండో బిల్లు పంపినా డబ్బు రాలేదని పనులు చేసిన ఇంజనీర్లు తెలిపారు. మండలంలో 15 సచివాయాల పనులు చేపడితే 11 పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఆర్‌బీకేలదీ ఇదే పరిస్థితి. 

- ముద్దనూరు మండలంలో 12 సచివాలయాలు మంజూరు అయ్యాయి. కొండాపురం సమీపంలోని రీచ నుంచి ఇసుక కేటాయించారు. గండికోట నీళ్లు రావడంతో రీచ మునిగిపోయింది. మరో రీచ కేటాయించినా రవాణా తడిసిమోపెడు అవుతుందని పనులు ఆపేశారు. ఒక్క ప్రొద్దుటూరు సబ్‌ డివిజనలోనే రూ.2 కోట్ల బిల్లులు బకాయి ఉన్నాయని పీఆర్‌ డీఈ తెలిపారు. 

-రాజంపేజ మండలం ఆకేపాడు గ్రామ సచివాలయం పనులు పూర్తి చేసి అనధికారికంగా ప్రారంభోత్సం కూడా చేశారు. నూతన భవనంలోనే కార్యాకలాపాలు సాగిస్తున్నారు. అలాగే.. రైతు భరోసా కేంద్రం, ప్రహరీ గోడ నిర్మాణాలు కూడా పూర్తి చేసి రూ.70 లక్షలకుపైగా ఖర్చు చేసినట్లు స్థానిక నాయకులు తెలిపారు. కేవలం రూ.12 లక్షలు బిల్లులు మంజూరు చేశారు. మిగిలిన బిల్లులు కోసం నిరీక్షిస్తున్నారు. ఒంటిమిట్టలోనూ ఇదే పరిస్థితి ఉంది. 


నిధుల సమస్య లేదు

- సుబ్బారెడ్డి, పంచాయతీ రాజ్‌ ఎస్‌ఈ, కడప

జిల్లాలో ఇప్పటివరకు 74 సచివాయాలు పూర్తి చేశాం. ఫస్ట్‌ఫ్లోర్‌ శ్లాబ్‌ లెవల్‌ 85, గ్రౌండ్‌ ఫ్లోర్‌ శ్లాబ్‌ లెవల్‌ 92 ఉన్నాయి. ఫినిషింగ్‌ దశలో 150 ఉన్నాయి. నిధుల సమస్య లేదు. అక్కడక్కడ ఇసుక కొరత వాస్తవమే. నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదు. పురోగతిలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాం.




Updated Date - 2021-01-10T06:07:17+05:30 IST