ముంపులోనా పట్టాలిచ్చేది ?

ABN , First Publish Date - 2020-10-30T10:52:56+05:30 IST

పేదల కోసం నెల్లూరులోని వెంకటేశ్వరపురంలో రూపుదిద్దుకున్న ఇళ్ల స్థలాల పరిస్థితి ఏమిటా ? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ముంపులోనా పట్టాలిచ్చేది ?

 వెంకటేశ్వరపురంలో నీట మునిగిన ఇళ్ల స్థలాలు

 అక్కడ పేదల ఇళ్ల నిర్మాణం సాధ్యమేనా ?

 64 ఎకరాలు.. 3,223 ప్లాట్లతో లేఅవుట్‌

 ఆందోళనలో లబ్ధిదారులు


నెల్లూరు, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి) : పేదల కోసం  నెల్లూరులోని వెంకటేశ్వరపురంలో రూపుదిద్దుకున్న ఇళ్ల స్థలాల పరిస్థితి ఏమిటా ? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల పెన్నాకి వరద రావడంతో ఆ నీరు ఈ ఇళ్ల స్థలాల్లో చేరింది. జాతీయ రహదారికి దిగువన నిర్మించిన లేఅవుట్‌లో చాలా వరకు నీరు చేరింది. వరద కొనసాగినన్ని రోజులూ ఆ లేఅవుట్‌లో నీరు ఉండిపోయింది. దీంతో నగరంలోని లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. అక్కడ ఇళ్ల స్థలం వస్తే ఇళ్లు ఎలా నిర్మించుకోవాలని వారు భయపడుతున్నారు. అసలు ఆ ప్రాంతం వరద ముంపు ప్రాంతమని తెలిసినా, ఎలా లేఅవుట్‌ వేశారన్నదే ప్రశ్నగా మారింది. 


 ఫ ముంపు ప్రాంతాల్లోనా లేఅవుట్‌లు ?


నెల్లూరు నగర పరిధిలో పేదల ఇళ్ల కోసం సుమారు 18 వేల ప్లాట్లను అధికారులు సిద్ధం చేశారు. వెంకటేశ్వరపురంలో అపార్ట్‌మెంట్లు నిర్మించిన చోట కొంత టిడ్కో భూమి ఉండడంతో ఆ భూమిలో లేఅవుట్‌ వేశారు. ఇక ఆ పక్కనే మరికొంత భూమిని కొనుగోలు చేసి ప్లాట్లు ఏర్పాటు చేశారు. అలానే  అపార్ట్‌మెంట్లకు దిగువ భాగంలో జాతీయ రహదారికి తూర్పున 64 ఎకరాలను, ఎకరం రూ.30లక్షలు చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేసింది. అందులో ఆరు అంకణాల చొప్పున 3,223 ప్లాట్లను సిద్ధం చేశారు. ఈ ప్లాట్లలోకి ఇటీవల వరద నీరు చేరింది. మోస్తరు వరదకే మునిగిపోయాయంటే ఇంకా భారీ వరద వస్తే పరిస్థితి ప్రమాదకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాగా పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే కార్యక్రమం పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తున్నది. ఈ స్థలాలను పేదలకు అందించిన తర్వాత ఆ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోవాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఐదేళ్లలో అందరూ ఇళ్లు నిర్మించుకునేలా సన్నాహాలు జరుగుతున్నాయి. 


ఫ పేదల కలవరం


ఇలాంటి సందర్భంలో వరద ముంపు ఉన్న స్థలాల్లో ఇళ్ల నిర్మాణం ఎంత వరకు భద్రమన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇదే ఇప్పుడు పేదలను కూడా కలవర పెడుతోంది. అయితే ఈ ముంపు నుంచి బయటపడాలంటే పెన్నా నదికి కరకట్ట నిర్మించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ కరకట్టకు సంబంధించి అధికార వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. అయితే కరకట్ట నిర్మాణానికి ప్రతిపాదనలు తయారయ్యేదెప్పుడు? ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చేదెప్పుడు? నిర్మాణం పూర్తయ్యేది ఎప్పుడు? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. పుష్కరకాలం కిందట మొదలైన పెన్నా బ్యారేజీ, దానికి అనుబంధమైన ఎర్త్‌ వర్క్‌ పనులే ఇంతవరకు పూర్తి కాలేదు. ఈ క్రమంలో పేదల ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.  


Updated Date - 2020-10-30T10:52:56+05:30 IST