శ్రీ గురుభ్యోనమః

ABN , First Publish Date - 2020-07-03T06:19:33+05:30 IST

మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ప్రతి దాని నుంచీ ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. అయితే ఇలా నేర్చుకున్నవన్నీ ఐహిక కర్మలను అత్యుత్తమంగా నిర్వహించుకోడానికీ, మంచి మానవుడిగా ఉండడానికీ ఉపయోగపడతాయి. కానీ పరమాత్మను తెలుసుకోవడానికీ

శ్రీ గురుభ్యోనమః

అన్ని జ్ఞానాలలోకీ పరబ్రహ్మ గురించిన జ్ఞానం గొప్పదంటుంది భారతీయ తత్త్వ చింతన. ఆ జ్ఞానాన్ని కలిగించేదే పరావిద్య. అది తప్ప మిగిలిన విద్యలన్నీ అపరావిద్యలే! పరావిద్యలోని మర్మాలను విప్పి చెప్పి, పరమపదానికి నడిపించే పరమగురువుకు అపర దైవ స్వరూపుడిగా అత్యున్నత స్థానాన్ని ఇచ్చింది మన సంస్కృతి!


మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ప్రతి దాని నుంచీ ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. అయితే ఇలా నేర్చుకున్నవన్నీ ఐహిక కర్మలను అత్యుత్తమంగా నిర్వహించుకోడానికీ, మంచి మానవుడిగా ఉండడానికీ ఉపయోగపడతాయి. కానీ పరమాత్మను తెలుసుకోవడానికీ, పరతత్త్వాన్ని గ్రహించడానికీ గురువు మార్గదర్శకత్వం కావాలి. ‘గు’ అంటే గుహ్య లేదా చీకటి. ‘రు’ అంటే తొలగించేవాడు, రూపుమాపేవాడు అని అర్థం. మనలో ఉన్న అజ్ఞానం అనే అంధకారాన్ని రూపుమాపి, జీవితాన్ని సుఖమయంగా, సౌకర్యవంతంగా, ప్రకాశవంతంగా మార్చేవాడు గురువు. సూర్యుడి వెలుగు పడి చంద్రుడు ప్రకాశించినట్టు గురువు అందించే ‘జ్ఞానం’ అనే కాంతితో శిష్యులు ప్రకాశిస్తారని చెబుతున్నాయి మన తాత్త్విక గ్రంథాలు. ఎన్నో ఆధ్యాత్మిక ప్రసంగాలు విన్నవారికైనా, మహా గ్రంథాలు చదివినవారికైనా గురుముఖమైన మార్గదర్శకత్వం కావాలి. జనన మరణ చక్రపు శృంఖలాల నుంచి బయటపడి, నిర్వాణాన్ని పొందాలంటే మొదట కావలసింది దానికి దారి చూపించే గురువు. ఆ సద్గురువు పాదాలపై పడి శరణాగతి వేడడమే సద్గతిని చేరే మార్గమని చెప్పారు పెద్దలు.


‘‘మానవ పరిమాణ క్రమంలో గురువుకు పవిత్రమైన స్థానం, అత్యున్నతమైన ప్రాధాన్యం ఉందనేది అందరూ తెలుసుకోవాలి. యుగాలూ, తరాలూ గడుస్తున్నా సరే, ఎప్పటికప్పుడు ‘గురువు’ అనే అతి ప్రాచీనమైన భావనను భారతదేశం పునరుద్ధరించుకుంటూనే ఉంది. ఆ భావనను ఆరాధిస్తూనే ఉంది. గురువుకు కైమోడ్పులు అర్పిస్తూనే ఉంది’’ అని స్వామి వివేకానంద ప్రకటించారు. 


వేద మర్మాలను విప్పినవాడు

ఏకరాశిగా ఉన్న వేదాలను నాలుగు భాగాలుగా చేసిన మహనీయుడు వ్యాసుడు. అందుకే ఆయన ‘వేద వ్యాసుడు’. అంతేకాదు, మహాభారతాన్నీ, పద్ధెనిమిది పురాణాలనూ, మరో పద్ధెనిమిది ఉపపురాణాలనూ బ్రహ్మసూత్రాలనూ ఆయన రాశాడు. ధర్మ సంస్థాపనే ధ్యేయంగా, వేద మర్మాలను విప్పి చెప్పి, ప్రాతఃస్మరణీయుడైన వ్యాసుని పుట్టినరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి. అదే ‘వ్యాస పౌర్ణమి’గా, గురు పౌర్ణమిగా ప్రసిద్ధికెక్కింది. మానవులు కర్మ,  జ్ఞాన, భక్తి, కర్మ మార్గాల్లో ఎలా నడవాలో తెలియజెప్పిన వ్యాసుడినీ, ఆ పరంపరలోని అనేకమంది సద్గురువులనూ తలచుకొని, వారిని పూజించి, సన్మార్గంలో నడిపించాల్సిందిగా ప్రార్థించడం అందరి విధి. ఆ విధిని గుర్తు చేసే రోజు గురు పౌర్ణమి.


‘గు’ అంటే గుహ్య లేదా చీకటి. ‘రు’ అంటే తొలగించేవాడు, రూపుమాపేవాడు అని అర్థం. మనలో ఉన్న అజ్ఞానం అనే అంధకారాన్ని రూపుమాపి, జీవితాన్ని సుఖమయంగా, సౌకర్యవంతంగా, ప్రకాశవంతంగా మార్చేవాడు గురువు.

Updated Date - 2020-07-03T06:19:33+05:30 IST