Abn logo
Nov 29 2020 @ 00:40AM

నివర్‌ నష్టం..!

తుఫానుతో జిల్లాలో పెరుగుతున్న పంటనష్టం

ఆందోళనలో అన్నదాత

వరి 95,022, మినుము 71, పత్తి 175, వేరుశెనగ 45 హెక్టార్లలో నీటమునక

31,406 హెక్టార్లలో వరిపంట నీటిలోనే..

డిసెంబరు 15 నాటికి నష్టం అంచనాలు

మళ్లీ తుఫాను హెచ్చరికలతో రైతుల్లో భయం

ఆదుకుంటామని కలెక్టర్‌ భరోసా

తుఫాను ముప్పు తప్పినా.. ముంపు సమస్య రైతులను వీడట్లేదు. పొలాల్లోనే నిల్వ ఉండిపోయిన నీరు పంటలను పాడుచేస్తోంది. ఫలితంగా జిల్లాలో వర్షాలు తగ్గినా పంటనష్టం మాత్రం పెరుగుతూనే ఉంది. మళ్లీ తుఫాను హెచ్చరికలు అన్నదాతలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి.

మచిలీపట్నం, ఆంధ్రజ్యోతి : నివర్‌ తుఫాను మిగిల్చిన నష్టం రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో రైతుల్లో ఆందోళన ప్రారంభమైంది. నేలవాలి నీటిలో తేలియాడుతున్న వరి కంకులు మొలకెత్తుతుండటంతో రైతులు పంటపై పెట్టుకున్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. డ్రెయిన్లు నిండుగా ప్రవహిస్తుండటంతో పొలాల్లో నీరు బయటకు పోని పరిస్థితి ఏర్పడింది. శనివారం కూడా జిల్లాలో అక్కడక్కడా చిరుజల్లులు కురిశాయి.  తుఫాను ముప్పుతప్పినా పొలంలోనే నీరు నిల్వ ఉండిపోయిందని, మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ధాన్యం మొలకెత్తుతుందని రైతులు చెబుతున్నారు. ఇలాంటి స్థితిలో కోత కోసినా లాభం లేదంటున్నారు.  ఇప్పటికే  పొలంలో విత్తిన మినుము మొలిచి నీటిలోనే ఉండిపోయిందని,  మినుము మొక్కలు చనిపోతాయని ఆందోళన చెందుతున్నారు. మినుము మొక్కలు చనిపోతే మళ్లీ పొలం దమ్ముచేయాలని, తక్కువ రోజుల్లో కోతకు వచ్చే మినుము రకాలను సాగు చేయాల్సి ఉంటుందంటున్నారు. దీనివల్లఖర్చు పెరుగుతుందని చెబుతున్నారు.

95,313 హెక్టార్లలో పంటలు నీటమునక

నివర్‌ తుఫాను కారణంగా శనివారం నాటికి 95,313 హెక్టార్లలో పంటలు నీట మునిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక నివేదికను  పంపారు. ఇందులో మినుము 71, వేరుశెనగ 45, పత్తి 175 హెక్టార్లలో   ఉంది. 31,406 హెక్టార్లలో పనలపై ఉన్న వరిపంట నీటిలోనే ఉందని లెక్కల్లో పేర్కొన్నారు. ఈ ఖరీఫ్‌లో జిల్లాలో 2.45 లక్షల హెక్టార్లలో వరిసాగు జరిగింది.  ఈ-క్రాప్‌ నమోదు ఎంతమేర చేశారనేది అధికారులకే తెలియాలి. 

ఈ-క్రాప్‌పై రైతుల ఆందోళన

గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, పెడన మండలాల్లో దెబ్బతిన్న పంటలను శనివారం కలెక్టర్‌ ఇంతియాజ్‌, ఎమ్మెల్యే జోగి రమేశ్‌ పరిశీలించారు. తమ పంటల వివరాలు ఈ-క్రాప్‌లో నమోదు చేయలేదని ఒక్కో మండలంలో 30 నుంచి 40 శాతం మంది రైతులు కలెక్టర్‌కు విన్నవించారు. ఇప్పుడైనా ఈ-క్రాప్‌లో తమ పంటల వివరాలను చేర్చాలని కోరారు. అసైన్డ్‌ భూముల్లో సాగు చేసిన పంటల వివరాలు అధికశాతం ఈ-క్రాప్‌లో నమోదు కాలేదని చెప్పారు. ఈ-క్రాప్‌లో పంటల వివరాలు నమోదు కాకుంటే తమ పరిస్థితి ఏమిటని, ఇప్పటికే ఎకరాకు రూ.24వేల వరకు ఖర్చు చేశామని కలెక్టర్‌కు తెలిపారు. లజ్జబండ డ్రెయిన్‌లో ఏళ్ల తరబడి పూడిక తీయకపోవడంతో  ఇబ్బందులు తలెత్తుతున్నాయని రైతులు కలెక్టర్‌, ఎమ్మెల్యే జోగి రమేశ్‌ దృష్టికి తీసుకొచ్చారు. రైతుల సమస్యలు విన్న కలెక్టర్‌ పంటనష్టం అంచనాలను డిసెంబరు 15వ తేదీలోగా సేకరిస్తామన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. పంట బీమా  వచ్చేలా నివేదికలను పంపి  రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

పంటనష్టాన్ని సక్రమంగా సేకరించండి : కలెక్టర్‌

మచిలీపట్నం, ఆంధ్రజ్యోతి : పంటనష్టం అంచనాలు సక్రమంగా, సకాలంలో సేకరించాలని  కలెక్టర్‌ ఇంతియాజ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో  శనివారం ఆయన వ్యవసాయ, రెవెన్యూ, డ్రెయినేజీ అధికారులతో సమావేశం నిర్వహించారు.  నివర్‌ తుఫాను కారణంగా దెబ్బతిన్న  పంటలను అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు.  పనలపై ఉన్న  వరిపంటకు  కూడా బీమా వర్తిస్తుందన్నారు.  కౌలు రైతులకు పంట నష్టపరిహారం అందేలా చూడాలని సూచించారు. లజ్జబండ డ్రెయిన్‌తో పాటు జిల్లాలో ఉన్న  అన్ని డ్రెయిన్ల ఆధునికీకరణకు అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. అవనిగడ్డ, పెడన మండలాల్లో వరిపంట అధికశాతం దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా అని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో  డీఆర్వో వెంకటేశ్వర్లు, వ్యవసాయశాఖ  జేడీ మోహనరావు,  డ్రెయినేజీ  ఈఈ గోపాలరావు  తదితరులు పాల్గొన్నారు.కలిదిండి మండలం కాళ్లపాలెంలో నీటిలో నానుతున్న వరి పనలు


దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ ఇంతియాజ్‌, ఎమ్మెల్యే జోగి రమేశ్‌


Advertisement
Advertisement
Advertisement