తబ్లిగి జమాత్ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదు : ఢిల్లీ పోలీసులు

ABN , First Publish Date - 2020-05-26T23:50:34+05:30 IST

కోవిడ్-19 నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌

తబ్లిగి జమాత్ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదు : ఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీ : కోవిడ్-19 నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌ ప్రార్థనల్లో పాల్గొన్న తబ్లిగి జమాత్ సభ్యులను అరెస్టు చేయలేదని, నిర్బంధించలేదని ఢిల్లీ పోలీసులు మంగళవారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. 


ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఢిల్లీలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిన సంగతి తెలిసిందే. నిజాముద్దీన్‌లో పెద్ద సంఖ్యలో తబ్లిగి జమాత్ ప్రార్థనల్లో పాల్గొన్నవారిలో చాలా మందికి ఈ వ్యాధి కనిపించింది. అధికారులు వీరిని ఢిల్లీలోని క్వారంటైన్ సెంటర్లలో ఉంచారు. 


నిజాముద్దీన్ మర్కజ్ మత ప్రార్థనల్లో పాల్గొన్న విదేశీ తబ్లిగి జమాత్ సభ్యులను క్వారంటైన్ సెంటర్ల నుంచి విడుదల చేయాలని, వారిని కమ్యూనిటీ ఖర్చులతో వేరొక చోట ఉంచుతామని పిటిషనర్లు ఢిల్లీ హైకోర్టును కోరారు. మార్చి 30 నుంచి 916 మంది విదేశీ తబ్లిగి జమాత్ సభ్యులు క్వారంటైన్‌లో ఉన్నారని, వీరిని విడుదల చేయాలని కోరారు. వీరికి కోవిడ్-19 నెగెటివ్ అని నిర్థరణ అయినప్పటికీ క్వారంటైన్ సెంటర్లలోనే ఉంచుతున్నారని ఆరోపించారు. పిటిషనర్లతోపాటు దాదాపు 900 మంది విదేశీ తబ్లిగి జమాత్ సభ్యులు దర్యాప్తులో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. 


ఈ పిటిషన్‌పై స్పందించాలని ఢిల్లీ పోలీసులను, ఢీల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. 


ఢిల్లీ ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సెల్ రాహుల్ మెహ్రా మాట్లాడుతూ, ఈ కేసులో దర్యాప్తు రోజువారీ జరుగుతోందని, ఓ వారంలోగా సంబంధిత ట్రయల్ కోర్టులో అభియోగ పత్రాన్ని పోలీసులు దాఖలు చేస్తారని హైకోర్టుకు తెలిపారు. 


Updated Date - 2020-05-26T23:50:34+05:30 IST