Abn logo
Oct 16 2020 @ 12:29PM

నిజాం షుగర్స్... సీఎం కేసీఆర్ నోరు మెదపరేం?

Kaakateeya

నిజామాబాద్ జిల్లా బోధన్ సమీపంలో గల నిజాం షుగర్ ఫ్యాక్టరీకి పునరుజ్జీవం పోసే హామీ ఏళ్ల తరబడిగా ఆచరణకు నోచుకోవడం లేదు. ప్రతీ ఎన్నికల్లోనూ ఆ ఫ్యాక్టరీపై హామీని ప్రచారాస్త్రంగా వాడుకుంటున్న నాయకులు.. ఆపై గప్‌చుప్ అయిపోతున్నారు. ఒకప్పుడు ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీగా వెలుగొందిన నిజాం షుగర్స్ తాజా పరిస్థితేమిటి? సీఎం కేసీఆర్ మొదలు ఈ ప్రాంత నేతలు.. ఆ ఫ్యాక్టరీ భవిష్యత్తుపై ఎందుకు నోరు  మెదపడం లేదు? 


నిజామాబాద్ జిల్లా బోధన్ వద్ద గల నిజాం షుగర్ ఫ్యాక్టరీకి ఘనమైన చరిత్ర ఉంది. నిజాం కాలంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీగా ఇది గుర్తింపు పొందింది. ఈ ఫ్యాక్టరీ కారణంగానే ఈ ప్రాంతానికి శక్కర్ నగర్ అనే పేరొచ్చింది. ఈ ఫ్యాక్టరీ పరిధిలో సుమారు 13 వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది. ఇందులో అయిదు వేల ఎకరాలు ఫ్యాక్టరీ ఆధీనంలో ఉండగా, మిగతా ఎనిమిది వేలు రైతులకు సంబంధించిన భూములున్నాయి. ఇందులో పండించే చెరుకుతో ఫ్యాక్టరీని నడిపించారు. అప్పట్లో ఒక్కో సీజన్‌లో ఏడు లక్షల టన్నుల చెరుకును గానుగ ఆడించేవారు. దీని ద్వారా ఉత్పత్తి చేసే చక్కెరను విదేశాలకు ఎగుమతి చేసేవారు. ఇది పని చేసినంతకాలం ప్రత్యక్షంగా 500 మంది, పరోక్షంగా 2000 మంది ఉపాధి పొందేవారు. అయితే, ఇదంతా గత వైభవం.. ఇప్పుడది నడపలేక, నడిపేవారు లేక మూలనపడింది. అందరికీ తీపిని పంచుతూ.. తనపై ఆధారపడ్డ రైతులు, కార్మికులకు తీయని జీవితాన్నిచ్చిన ఈ పరిశ్రమ ఇప్పుడు కనుమరుగైంది. పారిశ్రామిక వైభవానికి చిహ్నంగా నిలిచిన ఈ ఫ్యాక్టరీ ఇప్పుడు దయనీయ స్థితికి చేరింది.వాస్తవానికి ఈ షుగర్ ఫ్యాక్టరీ నిజాం నవాబులకు కాసుల పంట పండించింది. ఏటా రికార్డు స్థాయిలో చక్కెర, మొలాసిస్ ఉత్పత్తి చేసి భారీ లాభాలు ఆర్జించారు. కాలక్రమంలో ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లింది. ప్రభుత్వ నిర్వహణ లోపాల వల్ల ఫలితాలు తారుమారయ్యాయి. కాలానుగుణంగా దీన్ని అభివృద్ధి చేయాల్సిన అధికార, పాలక యంత్రాంగం గిట్టుబాటు కావడం లేదంటూ చేతులెత్తేసింది. కొన్నేళ్లపాటు కార్మికులకు వేతనాలు కూడా ఇవ్వలేదు. దీనివల్ల భారీఎత్తున కార్మికుల వేతనాలు, రైతుల చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో 2002 ప్రాంతంలో ఫ్యాక్టరీని ప్రభుత్వం మూసేసింది. అప్పుడే దీని వ్యవహారం ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లింది. దీన్ని తిరిగి నడిపించేందుకు అప్పటి పాలకులు ఫ్యాక్టరీని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. తొలిరోజుల్లో రైతులకు వివిధ రకాల ప్రోత్సాహకాలు ఇచ్చి చెరుకు ఉత్పత్తిని పెంచారు. కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించి మళ్లీ ఉపాధి చూపించారు. అయితే, ఇవన్నీ అదనపు భారం కావడంతో ఫ్యాక్టరీ ఆధీనంలోని భూములను అమ్మేశారు. నిర్వహణ లోపాలు, భూముల అమ్మకాలు వివాదాస్పదం కావడంతో ప్రైవేటు యజమానులు లేఆఫ్ ప్రకటించారు. దీంతో రైతులు ఇతర పంటలు పండించుకోగా, కార్మికులు, ఉద్యోగులు వీధినపడ్డారు. అయితే దీని దుస్థితిని, దురవస్థను రాజకీయ నేతలు మాత్రం బాగా వాడుకుంటున్నారు. దీనికి పూర్వ వైభవం తీసుకొస్తామని ప్రతీ ఎన్నికల్లో హామీలు గుప్పించి ఓట్లు దండుకుంటున్నారు. 


తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నిజాం షుగర్స్‌పై టీఆర్ఎస్ అధినేతలు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. అప్పటి ఉద్యమ సమయంలో కానీ, ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో కానీ ఈ ఫ్యాక్టరీ గురించి చర్చ లేవనెత్తారు. స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై అనేక సందర్భాల్లో మాట్లాడారు. 2014 ఎన్నికల్లో ఈ ఫ్యాక్టరీని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుని నడిపిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో తమ ప్రభుత్వం ఏర్పడ్డ వంద రోజుల్లోపు దీనిపై నిర్ణయం తీసుకుంటామని బోధన్ వేదికగా ప్రకటించారు. ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తేవడంతోపాటు దీనిపై ఆధారపడ్డ కార్మికులు, ఉద్యోగులు, దీన్నే నమ్ముకున్న రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తీరా గద్దెనెక్కాక ఈ విషయమే మర్చిపోయారు. ఇప్పటికి రెండుసార్లు ప్రభుత్వం ఏర్పాటుచేసినా ఫ్యాక్టరీ ఊసెత్తడం లేదు. ముఖ్యమంత్రి హోదాలో ఈ ప్రాంతంలో పలుమార్లు పర్యటించిన కేసీఆర్ ఎప్పుడు కూడా షుగర్ ఫ్యాక్టరీపై తానిచ్చిన హామీని ప్రస్తావించలేదు. ఈ ప్రాంత వాసులు వినతిపత్రాలు అందజేసినా పట్టించుకోలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


కేసీఆర్ కూతురు కవిత కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఓ ప్రచార అస్త్రంగా వాడుకుంటున్నారు తప్ప ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని బాహాటంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. 2014, 2019 పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన కవిత నిజాం షుగర్స్ కు పునరుజ్జీవం తెస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రాంత రైతులు, కార్మికులకు వ్యక్తిగతంగా కూడా భరోసా ఇచ్చారు. 2014లో ఎంపీ అయిన కవిత అయిదేళ్లపాటు దీని గురించి పట్టించుకోలేదు. దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడిపించడం సాధ్యం కాదని సంకేతాలు మాత్రం ఇచ్చారు. కానీ, ప్రభుత్వపరంగా తగిన ప్రయత్నాలు చేయాలనే విషయమై చొరవ చూపలేక పోయారు. ఇప్పుడు నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత.. నిజాం షుగర్ ఫ్యాక్టరీకి పూర్వవైభవం తేవడంపై దృష్టి పెడతారన్న ఆశాభావం స్థానికుల్లో కనిపిస్తోంది.


ఇక బీజేపీకి చెందిన ప్రస్తుత ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా ఈ ఫ్యాక్టరీపై దృష్టి పెట్టారు. పాలకులు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, నిజాం షుగర్స్‌ను ప్రభుత్వమే నడిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు నిజాం షుగర్ ఫ్యాక్టరీలను పరిరక్షించాలంటూ జగిత్యాల జిల్లా నుంచి నిజామాబాద్ జిల్లాలోని బోధన్ వరకు పాదయాత్ర చేశారు. ఈ ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. ఆయన ఎన్నికలకు ముందు చేసిన హడావుడి అధికారంలోకి వచ్చాక మాత్రం కనిపించడం లేదు. అలాగే బోధన్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పి.సుదర్శన్ రెడ్డి కూడా నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ అంశంపై పలుమార్లు స్పందించారు. కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడిపించాలంటూ బోధన్ నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర చేశారు. గత ఎన్నికల ముందు ఈ అంశాన్ని లేవనెత్తిన సుదర్శన్.. అప్పుడు బోధన్ లో పెద్ద బహిరంగసభ కూడా పెట్టారు. దీనికి కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్రస్థాయి నాయకులను పిలిచి హడావుడి చేశారు. ఆ తర్వాత ఇతర నాయకుల్లాగే ఆయన కూడా గప్‌చుప్ అయిపోయారు. వీరితోపాటు వివిధ ప్రజాసంఘాలు, రైతు సంఘాలు, వామపక్ష పార్టీలు అనేక రకాల ఆందోళనలు కొనసాగించాయి. కార్మికులు, రైతులతో కలిసి ఫ్యాక్టరీ వద్ద వంద రోజులపాటు నిరవధిక నిరాహార దీక్షలు చేసినా లాభం లేకపోయింది.


మొత్తంమీద అవసరాన్ని బట్టి ఆయా పార్టీల నేతలు నిజాం షుగర్ ఫ్యాక్టరీని వాడుకుంటున్నారు. కానీ ఎవరూ కూడా చిత్తశుద్ధితో దీని పూర్వవైభవం కోసం ప్రయత్నించడం లేదు. ప్రధానంగా పాలకపక్ష నేతలు మాటిచ్చి తప్పడం తప్ప.. నిజాం షుగర్స్‌కు పునరుజ్జీవం పోయడంలో చొరవ చూపడం లేదు. ఇకనైనా ప్రభుత్వ పెద్దలు ఈ ఫ్యాక్టరీ బాగోగులు చూసుకుంటారా? లేక మళ్లీ ఎన్నికల్లో వారిచ్చే హామీ కోసం ఎదురు చూడాల్సిందేనా? అని ఈ ప్రాంత వాసులు నిట్టూరుస్తున్నారు.


Advertisement
Advertisement
Advertisement