బోర్డింగ్‌ పాస్‌లు దాచుకుంటా...

ABN , First Publish Date - 2022-05-15T18:30:25+05:30 IST

రూల్స్‌ ఫాలో అవ్వడం ఎంత ముఖ్యమో... అప్పుడప్పుడూ వాటిని బ్రేక్‌ చేయడం కూడా అంతే ముఖ్యం. ప్రత్యేకంగా సృజనాత్మక రంగంలో. కథానాయికలంటే గ్లామర్‌ మంత్రం జపించాల్సిందే అనేది ఓ రూల్‌...

బోర్డింగ్‌ పాస్‌లు దాచుకుంటా...

రూల్స్‌ ఫాలో అవ్వడం ఎంత ముఖ్యమో... అప్పుడప్పుడూ వాటిని బ్రేక్‌ చేయడం కూడా అంతే ముఖ్యం. ప్రత్యేకంగా సృజనాత్మక రంగంలో. కథానాయికలంటే గ్లామర్‌ మంత్రం జపించాల్సిందే అనేది ఓ రూల్‌. దాన్ని బద్దలు కొట్టింది నివేదా పేతురాజ్‌. ‘మెంటల్‌ మదిలో’, ‘చిత్రలహరి’, ‘రెడ్‌’, ‘పాగల్‌’... ఇలా ఏ సినిమాలో అయినా పద్ధతిగా కనిపిస్తూనే మంచి నటిగా మార్కులు తెచ్చుకొంది. తమిళంలోనూ అదే జోరుతో దూసుకుపోతున్న నివేదా పర్సనల్‌ టచ్‌ ఇది.


  • నేను మధురైలో పుట్టా. నా పదకొండో యేట మా కుటుంబం దుబాయ్‌ వెళ్లిపోయింది. అక్కడే నా ప్రాథమిక విద్య సాగింది. చిన్నప్పటి నుంచీ ‘ఫేమస్‌’ అవ్వాలని ఉండేది. కానీ అదెలాగో నాకు తెలీదు. మెల్లగా మోడలింగ్‌పై దృష్టి పెట్టాను. 2015 మిస్‌ ఇండియా యూఏఈ టైటిల్‌ గెలచుకున్నా.
  • మా తాతయ్య తెలుగువారే. మా నాన్నగారికీ తెలుగు వచ్చు. అమ్మ మాత్రం పక్కా తమిళ్‌. ఇంట్లో ఎక్కువగా తమిళమే మాట్లాడేవాళ్లు. తెలుగులో తొలి సినిమా ‘మెంటల్‌ మదిలో’ సమయానికి నాకు తెలుగు పెద్దగా రాదు. ‘రెడ్‌’ చేస్తున్నప్పుడు కాస్త పట్టు సాధించగలిగా. అందులో నా డైలాగులు కూడా తక్కువే. కాబట్టి నా డబ్బింగ్‌ నేనే చెప్పుకొన్నా.
  • ఒక్క క్షణం ఖాళీగా ఉండాలన్నా నాకు నచ్చదు. విసుగొస్తుంది. అందుకే ఏదోటి నేర్చుకుంటూనే ఉండేదాన్ని. లాక్‌డౌన్‌ సమయంలోనూ గిటార్‌ నేర్చుకొన్నా. పెయింటింగ్‌ వచ్చు. నా ఇష్టమైన హాబీ అది. మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రవేశం ఉంది. కిక్‌ బాక్సింగ్‌ అంటే ప్రాణం. రేసింగ్‌ అంటే ఇంకా ఇంకా ఇష్టం. ‘ఆడపిల్లలకు రేసింగ్‌ ఎందుకు’ అని చాలామంది అంటుంటారు. ఆ మాటంటే కోపం వస్తుంది. త్వరలోనే ఫార్ములా రేసింగ్‌లో పాల్గొంటా.
  • ఇండస్ర్టీలో చాలామంది అభద్రతా భావంతో బాధ పడుతుంటారు. అదృష్టవశాత్తూ నాకు అది లేదు. ‘ఇలాంటి సినిమాలు చేయకపోతే కెరీర్‌ ఉండదేమో’ అనే భయం నాకెప్పుడూ లేదు. సినిమాలు రాకపోయినా, ఏదో ఒక ఉద్యోగం చేసి బతికేస్తా. సాధారణమైన జీవితం నుంచి వచ్చినదాన్ని. మళ్లీ అలా బతకడానికి కూడా రెడీనే.
  • పాండిచ్చెరీలో షూటింగ్‌ చేస్తున్నప్పుడు ఓ అభిమాని  నా దగ్గరకు వచ్చాడు. మీరంటే ఇష్టం అంటూ చేయి చూపించాడు. ఆ చేతిపై నా పేరుని పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. అది చూసి షాకయ్యా. నోట మాట రాలేదు. సినిమా రంగంలో ఉండే మ్యాజిక్‌ అదే. మేం ఏమీ చేయకపోయినా.. మమ్మల్ని ఆరాధిస్తారు. గుళ్లు కట్టేస్తారు. రక్తదానాలు చేస్తారు. ఇంతకంటే గొప్ప గౌరవం ఎక్కడ దొరుకుతుంది?
  • బుద్ధిజం నా ఆలోచనల్ని మార్చింది. మార్షల్‌ ఆర్ట్స్‌ వైపు అడుగులు వేసేలా చేసింది. ట్రావెలింగ్‌ అంటే ఇష్టం. ఒంటరిగా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు నన్ను నేను విశ్లేషించుకుంటా. విమాన ప్రయాణాల్ని బాగా ఆస్వాదిస్తా. బోర్డింగ్‌ పాస్‌లను కూడా దాచుకున్నా. వాటన్నింటినీ కలిపి ఓ ఫ్రేమ్‌ చేసి పెట్టుకోవాలి. 

విజయ్‌... సూపర్‌...

విజయ్‌ సేతుపతి లాంటి నటుల్ని చూస్తే చాలా స్ఫూర్తి పొందొచ్చు. ఓ పక్క హీరోగా చేస్తూనే, విలన్‌గా నటిస్తారు. హీరోయిన్‌ తండ్రిగానూ కనిపిస్తారు. ఆయన వయసుకీ, చేసే పాత్రలకూ, ఉన్న ఇమేజ్‌కీ దేనికీ పొంతన ఉండదు. నాక్కూడా ఆయనలా ఉండాలనిపిస్తుంది. ‘నివేదా ఏదైనా చేయగలదు..’ అనే నమ్మకం దర్శకులకు కల్పించినప్పుడు నటిగా నేను గెలిచినట్టే.


కప్పు కాఫీతో రిలాక్స్‌...

ఒత్తిడిని అధిగమించడం ఓ కళ. నాకు అది తెలుసు. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా.. స్విచ్చాన్‌, స్విచ్చాఫ్‌ అయిపోతా. ఓ కప్పు కాఫీ తాగితే చాలు... రిలాక్స్‌ మోడ్‌లోకి వెళ్లిపోతా. లేదంటే మంచి మెలోడీ పాట వింటా. మెడిటేషన్‌ చేయమని అందరికీ సలహా ఇస్తుంటా. అలాగని చెట్టుకింద కూర్చుని ధ్యానం చేయవలసిన అవసరం లేదు. ఏ పనిచేసినా.. దృష్టంతా దానిపై కేంద్రీకరించడమే మెడిటేషన్‌.

Updated Date - 2022-05-15T18:30:25+05:30 IST