ధరాఘాతంలో నెంబర్‌-1

ABN , First Publish Date - 2022-06-14T09:14:57+05:30 IST

అభివృద్ధిలో, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌-1 అని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం.

ధరాఘాతంలో నెంబర్‌-1

నిత్యావసరాల ధరల పెరుగుదలలో దేశంలోనే ప్రథమస్థానంలో తెలంగాణ

ఏడాదిలో 9.45 శాతం పెరిగిన ధరలు

జాతీయ సగటు కంటే 2.41 శాతం అధికం 

పట్టణాల కంటే గ్రామాల్లో ధరలెక్కువ 

ద్రవ్యోల్బణం గణాంకాలు వెల్లడించిన కేంద్రం


హైదరాబాద్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధిలో, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌-1 అని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. ధరల పెరుగుదలలోనూ ప్రథమ స్థానం సాధించింది. ప్రజలకు నిత్యావసరమైన వస్తువుల ధరలు దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణలోనే ఎక్కువగా పెరిగాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నిత్యావసరాల ధరలకు సంబంధించి 22 రాష్ట్రాల గణాంకాలను కేంద్రం సోమవారం ప్రకటించగా.. అందులో 9.45 శాతంతో తెలంగాణ మొదటిస్థానంలో నిలిచింది. రెండోస్థానంలో 8.52 శాతంతో మహారాష్ట్ర, మూడోస్థానంలో 8.49 శాతంతో ఆంధ్రప్రదేశ్‌ నిలిచాయి. కేవలం 4.82 శాతం ద్రవ్యోల్బణంతో కేరళ రాష్ట్రం చివరిస్థానం పొందింది. గత ఏడాదికాలంలో జాతీయ సగటు 7.04 శాతంతో పోలిస్తే.. తెలంగాణలో 2.41 శాతం అధికంగా నమోదవడం గమనార్హం. దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం రేటును మే-2021, ఈ ఏడాది మే-2022తో పోల్చారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం పెరుగుదల గణాంకాలను వేర్వేరుగా కూడా కేంద్రం ప్రకటించింది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం రేటు పెరుగుదలలోనూ తెలంగాణ 10.32 శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్‌ 8.99శాతం, ఆంధ్రప్రదేశ్‌ 8.83 శాతంతో నిలిచాయి.



పట్టణ ప్రాంతాల్లో రెండో స్థానంలో..

పట్టణ ప్రాంతాలకు సంబంధించి ప్రకటించిన ద్రవ్యోల్బణం పెరుగుదల గణాంకాల్లో 8.82 శాతంతో మహారాష్ట్ర ప్రథమస్థానంలో నిలవగా, 8.65 శాతంతో రెండోస్థానంలో తెలంగాణ ఉంది. మూడో స్థానంలో 8.53 శాతంతో జార్ఖండ్‌ నిలిచింది. గత ఏడాది కాలంలో ధరలు ఎక్కువగా పెరిగిన వస్తువుల్లో.. కూరగాయలు ప్రథమస్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో వంటనూనెలు, పాదరక్షలు (ఫుట్‌వేర్‌), సుగంధ ద్రవ్యాలు, ఇంధనం ఉన్నాయి. ఏడాదికాలంలో ఇంధనం ద్రవ్యోల్బణం 9.54 శాతం పెరగ్గా, రవాణా ఖర్చులు సైతం అదేస్థాయిలో 9.54 శాతం పెరిగాయి. వైద్య ఖర్చులు 5.49 శాతం, విద్య ఖర్చులు 4.09 శాతంగా నమోదయ్యాయి. గృహాల ధరలపై ద్రవ్యోల్బణం 3.71 శాతంగా ఉందని కేంద్రం విడుదల చేసిన గణాంకాల్లో తెలిపింది. మొత్తం 25 నిత్యావసర వస్తువులకు సంబంధించిన ధరలను కేంద్ర గణాంక శాఖ విడుదల చేయగా.. ఇందులో గత ఏడాదితో పోలిస్తే కోడిగుడ్డు ధర మాత్రమే తగ్గింది. మిగతా 24 నిత్యావసర వస్తువుల ద్రవ్యోల్బణం 4.27 శాతం నుంచి 18.26 శాతం వరకు పెరిగింది. కోడిగుడ్డు ధర ఏడాదిలో స్వల్పంగా (-4.64శాతం) తగ్గింది. 

Updated Date - 2022-06-14T09:14:57+05:30 IST