Abn logo
Apr 2 2020 @ 04:32AM

ఎవరైనా.. ఢిల్లీ వెళ్లారా?

జిల్లాలో ఆరా తీస్తున్న అధికారులు

గ్రామస్థాయిలో విస్తృత తనిఖీలు 

ఢిల్లీ యాత్రికుల రాకతో కలవరం


(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి): సిక్కోలులో ఢిల్లీ యాత్రికుల కలకలం రేగుతోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఓ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన వారిలో కొందరికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్టు బయటపడిన విషయం తెలిసిందే. ఈ సదస్సుకు సిక్కోలు నుంచి కూడా 18 మంది హాజరయ్యారు. అందులో కొందరు స్వగ్రామాలకు చేరుకున్నారు. ముగ్గురు ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. కానీ మరో ఇద్దరి వివరాలు మాత్రం అధికారులకు లభ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో వారు ఎవరనేది అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ వెళ్లివచ్చిన వారు ఎక్కడెక్కడ పర్యటించారు. జిల్లాకు వచ్చిన తర్వాత ఎవరెవరిని కలిశారు.. అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఇంకా ఎవరైనా ఢిల్లీ వెళ్లి వస్తే స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు పరిస్థితి అదుపులో ఉండడంతో కొంత ఊపిరి పీల్చుకుంటున్నా... లోలోపల అధికారులు, ప్రజల్లో ‘ఢిల్లీ’ గుబులు కనిపిస్తోంది.  


ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో ఒక సంస్థ గత నెల ఒకటో తేదీ నుంచి 15 వరకు మతపరమైన సదస్సు నిర్వహించింది. ఈ సదస్సుకు వెళ్లి వచ్చిన వారిలో ప్రకాశం, కడప, గుంటూరు జిల్లాలకు చెందిన కొందరికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్టు బయటపడింది. దీనికి సిక్కోలు నుంచి  కొందరు హాజరుకావడంతో.. ప్రస్తుతం జిల్లాఅంతటా ‘ఢిల్లీ’ కలవరం రేగుతోంది. ఢిల్లీకి వెళ్లినవారి సంఖ్యను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోయినా.. 18 మంది అక్కడికి హాజరైనట్టు యంత్రాంగం గుర్తించింది. ఇందులో 13 మంది వివరాలను ఇప్పటికే సేకరించింది.  వీరంతా గత నెల 19న స్వగ్రామాలకు చేరుకున్నారు.


శ్రీకాకుళం అర్బన్‌, రూరల్‌ పరిధిలో ఒక్కొక్కరు, కొత్తూరు, కంచిలి మండలాల నుంచి ఇద్దరేసి, పాలకొండ, నందిగాం, పలాస-కాశీబుగ్గ, రేగిడి, సంతకవిటి, రాజాం ప్రాంతాల నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 12 మంది ఢిల్లీ వెళ్లి వచ్చినవారిలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీరిని ఇప్పటికే క్వారంటైన్‌కు తరలించి.. రక్తనమూనాలు సేకరించారు. జిల్లాకు చెందిన మరొకరు ఒడిశా రాష్ట్రం కొరాపుట్‌లో ఉన్నట్టు గుర్తించారు. మరో ముగ్గురు ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. ఇంకో ఇద్దరి వివరాలు మాత్రం అధికారులకు ఇప్పటికీ చిక్కలేదు. వారు ఎవరనేది తేలలేదు. ఆ వివరాల కోసం అధికారులు మరింత ఆరా తీస్తున్నారు.  


ఎవరెవరిని కలిశారు....

ఢిల్లీ నుంచి గత నెల 19న చేరుకున్న జిల్లావాసులు ఎవరితో కలిశారు? కుటుంబ సభ్యులతో ఎన్ని రోజులు ఉన్నారు? ఇతర ప్రాంతాలకు వెళ్లి ఎవరినైనా కలిశారా? అనే  వివరాలను అధికారులు ఆరా తీస్తున్నారు. వారి కుటుంబ సభ్యుల నమూనాలు సేకరించి.. పరీక్షలకు పంపాలని భావిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇంకా ఎవరైనా ఢిల్లీ వెళ్లి వచ్చారేమోనని ఆరా తీస్తున్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చినవారు స్వచ్ఛందంగా వచ్చి వివరాలు అందజేయాలని అధికారులు కోరుతున్నారు. ఇలా క్షేత్రస్థాయిలో అధికారులు ఢిల్లీ యాత్రికుల వెతుకులాటలో హైరానా పడుతుండడం చర్చనీయాంశంగా మారింది. 


ఐసోలేషన్‌కు పలాస వాసి

 పలాస, ఏప్రిల్‌ 1: ఢిల్లీలో ఇటీవల నిర్వహించిన మత సదస్సుకు పలాస వాసి వెళ్లి వచ్చినట్టు వైద్యసిబ్బంది గుర్తించారు. ఈ మేరకు బుధవారం ఆయనను ప్రత్యేక అంబులెన్స్‌లో ఎచ్చెర్లలోని ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించారు. ఈ నేపథ్యంలో జంట పట్టణాల్లో అలజడి రేగుతోంది. ఢిల్లీ సమావేశానికి వెళ్లి వచ్చిన వ్యక్తి ఉంటున్న ప్రాంతంలోనే ఇటీవల ఒకరికి మూడు రోజులుగా దగ్గు, జలుబు, తుమ్ములు వస్తున్నాయి.


దీంతో ఆ వ్యక్తి స్వచ్ఛందంగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు ఆస్తమా ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. మందులు వేసుకోవాలని, 14 రోజుల పాటు ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించారు. బుధవారం మునిసిపల్‌ కమిషనర్‌ టి.నాగేంద్రకుమార్‌ వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు సచివాలయ, వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇంటింటా సర్వే చేసి కరోనా బాధితులను గుర్తించాలని సూచించారు. 

Advertisement
Advertisement
Advertisement