కేసీఆర్‌ అవినీతిపై చర్యలేవి?

ABN , First Publish Date - 2022-05-27T08:46:05+05:30 IST

‘‘కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట కేసీఆర్‌ వేల కోట్లు దోచుకున్నారని స్వయంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డానే చెప్పారు. కేంద్రం వద్ద ఆధారాలు ఉంటే కేసీఆర్‌ అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు’’ అని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి నిలదీశారు.

కేసీఆర్‌ అవినీతిపై చర్యలేవి?

  • విభజన చట్టంలోని హామీల అమలేది?.. 
  • తెలంగాణలో గిరిజిన వర్సిటీ ఏమైంది?
  • మా చరిత్ర అంటే ఎందుకంత చులకన?..
  •  ‘పాలమూరు’కు హోదా ఎందుకివ్వరు?
  • రైతుల చావులకు మీరు బాధ్యులు కాదా?..
  •  ప్రధాని మోదీకి 9 ప్రశ్నలతో రేవంత్‌ లేఖ


హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట కేసీఆర్‌ వేల కోట్లు దోచుకున్నారని స్వయంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డానే చెప్పారు. కేంద్రం వద్ద ఆధారాలు ఉంటే కేసీఆర్‌ అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు’’ అని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి నిలదీశారు. హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటిస్తున్న నేపథ్యంలో ఆయనకు తొమ్మిది ప్రశ్నలు సంధిస్తూ రేవంత్‌ బహిరంగ లేఖ రాశారు. ఎనిమిదేళ్లుగా బీజేపీ-టీఆర్‌ఎస్‌ మధ్య ఫెవికాల్‌ బంధం ఉన్నప్పటికీ ఇక్కడి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో రెండు ప్రభుత్వాలూ విఫలమయ్యాయని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాలు తప్ప.. రాష్ట్ర ప్రయోజనాలు, రైతులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలు రెండు ప్రభుత్వాలకు పట్టడం లేదని మండిపడ్డారు. బీజేపీ-టీఆర్‌ఎస్‌ మధ్య చీకటి సంబంధం బలంగా ఉన్నదనే ఇప్పటికీ తెలంగాణ సమాజం నమ్ముతోందని, విద్యుత్తు సంస్కరణలు, విద్యా సంస్కరణల విషయంలో జాతీయ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని చెబుతున్న టీఆర్‌ఎస్‌... అంతర్లీనంగా ఆమోద ముద్ర వేయడమే దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌


ఆడుతున్న రాజకీయ క్రీడ.. డ్రామానేనని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు.మోదీకి రేవంత్‌ సంధించిన ప్రశ్నలు

తెలంగాణ రాష్ట్రం, ఇక్కడి ప్రజలు, మా ఉద్యమ చరిత్ర అంటే మీకు ఎందుకంత చులకన? గత పార్లమెంట్‌ సమావేశాల సందర్భంలో మా మనోభావాలను గాయపరుస్తూ మీరు మాట్లాడిన తీరు అభ్యంతరకరం. ఇప్పటికైనా ఆ మాటలు వెనక్కి తీసుకుని, క్షమాపణ చెప్పాలి.

ప్రాణహిత-చేవెళ్లను కేవలం కమీషన్ల కోసం రీ డిజైన్‌ చేశారు. ఇందులో భారీగా  అవినీతి జరిగిందని మొదటి నుంచి మేము ఆరోపిస్తున్నాం. ఈ ప్రాజెక్టు కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎంలా మారిందని మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా చెప్పారు. అవినీతిని సహించను అని బీరాలు పలికే మీరు.. కాళేశ్వరంలో అవినీతిని ఎలా ఉపేక్షిస్తున్నారు? 

బీజేపీని గెలిపిస్తే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని మీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ బాండ్‌ పేపర్‌ రాసిచ్చారు.  ఇప్పటికైనా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తారా? లేదా?

యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిన ఐటీఐఆర్‌ను మీరు రద్దు చేశారు. బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ ఊసే లేదు. కోచ్‌ ఫ్యాక్టరీని 2016లోనే మహారాష్ట్రకు తరలించుకుపోయారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం నోరు మెదిపింది లేదు. మీ దృష్టిలో తెలంగాణకు అప్రాధాన్యత దేనికి?

ఒడిశాలో నైనా కోల్‌ మైన్స్‌ టెండర్ల విషయంలో అవినీతిపై నా సహచర ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి, అధికారులకు ఫిర్యాదు చేశా. ఈ స్కాం వెనుక కేసీఆర్‌ బంధువుల పాత్ర ఉందని చెప్పాం. మీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. కారణం ఏమిటి? కేసీఆర్‌ అవినీతికి మీరే కంచెగా ఉంటున్నారా? 

కృష్ణా జలాల విషయంలో కేంద్రం వైఖరికి తోడు కేసీఆర్‌-జగన్‌ స్నేహంతో తెలంగాణకు  నష్టం జరిగింది. కర్ణాటకలో అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన మీకు..  పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకూ ఇవ్వడానికి ఇబ్బందేంటి? 

విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిన గిరిజన విశ్వవిద్యాలయానికి అతీగతీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వలేదని మీరు.. కేంద్రం నిధులు ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తోడుదొంగల్లా ఎందుకు డ్రామాలు ఆడుతున్నారు? 

2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మీరు చెప్పారు. వ్యవసాయాన్ని పండగ  చేస్తానని మీ చీకటి మిత్రుడు కేసీఆర్‌ ప్రకటించారు. దానికి భిన్నంగా ఇప్పుడు వరి వేస్తే ఉరి, పంటలను ప్రభుత్వం కొనదు.. కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తాం. బాయిల్డ్‌ రైస్‌ కొనేది లేదు... అని మీరు, కేసీఆర్‌ కలిసి ఆడుతున్న డ్రామాలు రైతులను క్షోభకు గురి చేస్తున్నాయి. వారి చావులకు బాధ్యులు మీరు కాదా?

అయోధ్య నుంచి రామేశ్వరం వరకూ రాముడి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే విధంగా రూపొదించిన ‘రామాయణం సర్క్యూట్‌‘ ప్రాజెక్టులో దక్షిణ అయోధ్యగా పేరున్న భద్రాచలాన్ని ఎందుకు చేర్చలేదు?


నా వ్యాఖ్యలను వక్రీకరించారు: రేవంత్‌

ఓ సమావేశంలో తాను మాట్లాడిన మాటలను వక్రీకరించారని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కాంగ్రెస్‌ కట్టుబడి ఉంటుందని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. సామాజిక నిర్మాణాన్ని రక్షించడానికి కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుందని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తాను ఈ తత్వాన్ని నమ్ముతానని ట్వీట్‌ చేశారు. పేర్కొన్నారు. కాగా, రెడ్లకు పగ్గాలిస్తనే పార్టీలకు మనుగడ అంటూ రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ విధానాలకు వ్యతిరేకమని ఆ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ అభిప్రాయపడ్డారు. ఆ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ అంటేనే అన్ని కులాలు, మతాల కలయిక అని ఓ ప్రకటనలో వివరించారు. రేవంత్‌ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన వివరణ ఇవ్వాలని కోరారు.

Updated Date - 2022-05-27T08:46:05+05:30 IST