ఉపదేశామృతం

ABN , First Publish Date - 2020-05-27T09:46:24+05:30 IST

అంతరంగాన్ని మించిన అధ్యాపకుడు లేడు. కాలాన్ని మించిన గురువు లేడు. లోకాన్ని మించిన సద్గ్రంథం లేదు. జీవితాన్ని మించిన వేదాలు లేవు. దైవాన్ని మించిన మంచి మిత్రుడు లేడు. జ్ఞాపకాలను మించిన శాస్త్రాలు లేవు. ఇంత స్పష్టంగా

ఉపదేశామృతం

అంతరంగాన్ని మించిన అధ్యాపకుడు లేడు. కాలాన్ని మించిన గురువు లేడు. లోకాన్ని మించిన సద్గ్రంథం లేదు. జీవితాన్ని మించిన వేదాలు లేవు. దైవాన్ని మించిన మంచి మిత్రుడు లేడు. జ్ఞాపకాలను మించిన శాస్త్రాలు లేవు. ఇంత స్పష్టంగా వేదాన్ని, వేదాంతాన్ని, జీవితాన్ని.. అభేదంగా, సమన్వయంగా దర్శించిన వారే దర్శనమార్గం సూచించగలరు. చూపించగలరు. నడిపించగలరు. ‘‘భోజనం చేశారా? భోజనం చెయ్యండి! చేశారు కదా!’’ అన్న సంజ్ఞాపూర్వక, వాక్పూర్వక ఆదరంతో అందరినీ దగ్గరకు చేర్చుకున్న జిల్లెళ్లమూడి అమ్మ జగత్తుకిచ్చిన ఉపదేశం ఏమిటి? ఉపదేశం పొందాలన్న మిషతో ప్రారంభమైన ప్రశ్నోత్తర మాలిక.. అమ్మ అసలు లక్ష్యానికి అంకురమైంది. తదనంతర కాలంలో ఆ ఉపదేశం సమస్త ప్రపంచానికీ మార్గదర్శనం చేయించింది. అమ్మకు ఉపదేశం ఇవ్వాలనుకున్న వారే.. చివరకు ఆమె నుంచి ఉపదేశం అందుకున్న తీరు పరమాద్భుతం!


త్రేతాయుగంలో అగస్త్యుడు శ్రీరాముడికి ఉపదేశించింది ఆదిత్య హృదయం. ద్వాపరంలో కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించింది భగవద్గీత. కలికాలంలో ఇద్దరు కలికి స్వరూపాల మధ్య సాగిన సందేహ నివారణమే.. అమ్మ అందించిన ఉపదేశ ప్రసాదం. అందులో ఎన్నో అద్భుత విషయాలు. అందులో మచ్చుకు కొన్ని.. దేనినీ విడిగా చూడనిది, అన్నీ తెలిసినా తెలిసినట్లు ఉండనిదీ, అన్నీ తానైనది, తానేమీ కానిది, ప్రత్యేకంగా లేనిది... ఇదే జ్ఞానం. ఇది నాశమెరుగనిది. దీని స్థితి అక్షరం. అది మార్పెరుగనిది ఆది, అంతం ఎరుగనిది. నిత్య, సత్య, శాశ్వతమైనది. అదే సత్యం, జ్ఞానం, అదే అనంతం. అదే బ్రహ్మ. మనం వేరు, దైవం వేరు అనుకోవటం అపరిపక్వమే. భిన్నం కాదనుకోవడమే రాగరహిత స్థితి. చివరకు అదే వేదం. అంటే తెలుసుకోవలసినది.


నీకు ఏ దేవుడంటే ఇష్టమని ప్రశ్నించటమే లోపభూయిష్టం. ఉన్నదంతా దైవమే అనుకోవాలని సనాతన ధర్మం చెబుతోంది. ఉన్నదంతా బ్రహ్మమే అనటంలోనే సమన్వయం ఉంది. చేసేదే కర్మ కాదు. చూసేది, గీసేది, రాసేది, అనుకునేది, అంటున్నది, వింటున్నది, అంతా కర్మే! కదలికలు, మెదలికలు అన్నీ కర్మలే. ప్రకృతిలో సంభవించే ప్రతి మార్పూ కర్మే! ఒకే అమృతంలోంచి వెలువడినవన్నీ పంచామృతాలే. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు, తన్మాత్రలు, పంచకోశాలు... ఇవన్నీ ఒకే మూలం నుండి వచ్చినవే. ఆ మూలమే ఆత్మ! ఆత్మకు వాడు-వీడు, ఇదీ-అదీ, అక్కడా-ఇక్కడా అంటూ లేవు. అంతా తానై, అన్నీ తానై ఉండటమే దాని స్థితి. నిదానవతీ ఉపాసనలో పాలు, పెరుగు, మీగడ, వెన్న, నెయ్యి అంటూ వీటన్నిటికీ మూలం పాలనీ, చరమం నెయ్యనీ అనుభవిస్తున్నాం. అంతా ఒకటే అయినా దాన్నే అనేకంగా భిన్న రుచులలో చవిచూస్తున్నాం. సుఖ, సంతోషాలు ద్వంద్వం! ఆనందం ద్వంద్వాతీతం!! అమ్మ ప్రకటించిన ఈ మహా పరి సత్యాలన్నీ వేద ప్రమాణికలు. యదార్థవాదాలు. తెరలెరుగని సత్యాలు. ఈ మాటలంటున్నపుడు అమ్మ వయసు 26 వసంతాలు. వింటున్న రాజమ్మకు అంతకు మూడింతల వయసెక్కువ. జ్ఞానికి వయసున్నదా? విశ్వజనీనం, సార్వకాలికం, కాలాతీతం.. జ్ఞానం అయితే.. జ్ఞానీ అంతే!

- వీఎస్‌ఆర్‌ మూర్తి, 9440603499

Updated Date - 2020-05-27T09:46:24+05:30 IST