నష్టం లెక్క... ఎక్కిస్తారా పక్కా

ABN , First Publish Date - 2020-12-02T06:11:51+05:30 IST

నివర్‌ తుఫాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా నష్టపోయిన పంటలకు సంబంధించి వ్యవసాయశాఖ నష్టం అంచనాల సర్వే మొదలుపెట్టింది. దాదాపు 48 మండలాల్లో 538 గ్రామాల్లో 1,204 బృందాలతో వరి, ఇతర ఉద్యాన పంటల నష్టం ఏవిధంగా ఉందనేది క్షేత్ర స్థాయి సర్వే ద్వారా బాధితు

నష్టం లెక్క... ఎక్కిస్తారా పక్కా
జగ్గంపేటలో పంట నష్టం అంచనా వేస్తున్న సర్వే బృందం

జిల్లావ్యాప్తంగా మొదలైన వరి పంట నష్టం అంచనా సర్వే

తమవారినే పరిహారం జాబితాలో చేర్పించేందుకు వైసీపీ నేతల సొంత జాబితాలు

అటు భారీ వర్షాలకు చేలల్లో నామరూపాల్లేకుండా పోయిన వరి

వీటిని క్షేత్రస్థాయిలో జాగ్రత్తగా పరిశీలిస్తేనే 

నిజమైన రైతులకు న్యాయం

గడువు తక్కువ సాకుతో తూతూమంత్రంగా 

కానిస్తారేమోనని అన్నదాతల్లో ఆందోళన

ఈనెల 10కి జాబితా తయారు.. 

అభ్యంతరాల స్వీకరణ తర్వాత 15కి పూర్తి నివేదిక

8 33 శాతానికిపైగా పంట నష్టపోతేనే పరిహారం జాబితాలోకి పేరు


నివర్‌ తుఫాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా నష్టపోయిన పంటలకు సంబంధించి వ్యవసాయశాఖ  నష్టం అంచనాల సర్వే మొదలుపెట్టింది. దాదాపు 48 మండలాల్లో 538 గ్రామాల్లో 1,204 బృందాలతో వరి, ఇతర ఉద్యాన పంటల నష్టం ఏవిధంగా ఉందనేది క్షేత్ర స్థాయి సర్వే ద్వారా బాధితులను గుర్తించనుంది. అయితే అప్పుడే తమ వారి పేర్లను బాధితుల జాబితాలో చేర్చడానికి స్థానిక వైసీపీ నేతలు ఒత్తిళ్లు మొదలుపెట్టారు. దీంతో పలుకుబడిలేని అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. గడువు తక్కువగా ఉందనే సాకుతో తూతూమంత్రంగా సర్వే మమ అనిపిస్తే నష్టపోతామని కలవరపడుతున్నారు. భారీ వర్షాలకు పంట కుళ్లిపోయి నామరూపాల్లేకుండా మారిందని, ఈ నేపథ్యంలో చేలో ఏమీ లేదనే సాకుతో కోతేయకుండా జాగ్రత్తగా పరిశీలించి న్యాయం చేయాలని కోరుతున్నారు.

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో నివర్‌ తుఫాను ప్రభావంతో 32 వేల హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. ఎక్కడికక్కడ కంకులు నేలకొరిగి కుళ్లిపోయాయి. కోసిన పనలు కొట్టుకుపోయాయి. మరికొన్నిచోట్ల నీట్లో నాని రూపురేఖలు కోల్పోయాయి. వేసిన కుప్పల కిందకు నీళ్లు చేరి అడుగునుంచి పంట మొత్తం నష్టపోయింది. తద్వారా జిల్లాలో రూ.342 కోట్ల మేరకు అన్నదాతలకు పెట్టుబడి నష్టం వాటిల్లింది. వీరందరిని పరిహారం జాబితాలోకి నమోదుచేసే విషయంలో అధికారులు అనేక రకాల షరతులతో రంగంలోకి దిగారు. 33 శాతానికిపైగా పంట నష్టపోవడంతోపాటు చేలల్లో కనిపించిన పంటకే పరిహారం జాబితాలో పేరు చేర్చనున్నారు. అయితే చాలాచోట్ల పంట కుళ్లిపోయి కనీసం చేలో ఆకారం కూడా కనిపించడం లేదు. మరికొన్నిచోట్ల కోసిన తర్వాత పనలు కొట్టుకుపోవడంతోపాటు కుళ్లిముద్దయిపోయిన పంట వందల ఎకరాల్లో ఉంది. కొన్నిచోట్ల అయితే ఆయా మడుల్లో అసలు పంటే కనిపించడం లేదు. ఈనేపథ్యంలో నష్టం అంచనాలు పూర్తిస్థాయిలో వేసి అన్నదాతలను బాధితులుగా గుర్తిస్తారా?లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం 1,206 సర్వే బృందాలు పంటల వారీగా క్షేత్రస్థాయిలో సర్వే మొదలుపెట్టారు. ఇది పూర్తికావడానికి ఇంకా తొమ్మిది రోజులే ఉంది. ఈలోపు మొత్తం నష్టపోయిన పంటలను పరిశీలించడం అసాధ్యమని వ్యవసాయశాఖ చెబుతోంది. ఇక చాలాచోట్ల సర్వే బృందాలు స్థానిక అధికార పార్టీ నాయకులు చెప్పిన పేర్లను మాత్రమే పరిగణనలోకి తీసుకునే ప్రమాదం ఉంది. ఇప్పటికే పలుచోట్ల వైసీపీ నేతలు నష్టపోయిన రైతుల జాబితాలు తయారుచేసి సర్వే బృందాలకు అందించడానికి సన్నాహాలు చేస్తున్నారు.


 ఇందులో అక్టోబర్‌లో పూర్తిగా పంటపోయిన వారిపేర్లను కూడా చేర్పించేందుకు పావులు కదుపుతున్నారు. ఏమాత్రం పలుకుబడి లేని రైతుల పేర్లను జాబితాలో లేకుండా తమ వారి పేర్లను మాత్రమే నమోదుచేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ప్రతి పంటను పరిశీలిస్తేనే నిజమైన అన్నదాతలను న్యాయం జరుగుతుంది. అయితే మొత్తం బాధిత పొలాలను పరిశీలించే ఓపిక లేక నేతలు ఇచ్చిన జాబితాలు నమోదుచేసుకుంటే సర్వే తీరు ప్రశ్నార్థకంగా మారుతుంది. వాస్తవానికి తాజా వర్షాలకు జిల్లావ్యాప్తంగా 32 వేల హెక్టార్లలో వరి దెబ్బతినగా, సర్వే తర్వాత 20 వేల హెక్టార్లు మాత్రమే పరిహారం జాబితాలో చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం. పైగా అనేక మండలాల్లో నష్టపోయిన పంట విస్తీర్ణం ఎక్కువగా నమోదుచేయకుండా ప్రభుత్వానికి భారం తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. మరోవైపు పంటచేతికి వచ్చిన దశలో వరి దెబ్బతినడంతో ఒక్కో ఎకరాకు రైతు రూ.24 వేల వరకు నష్టపోగా, ఇప్పుడు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద ప్రభుత్వం రూ.6 వేలు మాత్రమే అందించనుంది.

Updated Date - 2020-12-02T06:11:51+05:30 IST