వర్షాలొస్తున్నాయ్‌.. జాగ్రత్త!

ABN , First Publish Date - 2022-07-07T03:56:01+05:30 IST

వర్షాల సీజన్‌ మొదలైనందున పారిశుధ్యం మరింత మెరుగుపడాలని ఎన్‌ఎంసీ కమిషనర్‌ ఎం.జాహ్నవి సిబ్బందిని ఆదేశించారు.

వర్షాలొస్తున్నాయ్‌.. జాగ్రత్త!
నీటి పంపిణీ యంత్రాలను పరిశీలిస్తున్న కమిషనర్‌

పారిశుధ్య సిబ్బందిని ఆదేశించిన కమిషనర్‌ 

నెల్లూరు(సిటీ), జూలై 6 : వర్షాల సీజన్‌ మొదలైనందున పారిశుధ్యం మరింత మెరుగుపడాలని ఎన్‌ఎంసీ కమిషనర్‌ ఎం.జాహ్నవి సిబ్బందిని ఆదేశించారు. బుధవారం నగరంలోని 10వ డివిజన్‌ పరిధిలోని ఏసీనగర్‌ తదితర ప్రాంతాల్లో ఆమె ఆకస్మిక తనిఖీలు చేశారు. స్థానికుల నుంచి సమస్యలు తెలుసుకున్న ఆమె అందుబాటులో ఉన్న ఉద్యోగులు, సిబ్బందితో చర్చించారు. వర్షాల సీజన్‌ మొదలైనందున పారిశుధ్యంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. రోడ్లపై చెత్త, మురుగు కాలువల్లో వ్యర్థాలు కనపడకూడదన్నారు. ఇంటింటా చెత్త సేకరణ మెరుగ్గా జరగాలని చెప్పారు. అంటు రోగాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేలా ప్రజల భాగస్వామ్యం ఉండాలన్నారు. వ్యర్థాలను బహిరంగ ప్రాంతాల్లో వేయవద్దని సూచించారు. 

సీడీఎంఏ అభినందనలు 

నెల్లూరులో చెత్తపై పన్ను వసూళ్లకు కార్పొరేషన్‌ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు భేష్‌ అంటూ సీడీఎంఏ అభినందించినట్లు ఎంహెచ్‌వో తెలిపారు. వారంలో రెండు రోజులు ప్రత్యేకించి ఇదే అంశంపై కమిషనర్‌ సమీక్ష నిర్వహించడం, సచివాలయ ఉద్యోగులను ఇందులో ప్రత్యక్ష భాగస్వాములను చేయడం ప్రశంసనీయంగా ఉందని బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సమీక్షలో సీడీఎంఏ అధికారులు కొనియాడాదరని ఆయన వెల్లడించారు. జూన్‌ నెలలో వసూళ్లు చేసిన యూజర్‌ చార్జీలు ఆశాజనకంగా ఉన్నాయని పేర్కొన్నారు. 

అగ్నిపథ్‌లో చేరికకు దరఖాస్తుల ఆహ్వానం 

భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అగ్నిపథ్‌లోని త్రివిధ దళాల్లో పని చేసేందుకు ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు  చేసుకోవాలని ఎన్‌ఎంసీ కమిషనర్‌ ఎంజాహ్నవి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు ఆగస్టు 3వ తేదీ వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు.  సెప్టెంబరు 15 నుంచి 26 వరకు నెల్లూరులోని ఏసీ స్టేడియంలో నియామకాలు జరుగుతాయని తెలిపారు. అక్టోబరు 1వ తేదీ నాటికి పదిహేడున్నర సంవత్సరం నుంచి 23 ఏళ్లు వయస్సు కలిగిన వారికి ఇందులో అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 

తాగునీటి సరఫరాలో సమస్యలు రానివ్వద్దు 

మహ్మదాపురం నుంచి నెల్లూరుకు సరఫరా అవుతున్న తాగునీటి పంపిణీలో సమస్యలు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్‌ఎంసీ కమిషనర్‌ ఎం జాహ్నవి అధికారులను ఆదేశించారు. బుధవారం మహ్మదాపురం వద్దనున్న తాగునీటి పంపణీ యంత్రాలను ఆమె పరిశీలించారు. క్లియర్‌ వాటర్‌ సంప్‌లో నాన్‌ రిటర్స్‌ వాల్‌ మరమ్మతులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య, సాంకేతిక శాఖ ఎస్‌ఈ గోపాల్‌రెడ్డి, ఈఈలు శ్రీనివాస సంజయ్‌, సురే్‌ష పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-07T03:56:01+05:30 IST