నివర్‌ బీభత్సం

ABN , First Publish Date - 2020-11-27T07:58:58+05:30 IST

తుఫాను సృష్టించిన భీభత్సంతో జిల్లా వణికిపోయింది. వర్షంతో జనజీవనం స్తంభించింది.

నివర్‌ బీభత్సం
ఐరాల మండలం పైపల్లె వద్ద నేలకొరిగిన వరి పైరును తీసుకెళుతున్న రైతులు

వర్షాలతో స్తంభించిన జనజీవనం

బలమైన ఈదురుగాలులతో కూలిన

భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు

చాలా ప్రాంతాలకు ఆగిన రాకపోకలు,

కరెంటు లేక అంధకారంలో గ్రామాలు

తిరుమల ఘాట్‌లో విరిగిపడ్డ 

బండరాళ్ళు, వృక్షాలు

తిరుపతిలో నీటమునిగిన పలు ప్రాంతాలు

రేణిగుంట రాళ్లవాగులో ఒకరు గల్లంతు 

తెగిపోయిన గర్నిమిట్ట చెరువు నీటి

ప్రవాహంలో కొట్టుకుపోయిన కారు

ముగ్గురిని కాపాడిన పోలీసులు


తిరుపతి, నవంబరు 26( ఆంధ్రజ్యోతి): తుఫాను సృష్టించిన భీభత్సంతో జిల్లా వణికిపోయింది. వర్షంతో జనజీవనం స్తంభించింది.తూర్పు మండలాల్లో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు కుంభవృష్టి కురిసింది. పెనుగాలులతో పెద్ద పెద్ద చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి.నదుల, వాగుల ఉధృత ప్రవాహాలకు చాలా ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి. రిజర్వాయర్లు, చెరువులూ దాదాపుగా నిండిపోయాయి.పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడంతో కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరి,టమోటా తదితర పంటలు నేలవాలాయి. ముంపు భయంతో సుమారు వేలాదిమందిని యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలించింది.



తిరుపతిలో జనజీవనం అస్తవ్యస్తం 


తిరుపతి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఎడతెరపిలేని వర్షం, ఈదురుగాలులతో తిరుపతిలో జనజీవనం స్తంభించింది. డ్రైనేజీ కాలువలు నిండిపోయి రోడ్డుపై పొంగిపొర్లాయి. లీలామహల్‌, కొర్లగుంట, అశోక్‌నగర్‌ ప్రాంతంలో రోడ్లపై మూడు అడుగుల మేర వర్షపు, మురుగునీరు ప్రవహించాయి. అభివృద్ధి పనుల కోసం తవ్విన గుంటల్లోకి నీరుచేరిపోయాయి. గత పాతికేళ్లలో చూడనివిఽధంగా కపిలతీర్థం, మాల్వాడిగుండంలో నీటి ఉధ్రుతి సాగిందని స్థానికులు చెబుతున్నారు. గాలులకు పలుచోట్ల చెట్లు విరిగి పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. మల్వాడిగుండం నుంచి వచ్చిన నీరు శివజ్యోతినగర్‌ పెద్దకాలువ పొంగి రోడ్లపై ప్రవహించాయి. తిరుచానూరులోని నక్కలకాలనీలోని ఇళ్లలోకి నీరుచేరాయి. రెండురోజులుగా వీధివ్యాపారులు రోడ్లపైకి రాలేకపోయారు. అసంఘటిత కార్మికులు ఇంటికే పరిమితమయ్యారు. ఇస్కాన్‌రోడ్డులో గాలికి విద్యుత్‌ స్తంభం నేలకొరిగింది. పలుచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అధికారులతో కలసి కమిషనరు గిరీష లీలామహల్‌ సర్కిల్‌ నుంచి కరకంబాడి వరకు పరిశీలించారు. కాలువలపై అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలన్నారు. నీరు సజావుగా వెళ్లేలా ఎక్స్‌కకేటర్లతో పనులు చేపట్టాలన్నారు. కమిషనర్‌తో పాటు డీసీ చంద్రమౌళీశ్వర రెడ్డి, మున్సిపల్‌ ఇంజనీర్‌ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 


