అపార ఖనిజ సంపద.. కోనసముందర్‌ను పట్టించుకోరా?

ABN , First Publish Date - 2020-07-14T00:05:16+05:30 IST

కమ్మరిపల్లి మండలంలో ఓ మూలన విసిరేసినట్టుండే ప్రాంతం కోనసముందర్. దీని చుట్టూ గుట్టలు..

అపార ఖనిజ సంపద.. కోనసముందర్‌ను పట్టించుకోరా?

నిజామాబాద్: కమ్మరిపల్లి మండలంలో ఓ మూలన విసిరేసినట్టుండే ప్రాంతం కోనసముందర్. దీని చుట్టూ గుట్టలు, అడవులతో ప్రకృతి రమణీయత ఉట్టిపడుతూ ఉంటుంది. సుమారు 300ల ఏళ్ల క్రితం విస్తారమైన ఇసుప ఖనిజం వినియోగించబడింది. నిజాంపాలనలో ఇక్కడ ఇనుము, ఉక్కుతో వివిధ రకాల ఆయుధాలు, పనిముట్లు తయారు చేసేవారు. అత్యంత రహస్యంగా ఈ ఆయుధాల తయారీ కొనసాగింది. ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఖనిజాన్ని కరిగించే కొలిమి, ఆయుధాలను రవాణా చేసేందుకు రహస్య సొరంగ మార్గాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రాంతం ప్రపంచ స్థాయి గుర్తింపు పొందింది.


ఇక్కడి ముడి ఖనిజాన్ని మలేషియా, సింగపూర్, కొరియా, జపాన్ తదితర దేశాలకు ఎగుమతి చేశారు. దీంతో పాటు ఉక్కు, ఇనుముతో తయారు చేసిన ఆయుధాలను కొన్ని దేశాలకు విక్రయించేవారు. కొన్ని సందర్భాల్లో వివిధ రకాల ఆయుధాలు తయారు చేసి ఇక్కడే వినియోగించేవారు. వీటికి సంబంధించిన చారిత్రక ఆధారాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. ఉక్కు, ఇనుము తయారికి సంబంధించిన ముడి ఖనిజం కోనసముందర్‌లోనే లభించేది. ఈ ముడి ఖనిజం ఉత్తర తెలంగాణలోని నదిలోయలో, కొండల్లో, గుట్టల్లో వాటి ఉపరితలంపై సులభంగా లభించడం వల్ల ఇక్కడ లోహ పరిశ్రమ విస్తృతంగా అభివృద్ధి చెందింది. ఈ పరిసరాల్లో ప్రత్యేకంగా కొలుములు ఏర్పాటు చేశారు. ఒక్కో ముడి ఖనిజం ముద్ద 20 కిలోల నుంచి 100 కిలోల వరకూ ఉండేదట. ఇలాంటి ముద్దలను కరిగించడానికి వాటి ద్వారా ఆయుధాలు తయారు చేయడానికి ప్రత్యేక పరిశ్రమలు ఉండేవి. పోతుగుట్ట వద్ద ముడి సరుకును కరిగించిన పెద్ద కొలిమి ఇప్పటికీ కనిపిస్తోంది. ఖనిజాలను కరిగించడం ద్వారా వచ్చిన మడ్డి, వృదాగా పోయే వ్యర్థ ఖనిజాలకు సంబంధించిన ఆనవాళ్లు వెల్లడవుతున్నాయి. 

Updated Date - 2020-07-14T00:05:16+05:30 IST