జిల్లాలో నకిలీ విత్తనాలపై చర్యలేవి?

ABN , First Publish Date - 2022-05-27T04:44:26+05:30 IST

జిల్లాలో నకిలీ విత్తనాల దందా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. సీజన్‌కు ముందే కొంతమంది కేటుగాళ్లు అమాయక రైతులకు అంటగట్టేందుకు గుట్టు చప్పుడు కాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాణహిత, పెన్‌గంగా, వార్దా నది పరివాహక ప్రాంతాల మీదుగా మారుమూల మండలాలైన చింతలమానేపల్లి, కౌటాల, బెజ్జూరు, సిర్పూర్‌(టి), దహెగాం, రెబ్బెన తదితర మండలాలకు సరఫరా చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ తరుణంలో నకిలీని మట్టుబెట్టేందుకు పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు.

జిల్లాలో నకిలీ విత్తనాలపై చర్యలేవి?

ఇప్పటికే పలు మండలాల్లో పట్టివేత

రెబ్బెన, దహెగాం మండలాల్లో భారీగా పట్టుబడిన వైనం

ఏటా ఇదే తంతు.. నష్టపోతున్న రైతులు

అప్రమత్తంగా ఉండాలంటున్న వ్యవసాయ అధికారులు

చింతలమానేపల్లి, మే 26: జిల్లాలో నకిలీ విత్తనాల దందా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. సీజన్‌కు ముందే కొంతమంది కేటుగాళ్లు అమాయక రైతులకు అంటగట్టేందుకు గుట్టు చప్పుడు కాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాణహిత, పెన్‌గంగా, వార్దా నది పరివాహక ప్రాంతాల మీదుగా మారుమూల మండలాలైన చింతలమానేపల్లి, కౌటాల,  బెజ్జూరు, సిర్పూర్‌(టి), దహెగాం, రెబ్బెన తదితర మండలాలకు సరఫరా చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ తరుణంలో నకిలీని మట్టుబెట్టేందుకు పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయినా ఇప్పటికే జిల్లాలో దహెగాం మండల పరిధిలో  150కిలోల నకిలీ విత్తనాలు పట్టుబడగా, వాటి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.2.40లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అదే విధంగా రెబ్బెన మండల పరిధిలో ఇటీవల భారీగా నకిలీవిత్తనాలు పట్టుబడ్డాయి. వీటికి సంబంధించి కారకులపైన కేసులు నమోదు చేశారు. అయినప్పటికీ మండలాల్లో నకిలీ విత్తనాల సరఫరా ఆగడం లేదు. 

ఏమిటీ నకిలీ..

రాష్ట్ర ప్రభుత్వం బీటీ-2 వరకు అనుమతించింది. అయితే బీటీ-3 గ్లైసిల్‌ పేరిట అక్రమార్కులు మార్కొట్లోకి విడుదల చేస్తున్న విత్తనాలను ప్రభు త్వం అనుమతించలేదు. ఈ విత్తనాలతో పర్యావరణానికి హాని కలుగడమే కాకుండా మానవ జీవితానికి సైతం ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వీటిని రద్దు చేసింది. అయినా కొందరు అక్రమ వ్యాపారులు అధిక దిగుబడి, కలుపు లేకపోవడం పేరిట పల్లెల్లో అమాయక రైతులే లక్ష్యంగా నకిలీ విత్త నాలను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనిద్వారా రూ.లక్షలు గడిస్తు న్నారు. రైతులు తమ విలువైన భూములను నిస్సారంగా మార్చుకుంటు న్నారు. అంతే కాకుంగా గ్లైసిల్‌ విత్తనాలు వేసిన రైతుల చేన్లల్లో వరుసగా 6, 7 సంవత్సరాలు పంట సాగు చేస్తే ఆ భూముల్లో కనీసం మొలకలు కూడా మొలిసే పరిస్థితి ఉండదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.   

ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా..

ముఖ్యంగా నకిలీ విత్తనాలు ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా అవుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడవుతోంది. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంతో పాటు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ నుంచి నకిలీ విత్తనాలు సరఫరా అవుతున్నాయి. గతంలో ఎక్కడ నకిలీ విత్తనాలు పట్టుబడ్డా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కర్నూలు, నంద్యాల, నెల్లూరు తదితర ప్రాంతాల నుంచే అధికంగా వస్తున్నాయని వెల్లడైంది. విత్తనాలను అనుమానం రాకుండా రైళ్లల్లో తీసుకువచ్చి దళారులకు అనువైన ప్రదేశాల్లో నిల్వచేసి తద్వారా ఏజెంట్లు, రైతులకు అంటగడుతున్నట్లు తెలుస్తున్నది. ఏది ఏమైనా రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. 

నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవు..

- రాజేష్‌, ఏవో

నకిలీ విత్తనాలు అమ్మితే కారకులపై చట్టరిత్యా చర్యలు తప్పవు. గ్రామాల్లో ఇప్పటికే నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాం. రైతులు ఎట్టి పరిస్థితుల్లో దళారుల వద్ద విత్తనాలు కొనుగోలు చేయవద్దు. ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన దుకాణంలో విత్తనాలు కొనుగోలు చేసిన వెంటనే రశీదును తప్పకుండా తీసుకోవాలి. గ్రామాల్లో గ్లైసిల్‌ విత్తనాలు అమ్ముతున్నట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలి. వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. అలాగే రైతులు అప్రమత్తంగా ఉండాలి.

Updated Date - 2022-05-27T04:44:26+05:30 IST