తిరుమలకూ ‘నివర్‌’ కష్టం 


తిరుమల, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో గురువారమూ వర్షం పడింది. శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధుల్లో వర్షపు నీరు జోరుగా పారింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లు దారుణంగా కనిపిస్తున్నాయి. స్వామి దర్శనానికి వెళ్లే, ఆలయం వెలుపలకు వచ్చే భక్తులు తడుస్తూనే పరుగులు తీశారు. చలితీవ్రత కూడా పెరిగింది. వర్షం నిలిచిన సందర్భంల్లో పొగమంచు తిరుమలను కప్పేసింది. దీంతో భక్తులు గదులకే పరిమితమయ్యారు. ఇక, పెనుగాలులతో మొదటి ఘాట్‌రోడ్డులోని 54వ మలుపు వద్ద భారీ వృక్షం పడిపోయింది. ఆ సమయంలో వాహనాలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గంటన్నర పాటు వాహనాల రాకపోకలు ఆగాయి. తిరుమలలో ఎంబీసీ, ఎఎంసీ, సప్తగిరి విశ్రాంతి భవనాలు, కౌస్థుభం విశ్రాంతి భవనాల వద్ద కూడా భారీ వృక్షాలు నేలకూలాయి. గదులు ఇచ్చే ఎంబీసీ కౌంటర్‌పై కూడా చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. వర్షంతో కొండపై ఉన్న మట్టి కరిగిపోయి రెండో ఘాట్‌రోడ్డులోని 9, 10, 14, 15 కిలోమీటర్ల వద్ద భారీ బండరాళ్లు, మట్టి కుప్పకూలాయి. 14వ కిలోమీటరు వద్ద వాహనం ముందు బండరాయి పడింది. భక్తులకు స్వల్పగాయాలైనట్లు తెలిసింది. విరిగిపడిన బండరాళ్లు, మట్టిని ఎప్పటికప్పుడు తొలగించి ట్రాఫిక్‌ సమస్య లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. మొదటి ఘాట్‌రోడ్డులోనూ అక్కడక్కడ రాళ్లు రోడ్డుపై పడ్డాయి. ఈ భారీ వర్షాలతో శ్రీవారిమెట్టు కాలిబాట మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. తిరుమలలోని ఐదు జలాశయాలు నిండాయి. పాపవినాశనంలో 5,240, కుమారధార 4,259, పసుపుధార 1,288, గోగర్భం 2,833, ఆకాశగంగ 685 లక్షల గ్యాలన్ల నీరు నిండి, అదనపు నీటిని దిగువకు వదులుతున్నారు. 


బాలాజీనగర్‌ వాసుల జాగారం

తిరుమల బాలాజీనగర్‌లో ఇరుకైన.. పాడైన రేకులతో ఉన్న ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి స్థానికులు ఇబ్బంది పడ్డారు. రాత్రంతా జాగారం చేశారు. బుధవారం రాత్రి 7 నుంచి గురువారం రాత్రి వరకు విద్యుత్తు సరఫరాకు విద్యుత్తు సరఫరా లేదు. అక్కడక్కడ చెట్లకొమ్మలు విరిగి ఇళ్లపై పడ్డాయి. గురువారం వేకువజామున కమ్యూనిటీ హాలు ప్రహరీ కూలడంతో పక్కనే నిలిపిఉన్న రెండు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. 



దెబ్బతిన్న 300 కిలోమీటర్ల రోడ్లు 


చిత్తూరు సెంట్రల్‌, నవంబరు 26: జిల్లాలో సుమారు 300 కిలోమీటర్ల మేర రోడ్లు, పలుచోట్ల కల్వర్టులు దెబ్బతిన్నాయని ఆర్‌అండ్‌బీ అధికారులు తెలిపారు. 25 రోడ్లలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కల్గింది. బంగారుపాళ్యం- అరగొండ మార్గం, పుంగనూరు బైపాస్‌ రోడ్డు, కలెక్టరేట్‌ సమీపంలో, మదనపల్లె- వాయల్పాడు రోడ్డు, పెనుమూరు, తదితర 14 చోట్ల ఈదురుగాలులకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఈ చెట్లను తొలగించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక తిరుపతి డివిజన్‌లోని బొప్పరాజుపాలెం, శ్రీకాళహస్తిలోని దిగువపూడి, ఊరందూరు, పంగూరు రోడ్డు, బైరెడ్డి కండ్రిగ, తమిళనాడు రోడ్డు, మదనపల్లెలోని పలు రోడ్లు కోతకు గురయ్యాయని వివరించారు. 


9,800 హెక్టార్లలో పంట నష్టం


నేడూ విద్యాసంస్థలకు సెలవు: కలెక్టర్‌

చిత్తూరు కలెక్టరేట్‌, నవంబరు 26: తుఫాన్‌ కారణంగా ప్రధానంగా.. తూర్పు మండలాల్లో ప్రాథమిక అంచనాల మేరకు 9,800 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు తెలిసిందని కలెక్టర్‌ భరత్‌గుప్తా తెలిపారు. గురువారం ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. పంట నష్టం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. శుక్రవారం నుంచి వివరాలను సేకరిస్తామని చెప్పారు. పిచ్చాటూరు, వరదయ్యపాళ్యం, శ్రీకాళహస్తి, నగరి, నారాయణవనం, నిండ్ర, విజయపురం మండలాల్లో దాదాపు 600 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న మొత్తం మూడు వేల మంది నిరాశ్రయులను సమీప పాఠశాలలు, ప్రభుత్వ భవనాలకు తరలించి, భోజన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. 20 మైనర్‌ ప్రాజెక్టులకు డ్యామేజీ జరిగినట్లు తెలిసిందన్నారు. 30 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. నష్టం అంచనా సేకరణకు కలెక్టరేట్‌లో ఐదు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశామని వివరించారు. భారీ వర్షాల కారణంగా శుక్రవారం కూడా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించామన్నారు. విధి నిర్వహణలోని అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Updated Date - 2020-11-27T07:58:58+05:30 IST