భగవంతుడే మన బలం

ABN , First Publish Date - 2020-06-08T09:54:39+05:30 IST

భాగవతంలో ప్రహ్లద చరిత్ర ఘట్టంలో బాలుడైన ప్రహ్లాదుని నోట వేద వ్యాస మహర్షి పలికించిన ఈ మాటలు అక్షర సత్యాలు. తండ్రి క్రుద్ధుడై అడిగిన ప్రశ్నకు సమాధానంగా స్థిరచిత్తుడైన ప్రహ్లాదుడు ‘‘ఓ రాజా! నాకు నీకు మాత్రమే కాదు, ఇతర

భగవంతుడే మన బలం

న కేవలం మే భవతశ్చ రాజన్‌! 

సవై బలం బలినాం చాపరేషామ్‌!!

పరే వరేమీ స్థిర జంగమా యే! 

బ్రహ్మాదయో యేన వశం ప్రణీతాః!!


భాగవతంలో ప్రహ్లద చరిత్ర ఘట్టంలో బాలుడైన ప్రహ్లాదుని నోట వేద వ్యాస మహర్షి పలికించిన ఈ మాటలు అక్షర సత్యాలు. తండ్రి క్రుద్ధుడై అడిగిన ప్రశ్నకు సమాధానంగా స్థిరచిత్తుడైన ప్రహ్లాదుడు ‘‘ఓ రాజా! నాకు నీకు మాత్రమే కాదు, ఇతర బలవంతులందరికీ ఆ శ్రీహరియే అసలైన బలం. ఇహపరములందున్న ఏ స్థావర జంగమములు కలవో, బ్రహ్మాదులు కలరో అట్టి వారందరూ ఆ శ్రీహరి చేతనే వశముగావించుకొనబడినారు. ఈ సర్వసృష్టికి శ్రీహరియే అసలైన బలం’’ అని చెబుతాడు. రాక్షసరాజైన హిరణ్యకశిపుడు విష్ణుద్వేషి. అతని కుమారుడు ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణు భక్తుడు. విద్యాభ్యాసకాలంలోనే తన తోటి బ్రహ్మచారులకు కూడా శ్రీహరి తత్త్వ ప్రాముఖ్యాన్ని బోధించసాగాడు. తన కుమారుని విద్యాభ్యాస పురోగతిని తెలుసుకోవాలనుకున్న ఆ రాక్షస రాజు తన కుమారుడు చెప్పిన విష్ణు పారమ్యానికి సంబంధించిన సమాధానాలను విని చకితుడై మరోసారి గురువులను హెచ్చరించి పంపాడు. ముల్లోకాల విజేతగా అహంకరించే తండ్రితోనే విష్ణు తత్త్వాన్ని వల్లించిన సందర్భంలో హిరణ్యకశిపుడు క్రుద్దుడై ‘‘నేను కోపిస్తే ముల్లోకాలు సైతం కంపించిపోతాయే, అటువంటిది నీకు ఈ బలమిచ్చింది ఎవరు?’’ అని ప్రశ్నించాడు. అప్పుడు ప్రహ్లాద కుమారుడు చెప్పిన ఈ సమాధానం భగవత్తత్త్వాన్ని అద్భుతంగా చెప్పింది. లోకంలో ఏ వ్యక్తీ తానే మహాశక్తిమంతుడిననీ, తానే మహా మేధోవంతుడననీ, తానే సర్వ సమర్థుడిననీ అహంకరించరాదన్న భావాన్ని తెలుపుతున్న ప్రహ్లాదుని పలుకులు శాశ్వత సత్యాలు. సర్వసృష్టికి మూలమైన భగవంతుడే సర్వశక్తిమంతుడు. మానవులుఎన్నడూ తన బలమే అసలైన బలంగా భావించరాదు. పంచభూతాలే సర్వవిధాలా శక్తివాహకాలు. అందుకనే భారతీయ ధర్మం వాటిని దైవాలుగా ఆరాధించే సంస్కృతిని నెలకొల్పింది. వైజ్ఞానికంగా ప్రపంచం ఎంత ఎదిగినా ప్రకృతికి లోబడి ఉండవలసిందేనన్నది నిరూపితమైన సత్యం. సనాతన ధర్మం ఆ ప్రకృతినే భగవంతునిగా భావించింది. ప్రకృతి సర్వవ్యాపకత్వం కలిగినది కనుక అది విష్ణుస్వరూపం. ఆ మాటే ప్రహ్లాదుడు నిర్భయంగా తండ్రితో చెప్పాడు.


బలయుతులకు దుర్భలులకు 

బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకున్‌

బలమెవ్వడు ప్రాణులకును

బలమెవ్వండట్టి విభుడు బల మసురేంద్రా!


అన్న ప్రహ్లాదుని మాటల్లో.. బలవంతులకైనా, బలహీనులకైనా, తనకైనా, తన తండ్రికైనా, ఆ బ్రహ్మది దేవగణాలకైనా, లోకంలో సర్వ జీవరాసులకైనా ఆ శ్రీహరియే బలమని చెప్పి.. మానవులు అహంకరించరాదన్న సందేశాన్ని అందించాడు ప్రహ్లాదుడు.

- గన్నమరాజు గిరిజా మనోహరబాబు

Updated Date - 2020-06-08T09:54:39+05:30 IST