దైవం నీడనిస్తాడు!

ABN , First Publish Date - 2020-07-03T06:28:36+05:30 IST

న్యాయశీలత కలిగిన పాలకునికీ; తన జీవితాన్ని అల్లాహ్‌ ఆరాధనకు అంకితం చేసి, విధేయతతో గడిపిన యువకునికీ; మసీదు మీదనే మనసు లగ్నం చేసి, మసీదు నుంచి వెలుపలకు రాగానే, మళ్ళీ మసీదుకు ఎప్పుడు తిరిగి వెళ్తానా?

దైవం నీడనిస్తాడు!

ప్రతి మనిషికీ దేవుడి నీడ తప్ప వేరే నీడ దొరకని రోజు ఒకటి వస్తుంది. అలాంటి రోజున అల్లాహ్‌ ఎటువంటి మనుషులకు తన నీడలో ఆశ్రయం ఇస్తాడో దైవప్రవక్త మహమ్మద్‌ ఇలా వివరించారు:


‘‘న్యాయశీలత కలిగిన పాలకునికీ; తన జీవితాన్ని అల్లాహ్‌ ఆరాధనకు అంకితం చేసి, విధేయతతో గడిపిన యువకునికీ; మసీదు మీదనే మనసు లగ్నం చేసి, మసీదు నుంచి వెలుపలకు రాగానే, మళ్ళీ మసీదుకు ఎప్పుడు తిరిగి వెళ్తానా? అని నిరీక్షించే వ్యక్తికీ; స్నేహ బంధాలను కోరుకున్నా, వాటి నుంచి విడిపోయినా అన్నీ అల్లాహ్‌ ప్రేమ కోసం మాత్రమే చేసే వ్యక్తులకూ; ఉన్నత సామాజిక స్థితిలో ఉన్న స్త్రీ చెడు పనికి ఆహ్వానించినా, అల్లాహ్‌ భయపడి ఆ ఆహ్వానాన్ని తిరస్కరించిన వాడికీ; కుడి చేత్తో చేసినది ఎడమ చేతికి తెలియకుండా రహస్యంగా దానధర్మాలు చేసే వ్యక్తికీ; ఏకాంతంలో అల్లా్‌హను ధ్యానిస్తున్నప్పుడు కళ్ళారా కన్నీరు కార్చే మనిషికీ... ఈ ఏడు రకాల వ్యక్తులకూ అల్లాహ్‌ తన నీడను ఇస్తాడు.’’ 

ఈ గుణాల్లో మొదటిది న్యాయశీలత. నిత్యం న్యాయబద్ధంగా ఉండేవారిని అల్లాహ్‌ ఎంతో ఇష్టపడతాడు. వారికి గొప్ప బహుమతి ప్రసాదిస్తాడు. పవిత్ర ఖుర్‌ఆన్‌ ఆ సంగతి చెబుతోంది. ‘నిశ్చయంగా న్యాయానికి కట్టుబడేవారు అల్లాహ్‌ సన్నిధిలో కుడివైపున కాంతితో నిండిన వేదికలపై ఉంటారు. ఇహలోకంలో న్యాయానికి కట్టుబడేవారు పరలోకంలో అల్లాహ్‌ ముందు ముత్యాల వేదికపై ఉంటారు’ - అని మహా ప్రవక్త మహమ్మద్‌ పేర్కొన్నారు. 

‘‘ముగ్గురు గుణవంతులు స్వర్గవాసులవుతారు. వారు ఎవరయ్యా అంటే... న్యాయంగా పరిపాలిస్తూ, సదాచరణ చేసే రాజు. దగ్గర బంధువుల పట్లా, సాటి ముస్లింల పట్లా జాలి, దయా కలిగిన హృదయం ఉన్న వ్యక్తి. మూడో గుణవంతుడు పేదవాడైనప్పటికీ ఆత్మాభిమానంతో ఎవరి ముందూ చెయ్యి చాచని వ్యక్తి’’ అని మహా ప్రవక్త మహమ్మద్‌ తెలిపారు. (హదీస్‌ గ్రంథం)

‘‘న్యాయం చెయ్యండి. ఇది దైవభీతికి అత్యంత చేరువైన గుణం. అల్లా్‌హకు భయపడుతూ ఉండండి. మీరు చేసే పనులన్నీ అల్లా్‌హకు తెలుస్తూనే ఉంటాయి’’ అని (దివ్య ఖుర్‌ఆన్‌ - అల్‌ మాయిద 5:8) అల్లాహ్‌ స్పష్టం చేశారు. 

కాబట్టి మనిషి నిత్యం న్యాయానికీ, ధర్మానికీ కట్టుబడి ఉండాలి. అంటే న్యాయధర్మాల విషయంలో మనోవాంఛలూ, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, వర్గ దురభిమానం, రాగద్వేషాలు మనల్ని గుడ్డివారిని చెయ్యకూడదు. ఈ అంశంలో అల్లాహ్‌ పట్ల భయంతో, విధేయతతో మెలగాలి.

- మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2020-07-03T06:28:36+05:30 IST